Take a fresh look at your lifestyle.

అట్టుడికిన గ్రామసభలు … జగిత్యాల జిల్లాలో మాజీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం

  • కమలాపూర్ లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై టొమాటోలతో దాడి
  • గొడవ చేస్తే తోలు తీసి, చెట్టుకి కట్టేసి కొడుతానంటూ అధికార పార్టీ ఎమ్మెల్యే ఫైర్
  • ప్రకటించిన జాబితా దరఖాస్తుదారులదేనని మాట మార్చిన డిప్యూటీ సీఎం భట్టి
  • దుబ్బాకలో టవరెక్కిన గ్రామస్తుడు
  • తుంగతుర్తిలో ఎమ్మెల్యే కాన్వాయ్ ని చుట్టుముట్టిన గ్రామస్తులు
  • కోదాడలో భయంతో పరుగులు పెట్టిన అధికారులు
  • కామారెడ్డి జిల్లా పెద్దకోడపుగల్ మండలంలో మహిళల కాళ్లు మొక్కించుకున్న కాంగ్రెస్​ నేతలు

ముద్ర, తెలంగాణ బ్యూరో : సంక్షేమ పథకాల దరఖాస్తుల స్వీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్రామసభలు అట్టుడికాయి. అధికారులు ఇటీవల ప్రకటించిన అర్హుల జాబితాలో లబ్ధిదారుల పేర్లు లేకపోవడంతో నిజనమై అర్హుల ఆవేదనలు, ఆక్రోశాలు కట్టలు తెంచుకున్నాయి. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌ కార్డులు, ఆత్మీయ భరోసా వంటి పథకాల్లో కాంగ్రెస్‌ కార్యకర్తలు, తాము చెప్పినట్లు వినే వారికే కట్టబెడుతండటంతో ఆగ్రహించిన ప్రజలు అధికారులు,కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధులపై తిరగబడ్డారు.అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రకటించిన ఆరు గ్యారంటీలు..ఇచ్చిన హామీల అమలు కోరుతూ సభను స్తంభింపజేశారు. దీంతో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. శుక్రవారం చివరి రోజు గ్రామ సభలు తీవ్ర ఉద్రిక్తతల నడుమ ముగిశాయి. తుంగతుర్తిలో నిర్వహించిన గ్రామసభలో స్ధానిక అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే మందుల సామెల్ కు నిరసన సెగ తగిలింది. ఎమ్మెల్యే ప్రసంగాన్ని అడ్డుకున్న గ్రామస్తులు ఎమ్మెల్యే గోబ్యాక్ నినాదాలు చేశారు. ఆయన అక్కడ్చుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారు. కాన్వాయ్ ని చుట్టుముట్టిన గ్రామస్తులు ఎమ్మెల్యే డౌన్ డౌన్ నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఎమ్మెల్యే కాన్వాయ్ బయటికి వెళ్లేలా మార్గం సుగమం చేశారు. అంతకుముందు గ్రామసభ ప్రారంభం కావడంతో గ్రామ కార్యదర్శి పథకాలను వివరించారు. 

కమలాపూర్‌ గ్రామసభలో పాల్గొన్న హుజురాబాద్‌ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డిపై కాంగ్రెస్‌ మూకలు టమాటాలతో దాడికి పాల్పడ్డారు. అక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య జరిగిన మాటల యుద్ధం ఉద్రిక్తతకు దారితీసింది. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామ సభలో తాజా మాజీ సర్పంచ్ నాగరాజు బిల్లులు రావడం లేదని పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తన పేరు రాలేదంటూ సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేటలో యువకుడు సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. మంత్రి కొండ సురేఖ తనకు హామీ ఇస్తేనే సెల్ టవర్ దిగుతానని తేల్చి చెప్పాడు.ఈ విషయం తెలుసుకున్న స్థానికులు సెల్ టవర్ దిగాలని తనకు ఇందిరమ్మ ఇండలో ఇల్లు వచ్చే విధంగా చూస్తామని తెలిపినప్పటికీ టవర్ నుండి దిగకపోవడంతో గ్రామంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. చివరకు మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్, ఎస్సై గంగరాజు జోక్యం చేసుకుని హామీ ఇవ్వడంతో సెల్ టవర్ నుండి యువకుడు కిందకు దిగాడు. మరోవైపు గ్రామసభ ల్లో ఇల్లు రాలేదని..రేషన్ కార్డు రాలేదని ఎవరైన గొడవ చేస్తే తోలు తీసీ చెట్టుకు కట్టేసి కొడుతానంటూ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గ్రామసభలో ప్రజలను హెచ్చరించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. బీఆర్ఎస్ నేతలు గ్రామసభల్లో ప్రజలను రెచ్చగొట్టి, తప్పుదోవ పట్టించి రగడ సృష్టస్తూ సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపికకు ఆటంకం కల్గిస్తున్నారని ఆరోపించారు. నిర్మల్ జిల్లాలోని తానూరు మండల కేంద్రంలో గ్రామసభ ప్రారంభమైన కొద్దిసేపటికే రసాభాసగా మారింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో అనర్హులను ఎంపిక చేశారు అంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కామారెడ్డి – పెద్దకోడపుగల్ మండలకేంద్రంలో జరిగిన సభలో రేషన్​ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తమ పేర్లు గల్లంతు అయ్యాయని కన్నీళ్లు పెట్టుకున్న మహిళలు.. కాంగ్రెస్​ నాయకుల కళ్లు మొక్కడం వివాదస్పదంగా మారింది. సూర్యాపేట జిల్లా కోదాడ (మం) రామలక్ష్మిపురం గ్రామసభలో ఉద్రిక్తత చోటు చేసుకున్నది. అనర్హులకు కొత్త రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇళ్ళు వచ్చాయని ఆగ్రహించిన గ్రామస్తులు గ్రామసభలో వేసిన టెంట్,స్టేజ్ ని కూల్చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగింది స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తోన్న వికారాబాద్ నియోజకవర్గం జైదుపల్లి గ్రామసభలో మహిళ​లు అధికారులను నిలదీశారు. అధికారంలో రాగానే ఆడపిల్లకు రూ.2500 వేస్తామని,రూ.500కే గ్యాస్ సిలిండర్, రుణమాఫీ హామీలను ప్రశ్నించారు. అవి ఎవరికి ఇస్తున్నారో చెప్పాలని పట్టుబట్టారు. మహిళలు అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పలేకపోయిన అధికారులు అక్కడ్నుంచి వెళ్లిపోయారు..

యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట గ్రామసభలో లిస్టులో పేర్లు లేవని అధికారులను నిలదీశారు. జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం లోని మానోపాడు మండల కేంద్రంలో ప్రజా పాలన గ్రామసభలో గందరగోళం నెలకొంది. యాదాద్రి భువనగిరి మోట కొండూర్ మండలంలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో జాబితాలో తన పేరు రాలేదని ఓ మహిళ కన్నీరు పెట్టుకుంది. మాకు సంబంధం లేదని అధికారులు చేతులు దులుపుకున్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం నడుకుడా గ్రామంలో అధికారులతో గ్రామ సభలో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. మొత్తంగా తీవ్ర నిరసనల నడుమ గ్రామ సభలు కొనసాగుతున్నాయి. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండల కేంద్రంలో జరిగిన గ్రామ సభలో కాంగ్రెస్​ సీనియర్​ నేత సత్యనారాయణ చౌదరి సొంత పార్టీపై విమర్శలు గుప్పించారు. ఎవరో హైదరాబాద్ నుండి జాబితా ఇస్తే వాళ్లను మాత్రమే ఎంపిక చేస్తారా? కాంగ్రెస్ నేతలం అని చెప్పుకోవడానికే సిగ్గేస్తుందని అధికారితో వాగ్వాదానికి దిగారు.జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి గ్రామసభకు వచ్చిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముందు ఆసరా పెన్షన్​ దారులు కన్నీళ్లు పెట్టుకున్నారు. కాంగ్రెస్​ పార్టీని నమ్మి మోసపోయామన్న పెన్షన్​ దారులు మళ్లీ 20ఏండ్ల దాకా రేవంత్ రెడ్డి గెల్వడని శాపనార్ధాలు పెట్టారు.

అది అర్హుల జాబితా కాదు.. దరఖాస్తు వారి జాబితా : డిప్యూటీ సీఎం భట్టి

గ్రామసభల్లో విడుదల చేస్తున్న లిస్టుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. గ్రామసభ లిస్టులో పేరు వచ్చినంత మాత్రాన ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు వచ్చినట్లు కాదన్నారు. ఆ లిస్టులో ఉన్నది దరఖాస్తు చేసుకున్న వారి పేర్లు మాత్రమేనని చెప్పారు. ఇంకా ఎవరైనా అప్లయ్ చేసుకోని వారుంటే వారు కూడా అప్లయ్ చేసుకుంటారనే ఉద్దేశ్యంతో లిస్టు విడుదల చేసినట్లు తెలిపారు. గ్రామ సభలు ఫూర్తయిన తర్వాత.. వచ్చిన దరఖాస్తుల ఆధారంగా అన్ని క్రోడీకరించి.. అర్హులను ఎంపిక చేస్తామని అన్నారు. ప్రస్తుతం గ్రామసభల్లో విడుదల చేసిన లిస్టు సెలెక్టడ్ లిస్టు కాదని అన్నారు. అది కేవలం దరఖాస్తు చేసున్నవారి లిస్టు మాత్రమేనని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.