ముద్ర, తెలంగాణ బ్యూరో : టెన్త్, ఇంటర్మీడియేట్ పరీక్షల్లో మెరుగైన ఫలితాల సాధనకై కృషి చేయాలని ఉపాధ్యాయులకు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. విద్యార్ధి జీవితంలో పదో తరగతి పరీక్షలు తొలిమెట్టు అని, ప్రతి విద్యార్ధి ఉత్తీర్ణతే లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేయాలని అన్నారు. అలాగే ఇంటర్మీడియేట్ లో మెరుగైన ఫలితాలు సాధించే విధంగా విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించాలన్నారు.
ఈ మేరకు బుధవారం హైదరాబాద్ లో టెన్త్, ఇంటర్‌లో ఉత్తీర్ణత శాతం పెంపుపై సమీక్ష సమావేశాన్ని ఉన్నతాధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని పాఠశాల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. పబ్లిక్ పరీక్షలు అంటే విద్యార్థుల్లో భయం పోగొట్టేలా స్లిప్ టెస్టులను నిర్వహించాలని ఆయన సూచించారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం జ్ఞానవంతులను తయారు చేసే బాధ్యత ఉపాధ్యాయులపైన ఉందన్నారు. విద్యార్ధులు ఏయే సబ్జెక్టుల్లో వెనుకబడి ఉన్నారో గుర్తించి, వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు. ఈ సమావేశంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, డిఆర్ఓ ఈ.వెంకటాచారి, డిఈఓ రోహిణి, డి ఐ ఈ ఓ ఒడ్డెన్న, ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ అధికారులు కోటాజీ, ఆశన్న, ఇలియాస్ అహ్మద్, వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాలు, కళాశాలల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, అధ్యాపకులు పాల్గొన్నారు.