💥 జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవం
నా జాతి ప్రజలకు కత్తిని చేతికివ్వలేదు…ఓటు హక్కును ఆయుధంగా ఇచ్చాను…పోరాడి రాజులౌతారో..అమ్ముకుని ఓడిపోయి బానిసలౌతారో నిర్ణయం మీ చేతుల్లోనే ఉన్నది అన్న బాబా సాహెబ్ అంబేద్కర్ మాటలు ఓటు ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయి.ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు.ప్రతి ఒక్కరు తన ఓటును ప్రలోభాలకు గురి కాకుండా నిర్భయంగా వినియోగించుకోవాలి. సమాజంలో ప్రతి ఒక్కరికి ఓటు వజ్రాయుధం. ప్రస్తుత ఎన్నికల సమయంలో ప్రతి పౌరుడికి ఓటు ఎంతో కీలకం.ఓటు హక్కు పౌరుడి అస్తిత్వానికి ప్రతీక. ప్రపంచ స్థితి గతులను మార్చే శక్తి ఓటుకు ఉంది. కానీ చాలామంది ఓటును కేవలం ఎన్నికల ప్రక్రియగా,రాజకీయ తంతుగా భావిస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెంది మనం బాగు పడాలి అనే తాపత్రయం ఉండటమే కాదు. ఓటు ముఖ్యమే. అందుకే భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని గుర్తించి ఓటు వేయాలి.
ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచేందుకు భారత ఎన్నికల సంఘం 2011 జనవరి 25 నుంచి జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తూ వస్తోంది. 1950 జనవరి 25న ఎన్నికల సంఘం ఏర్పడిన నేపథ్యంలో అందుకు గుర్తుగా జనవరి 25ను ఎంచుకుంది.”నా దేశం నా ఓటు” అనే నినాదంతో ఈ ఏడాది 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తోంది.
ప్రజాస్వామ్యానికి మూలస్తంభం ఎన్నికల వ్యవస్థ ప్రజలచేత, ప్రజల కొరకు ఏర్పడే ప్రజా ప్రభుత్వాల ఏర్పాటులో ఓటు ముఖ్య పాత్ర పోషిస్తుంది.ఓటు హక్కు వినియోగం ద్వారా ప్రజాస్వామ్యాన్ని,రాజ్యాంగాన్ని గౌరవించవలసిన బాధ్యత ప్రతి పౌరుడుపై ఉన్నది.ఓటు వినియోగం పౌరుల అస్తిత్వానికి ప్రతీక.
ఎన్నికల్లో ప్రజలు పూర్తిస్థాయిలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటే ప్రజాస్వామ్యం పరిపుష్టమవుతుంది.ఈ ఓటు హక్కు వినియోగంలో గ్రామీణ ప్రజల కంటే పట్టణ ప్రజలు ఎక్కువగా అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నట్టు గత ఎన్నికల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.ఇది మా హక్కు, అది మా హక్కు అంటూ హక్కుల గురించి మాట్లాడే ప్రజలు రాజ్యాంగాన్ని, రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును నిర్లక్ష్యం చేయడం విచారకరం.ఇచ్చిన హక్కును సద్వినియోగం చేయని వారు హక్కుల గురించి మాట్లాడటం విడ్డూరం.
కొంతమంది పౌరులు ఎన్నికల రోజున ప్రకటించిన సెలవును విశ్రాంతి దినంగా భావిస్తూ ఓటింగ్కు దూరంగా ఉంటూ కాలక్షేపం చేస్తున్నారు.పైగా నేనొక్కడినే ఓటు వేయకపోతే ఏమవుతుందని నిర్లక్ష్యంగా మాట్లాడుతుంటారు.అది వారి బాధ్యతరాహిత్యానికి నిదర్శనం. ఓటు హక్కును వినియోగించిన వారికి ప్రజాప్రతినిధులను,ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉండదనే విషయాన్ని గుర్తించాలి.మన ఓట్ల వలన సాచ్చీలురు, సమర్థులు ,నిజాయితీపరులు, సేవాగుణం కలవారు గెలుపొంది చట్టసభకు ప్రాతినిధ్యం వహించగలిగితే చట్టసభల గౌరవం పెరుగుతుంది.అంతేగాక రాజ్యాంగ నిర్మాతలు కన్నా కలలు నెరవేరి దేశ భవిష్యత్తుకు, నవసమాజ నిర్మాణానికి ప్రగతి పునాదులు పడతాయి ఒకవేళ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులలో ఎవరు నచ్చని పక్షంలో “నోటా” కు ఓటు వేసి అభ్యర్థులపై మన వైఖరిని తెలియజేయవచ్చు. అంతేగాని నిర్లిప్తతతో, నిర్లక్ష్యంతో ఓటు హక్కును వినియోగించుకోకపోవడం రాజ్యాంగాన్ని అవమానపరచడమే.
