Take a fresh look at your lifestyle.

అన్నదాతల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం -మంత్రి జూపల్లి

 

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:

అన్నదాతల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సోమవారం కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో నిల్వ ఉన్న పంటను తరలించేందుకు లారీల కొరత ఉందని రైతులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి జూపల్లి మార్క్‌ఫెడ్ డీఏంతో ఫోన్‌లో మాట్లాడి, కొనుగోలు చేసిన మొక్కజొన్నను వెంటనే తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లారీల కొరత లేకుండా చూడాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.

కొనుగోలు కేంద్రాలకు పంట తీసుకువచ్చిన వెంటనే తూకం వేయాలని, ఆలస్యం లేకుండా కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. రైతులు నిర్ణీత తేమ శాతం, నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ పంటను కేంద్రాలకు తీసుకురావాలని మంత్రి సూచించారు.

పెద్దకొత్తపల్లిలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంతో పరిసర గ్రామాల రైతులకు రవాణా ఖర్చులు తగ్గి, సమయం ఆదా అవుతుందని తెలిపారు. దళారుల జోక్యం లేకుండా రైతులకు నేరుగా మద్దతు ధర లభిస్తుందని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మార్కెటింగ్ శాఖ అధికారులు, పీఏసీఎస్ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.