Take a fresh look at your lifestyle.

జూ పార్క్ లో ఫుడ్ కోర్టులు

  • ప్రారంబించిన పీసీసీఎఫ్ డోబ్రియల్.
ముద్ర, తెలంగాణ బ్యూరో: నగరంలోని నెహ్రూ జూ పార్క్ లో ఆధునిక సౌకర్యాలతో కూడిన ఫుడ్ కోర్టును అటవీశాఖ అందుబాటులోకి తెచ్చింది.హైదారాబాద్  పర్యాటక ప్రాంతాల్లో తలమానికంగా ఉన్న జూ పార్క్ లో రైనో పేరుతో ఫుడ్ కోర్టు ప్రారంభమైంది.అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్, హెచ్ఓఓఎఫ్) ఆర్.ఎం.డోబ్రియల్ కొత్త క్యాంటీన్ సేవలను శుక్రవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జంతు ప్రదర్శన శాలకు వచ్చే సందర్శకులకు మెరుగైన సౌకర్యాల కల్పనలో భాగంగా అన్ని రకాల సేవలను అభివృద్ది చేస్తున్నట్లు  వెల్లడించారు.దేశంలోనే పేరెన్నిక గల జూ పార్క్ ల్లో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉందని, ఇక్కడికి వచ్చే విజిటర్స్ కు అహ్లాదకరమైన అనుభవం ఉండేలా అంతర్జాతీయ ప్రమాణాలను కల్పించటమే లక్ష్యంగా అటవీశాఖ పనిచేస్తోందని పీసీసీఎఫ్ వెల్లడించారు.జూ పార్క్ మధ్యలో పచ్చని ప్రకృతి మధ్య, రైనో, ఆస్ట్రిచ్, విదేశీ పక్షుల ఎన్ క్లోజర్ల మధ్య భోజనశాల అందుబాటులోకి వచ్చింది.మంచి నాణ్యమైన ఆహార పదార్థాలతో పాటు, మెరుగైన సీటింగ్, ట్రీ గజెబో, పిల్లలకు ప్లే ఏరియా, పరిశుభ్రమైన టాయిలెట్ల సేవలు సందర్శకులకు అందనున్నాయి.జూ సందర్శనకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విజిటర్స్ తో మాట్లాడిన అధికారులు సౌకర్యాలపై ఆరా తీశారు. సెంట్రల్ జూ అథారిటీ  ప్రమాణాలకు అనుగుణంగా క్యాంటీన్ తో పాటు ఇతర సేవలను అప్ గ్రేడ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.మొదటిసారిగా పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో అటవీశాఖ జూలో ఈరకమైన సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు.జూ సందర్శనకు పెద్ద సంఖ్యలో వచ్చే విజిటర్స్ కు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మరో మూడు ప్రాంతాల్లో కూడా క్యాంటీన్ల అభివృద్ది జరుగుతుందని పీసీసీఎఫ్ తెలిపారు.వేసవిని దృష్టిలో పెట్టుకుని జంతువుల రక్షణతో పాటు, సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పర్యాటకులు కూడా జూ సందర్శనలో ఎలాంటి ప్లాస్టిక్ వాడకుండా స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.కార్యక్రమంలో చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఏలూసింగ్ మేరు, జూ పార్క్ డైరెక్టర్ సునీల్ హిరేమత్, క్యూరేటర్ వసంత, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.