Take a fresh look at your lifestyle.

హెచ్‌ఐవీ నియంత్రణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : డీఎంహెచ్‌ఓ డాక్టర్ కే. రవికుమార్

జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమంపై సమీక్ష

 

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్ :

జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమం అమలుపై జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కే. రవికుమార్ అధ్యక్షతన సోమవారం జిల్లా కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాలకు చెందిన ఐసీటీసీ కౌన్సిలర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లాలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్ నియంత్రణ, అవగాహన కార్యక్రమాల అమలు తీరును డీఎంహెచ్‌ఓ సమీక్షించారు.

ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ డాక్టర్ కే. రవికుమార్ మాట్లాడుతూ, ఐసీటీసీ కేంద్రాలకు వచ్చే ప్రతి వ్యక్తికి గోప్యతతో కూడిన కౌన్సెలింగ్, పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా ప్రతి గర్భిణికి హెచ్‌ఐవీ స్క్రీనింగ్ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు.

హెచ్‌ఐవీ పాజిటివ్ కేసులను గుర్తించిన వెంటనే మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఏఆర్‌టి కేంద్రానికి పంపించి సీడీ4 కౌంట్ చేయించి వెంటనే యాంటీ రెట్రో వైరల్ చికిత్స అందించాలని అధికారులకు సూచించారు. ల్యాబ్ టెక్నీషియన్లు నాణ్యమైన పరీక్షలు నిర్వహించి నివేదికలను సకాలంలో అందించాలని పేర్కొన్నారు.

స్వచ్ఛంద సంస్థలు హైరిస్క్ గ్రూపుల్లో అవగాహన కార్యక్రమాలు మరింత విస్తృతం చేయాలని, యువతలో ఎయిడ్స్‌పై ఉన్న అపోహలను తొలగించేలా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. లక్ష్యాల మేరకు పనితీరు ఉండాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ సమీక్ష సమావేశంలో దిశా కార్యక్రమ మేనేజర్ రమేష్, డీడీఎం సాయికుమార్, రవీందర్ రెడ్డి, వివిధ ఐసీటీసీ కేంద్రాల కౌన్సిలర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఎంఆర్డీఎస్ & లింక్ వర్కర్స్ స్కీం స్వచ్ఛంద సంస్థ సభ్యులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.