దురదృష్టవశాత్తు నేటి రాజకీయాలలో నేర చరిత, స్వార్థ చింతన కలవారి ప్రమేయం క్రమేపీ పెరుగుతూ వస్తోంది.మన నిర్లక్ష్యం వారికి అధికారాన్ని కట్టబెడుతుంది. అటువంటి వారిని నియంత్రించాలంటే మనం ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. మనం వేసే ఓటు మన భవిష్యత్తును,రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుందనే వాస్తవాన్ని గ్రహించాలి.
ఎన్నికల సమయంలో కొంతమంది అభ్యర్థులు, నాయకులు కులం,మతం ప్రాంతం మొదలైన అంశాలను అస్త్రాలుగా ఉపయోగిస్తూ ప్రజల మనోభావాలను రెచ్చగొడుతూ లబ్ధి పొందాలని చూస్తుంటారు.ప్రజలు ఆవేశంతో,భావోద్వేగంతో ఓటు వేయకూడదు.తమ విచక్షణతో, ఆలోచనతో ఓటు వేయడం ద్వారా జిమ్మిక్కులు చేసే నాయకుల ఆలోచనలకు,గారడీ మాటలకు అడ్డుకట్ట వేయవచ్చు.
డబ్బు కోసం ఓటు అమ్ముకోవడం అనేది రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును దుర్వినియోగ పరచడమే అవుతుంది,మద్యం,మాంసం ఇతర ప్రలోభాలకు లొంగి ఓటు వేస్తే మన హక్కులను రాజకీయ నాయకులకు తాకట్టు పెట్టినట్లుగా భావించాలి. డబ్బుల కోసం ఓటర్లు ఆందోళనకు దిగిన సంఘటనలు కూడా జరిగాయి అంటే మనం ఏ స్థాయికి దిగజారిపోతున్నాము ఆలోచించుకోవాలి.ప్రలోభాలకు లొంగి ఓటు వేసే వారు ప్రశ్నించే హక్కును కోల్పోతారు.
ప్రజాస్వామ్యం గెలవాలి, ధనస్వామ్యం ఓడిపోవాలి. పెట్టుబడి రాజకీయాలకు స్వస్తి పలకాలంటే ప్రజలందరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. విచక్షణతో,నిజాయితీగా ఓటు వేయాలి.ఓటు అనేది కేవలం ఎన్నికల ప్రక్రియగా,ఒక రాజకీయ తంతుగా భావించకూడదు. దానిని సామాజిక స్థితిగతులను మార్చి శక్తిగా,పౌరులను హక్కులను కాపాడే ఆయుధంగా గుర్తించాలి. ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా ఓటును వినియోగించుకోవాలి.
ఓటు హక్కు వినియోగంలో అప్రమత్తత లేకపోతే స్వార్థపరులు,అవినీతిపరులు దౌర్జన్యం చేసేవారు ప్రజాప్రతినిధులతో చట్టసభలో ప్రవేశించి మనల్ని శాసిస్తారు. మనల్ని బానిసలుగా మారుస్తారు.ఓటుని దుర్వినియోగపరచకుండా సమర్థ నాయకులను ఎన్నుకోవాలి.రాజకీయాలలో ప్రజల భాగస్వామ్యం పెరగాలంటే అందరూ తప్పనిసరిగా ఓటింగ్ లో పాల్గొనాలి.
ఏదో ఒక రోజు నా దేశ ప్రజలు ఓటు విలువ తెలుసుకొని రాజ్యాధికారం సాధించిన రోజున నేను రాసిన రాజ్యాంగం గొప్పతనం ఏమిటో అందరికీ తెలుస్తుంది అన్న అంబేద్కర్ మాటలను గుర్తు చేసుకుని ఓటు విలువను తెలుసుకోవాలి అందరూ ఓటింగ్ లో పాల్గొనాలి.కులం,మతం ప్రాంతం,ధనం,మద్యం వంటి వాటి ప్రలోభాలకు లోను కాకుండా ఓటు వేయాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి.
ప్రభుత్వాలు ఓటు యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడానికి విరివిగా ప్రసార మాధ్యమాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలి. వయస్సు పై బడిన వృద్దులకు ఇంటి నుండే ఓటు వేసే సౌకర్యాన్ని కల్పించడం ద్వారా ఓటింగ్ శాతం పెరుగుతుంది. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే ఉద్యోగులు వినియోగించుకునే బ్యాలెట్ ఓటు ప్రక్రియను మరింత సులభతరం చేయాలి. తమ చరవాణి నుండే ఓటు వేసే సౌకర్యాన్ని కల్పించాలి. పాఠశాల స్థాయినుండే ఓటు ప్రాముఖ్యతను తెలియజేస్తూ సెమినార్లు నిర్వహించాలి.
– సుధాకర్.ఏ.వి
– రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు
– స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ (STUTS)
– 9000674747