ముద్ర, కరీంనగర్ :
కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా గత రెండు సంవత్సరాలుగా ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన ఐఏఎస్ అధికారి పమేలా సత్పతి బదిలీ జిల్లా వ్యాప్తంగా భావోద్వేగ వాతావరణాన్ని సృష్టించింది. ఆమె సేవలు జిల్లాకు చిరస్మరణీయమని పిఎన్జిఓ జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలుస్తూ, అనాధలకు ఆదరణగా మారిన ఆమె మానవతా దృక్పథం ప్రజల్లో విశేష ప్రశంసలు అందుకుంది. ఆభాగ్యులకు వివాహాలు జరిపించడం, ప్రత్యేక అవసరాలు గల వ్యక్తులకు ధైర్యం నింపడం ద్వారా ఆమె ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసినట్లు తెలిపారు.
“ఆరోగ్య మహిళ” కార్యక్రమం ద్వారా గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించడమే కాకుండా, ప్రతి శుక్రవారం నిర్వహించిన ప్రజాసదస్సుల ద్వారా ప్రజల సమస్యలను స్వయంగా విని పరిష్కరించడం ఆమె ప్రత్యేకతగా నిలిచిందన్నారు. ప్రభుత్వ దవాఖానలో స్వయంగా చికిత్స చేయించుకోవడం ద్వారా ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రులపై విశ్వాసం పెంపొందించారని కొనియాడారు.
ఉద్యోగులు, అధికారులు, ప్రజల మధ్య సమన్వయం నెలకొల్పుతూ అందరికీ ఆప్యాయతతో సేవలందించిన పరిపాలకురాలిగా ఆమె గుర్తింపు పొందారని చెప్పారు. ఆమెను ఉద్యోగులు గుండెల్లో పెట్టుకుని గౌరవించే స్థాయికి చేరుకున్నారని పేర్కొన్నారు.
“జిల్లా కలెక్టర్లు వస్తారు, పోతారు… కానీ కొందరు మాత్రమే చరిత్ర సృష్టించి చరిత్రలో నిలిచిపోతారు. అలాంటి వారిలో పమేలా సత్పతి ఐఏఎస్ గారు ఒకరు” అని దారం శ్రీనివాస్ రెడ్డి భావోద్వేగంగా పేర్కొన్నారు. ఆమె సేవలు ఇంకొంతకాలం జిల్లాకు అందివుంటే కరీంనగర్ రూపురేఖలు మరింత మారిపోయేవని అన్నారు.
ఈ ప్రకటనను జిల్లా కార్యదర్శి లక్ష్మణరావుతో కలిసి విడుదల చేశారు.