యువత నైపుణ్యాలతో ఏ రంగంలోనైనా రాణించవచ్చు.-యూత్ వీక్ సెలబ్రేషన్స్ లో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.
ఉపాధి శిక్షణ కార్యక్రమాలను వినియోగించుకోవాలి.
ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:
యువత నైపుణ్యాలను పెంపొందించుకుంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని, ప్రభుత్వం నిర్వహించే ఉపాధి శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల షెడ్యూల్లో భాగంగా నిర్వహిస్తున్న యూత్ వీక్ సెలబ్రేషన్స్ మంగళవారం గద్వాల ఏటిసి లో విద్యార్థులకు కెరీర్, స్కిల్ డెవలప్మెంట్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏటిసి కేంద్రంలో అత్యాధునిక పరికరాలతో వివిధ కోర్సుల్లో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలు యువత సృజనాత్మకతో ఇన్నోవేటివ్ గా ఆలోచించేందుకు సహకరిస్తాయన్నారు. పరిశ్రమలు, ఎస్సీ సంక్షేమ, మత్స్య శాఖలు, బ్యాంకింగ్, తదితర రంగాలు సొంతంగా వ్యాపారాలు చేసుకుని ఆర్థికంగా ఎదిగేందుకు దోహదపడతాయన్నారు. పీఎం ఈజిపి, ముద్ర, విశ్వకర్మ వంటి అనేక పథకాలను వినియోగించుకొని బ్యాంకుల ద్వారా రుణాలను పొందవచ్చన్నారు. యువత కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకుంటే స్టేజ్ ఫియర్ ఉండదని, ఇంటర్వ్యూలలోను ధైర్యంగా మాట్లాడవచ్చన్నారు. హిందీ, ఆంగ్ల భాషలు నేర్చుకుంటే ఇతర రాష్ట్రాలు, విదేశాల్లోనూ ఉద్యోగాలు పొందవచ్చన్నారు. జపనీస్, జర్మన్ వంటి భాషలు నేర్చుకునేందుకు ఆన్ లైన్ లొ అవకాశాలు ఉన్నాయని తద్వారా ఓవర్సీస్ లోనూ ఉద్యోగాలు పొందవచ్చన్నారు. సొంత ప్రాంతాల్లోనే ఉద్యోగాలు రావాలని ఖాళీగా ఉండకుండా యువత ఎక్కడికెళ్లినా తమ రంగాల్లో రాణించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. తమ తల్లిదండ్రులు చేసే వృత్తి కంటే యువత ఇంకా ఉత్తమంగా రాణించేందుకు క్రమశిక్షణ, నైపుణ్య అభివృద్ధితో తమ కెరీర్ ను గొప్పగా మలుచుకోవాలన్నారు. అనంతరం అలంపూర్ లోని పర్యాటక శాఖ దర్శనీయ స్థలాలపై ఆర్కియాలజీ శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన బ్రోచర్స్ ను జిల్లా కలెక్టర్ ఇతర అధికారులతో కలిసి విడుదల చేశారు. అలాగే ఏటీసీలో విద్యార్థులకు వివిధ కోర్సులు నేర్పించడానికి వినియోగించే యంత్ర పరికరాలను కలెక్టర్ పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఇన్చార్జి డివైఎస్ఓ రామలింగేశ్వర గౌడ్, పర్యాటకశాఖ ఏడి నాగలక్ష్మి, జిల్లా ఉపాధి కల్పనాధికారి చరణ్ దీప్, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి నుషిత, మత్స్యశాఖ అధికారి షకీలా భాను, మిషన్ భగీరథ ఈఈ శ్రీధర్, ఆర్ అండ్ బి ఈఈ ప్రగతి, ప్రిన్సిపల్ సత్యనారాయణ, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.