ధాన్యం కొనుగోళ్లలో పారదర్శకత ఉండాలి
ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్ :
కోడేరు మండల పరిధిలోని పసుపుల గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం ఆధ్వర్యంలో కొనసాగుతున్న వరి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ మంగళవారం ఉదయం సందర్శించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమగ్రంగా పరిశీలించి రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
రైతులు తీసుకొచ్చిన వరి ధాన్యాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన కలెక్టర్, ధాన్యంలో ఉన్న తేమశాతాన్ని ప్రత్యేకంగా తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం ధాన్యం కొనుగోలు జరుగుతున్నదా లేదా అనే అంశంపై అధికారులు, సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రైతులు పండించిన పంటకు న్యాయమైన ధరతో పాటు సకాలంలో చెల్లింపులు అందేలా కొనుగోలు కేంద్రాలు సమర్థవంతంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. ధాన్యంలో తేమశాతం ఎక్కువగా ఉంటే కొనుగోలు ఆలస్యం అవుతుందని రైతులకు స్పష్టంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు.
రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ధాన్యాన్ని విక్రయించగలిగేలా కొనుగోలు కేంద్రాల్లో తగిన సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా ధాన్యం నిల్వ, తూకం విధానం, రికార్డు నిర్వహణ, టోకెన్ విధానం వంటి అంశాలను కూడా కలెక్టర్ పరిశీలించారు.
అనంతరం రైతులతో నేరుగా మాట్లాడి కొనుగోలు ప్రక్రియపై వారి అభిప్రాయాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఎదురవుతున్న చిన్నపాటి సమస్యలను కూడా వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ వెంట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు.