- కొత్త రాష్ట్రమైనా తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తోంది.
- ఇక్కడ పెట్టుబడులు పెట్టి మీరూ ఆర్ధికంగా అభివృద్ధి చెందాలి.
- కలిసికట్టుగా ప్రపంచానికి అద్భుతమైన భవిష్యత్తును నిర్మిద్దాం.
- జపాన్ పారిశ్రామిక వేత్తలకు సీఎం రేవంత్ పిలుపు.
- టోక్యోలో ఘనంగా ఇండియా-జపాన్ ఎకనామిక్ పార్టనర్‌షిప్ రోడ్‌షో.
ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో పెట్టుబడులు పెట్టి ఆర్ధికంగా అభివృద్ధి చెందాలని జపాన్ పారిశ్రామిక, వ్యాపారవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.దేశంలోనే కొత్త రాష్ట్రమైన తెలంగాణ అత్యంత వేగంగా వృద్ధి చెందుతోందని వివరించారు.అభివృద్ధిలో దూసుకెళ్తోన్న తమ రాష్ట్రం జపాన్ పారిశ్రామిక వేత్తలకు స్వాగతం పలుకుతోందని చెప్పారు.జపాన్‌ను ఉదయించే సూర్యుడి దేశం అని పిలుస్తారనీ తమ ప్రభుత్వ నినాదం కూడా ‘తెలంగాణ రైజింగ్’ అని అభివర్ణించారు.టోక్యోలోని హోటల్ ఇంపీరియల్‌లో జరిగిన ఇండియా-జపాన్ ఎకనామిక్ పార్టనర్‌షిప్ రోడ్‌షోలో తెలంగాణ రాష్ట్ర అధికారిక బృందం రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించింది.ఈ రోడ్ షోలో రేవంత్ రెడ్డి.. పరిశ్రమల స్ధాపన కోసం తెలంగాణలో ఉన్న వనరులు, అనుకూల పరిస్థితులను వివరించారు. పెట్టుబడులతో వస్తే అన్ని రకాలుగా సహాయసాకారాలు అందిస్తామని జపాన్ పారిశ్రామికవేత్తలకు భరోసా ఇచ్చారు.టోక్యో చాలా గొప్ప నగరమని చెప్పారు. ఇక్కడి మౌలిక సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ, ఆవిష్కరణలు అద్భుతమని కొనియాడారు. జపాన్ ప్రజలు సౌమ్యులు, మర్యాదస్తులు, క్రమశిక్షణ కలిగినవారని కీర్తించారు.హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడానికి టోక్యో నుంచి చాలా నేర్చుకున్నానని సీఎం జపాన్ పారిశ్రామిక వేత్తలకు వివరించారు.ఈ సందర్భంగా సీఎం ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నైపుణ్యం గల ప్రతిభ, స్థిరమైన విధానాలను ప్రజా ప్రభుత్వం అందిస్తుందని జపాన్ వ్యాపారవేత్తలకు మాటిచ్చారు. లైఫ్ సైన్సెస్, గ్లోబల్ కెపాబులిటీ సెంటర్లు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వెహికిల్స్, టెక్స్ టైల్స్, ఏఐ డేటా సెంటర్లు, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు.భారత్, జపాన్ కలిసికట్టుగా ప్రపంచానికి అద్భుతమైన భవిష్యత్తును నిర్మిద్దామని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో భారత రాయబారి సిబి జార్జ్ భారత్-జపాన్ మధ్య బలపడుతున్న ఆర్థిక సంబంధాలను వివరించారు.జెట్రో (జపాన్ ఎక్స్టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్) బెంగళూరు డైరెక్టర్ జనరల్ తోషిహిరో మిజుటానీ మాట్లాడుతూ..తెలంగాణతో సహకారాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.కాగా దేశంలోనే మొదటి నెట్ జీరో ఇండస్ట్రియల్ సిటీగా హైదరాబాద్లో నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ, దేశంలోనే అద్భుతంగా నిర్మించ తలపెట్టిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ పై ప్రచార వీడియోలను రాష్ట్ర ప్రభుత్వం ఈ వేదికపై ప్రదర్శించింది. అలాగే ఎలక్ట్రానిక్స్, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వెహికిల్స్, టెక్స్ టైల్స్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో జపాన్ కంపెనీలకు తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, అవకాశాలను రాష్ట్ర వాణిజ్య పరిశ్రమల శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ వివరించారు.రోడ్‌షో తర్వాత తెలంగాణ ప్రతినిధి బృందం, జపాన్‌లోని పలు దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో ముఖాముఖి సమావేశమైంది.వివిధ రంగాలకు చెందిన దాదాపు 150 మందికి పైగా జపాన్ పారిశ్రామికవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
