జాతీయ మెగా లోక్ అదాలత్ ద్వారా 1718 కేసుల పరిష్కారం రాజీ మార్గమే రాజ మార్గం: జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్
ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ :
జిల్లాలో నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్‌కు విశేష స్పందన లభించిందని జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ తెలిపారు. ఈ సందర్భంగా మొత్తం 1718 కేసులు రాజీ మార్గంలో పరిష్కారమయ్యాయని వెల్లడించారు.
లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించిన కేసుల్లో ఎఫ్ఐఆర్ కేసులు 310, ఈపెట్టి కేసులు 870, డ్రంకెన్ అండ్ డ్రైవ్ కేసులు 499, సైబర్ క్రైమ్ కేసులు 39 ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా సైబర్ క్రైమ్ కేసుల్లో రూ. 8,25,319 రిఫండ్ మొత్తాన్ని బాధితులకు అందజేసినట్లు పేర్కొన్నారు.
రాజీ మార్గం ద్వారా ఇరు వర్గాలకు త్వరితగతిన న్యాయం జరుగుతుందని, ఈ విధానాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సూచించారు. కేసుల పరిష్కారానికి కృషి చేసిన పోలీస్ అధికారులు, సిబ్బందిని అభినందించారు.
అలాగే లోక్ అదాలత్ విజయవంతానికి సహకరించిన న్యాయవాదులు, కక్షిదారులు, న్యాయసేవాధికారులకు జిల్లా ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు.