Take a fresh look at your lifestyle.

కొత్త పొత్తులు.. జంప్‌జిలానీలు..హ‌స్త‌గతమైన మున్సిపాలిటీలు

 

 

షాద్‌న‌గ‌ర్‌, చేవెళ్ల‌, శంక‌ర్‌ప‌ల్లి, మొయినాబాద్‌, ఆమ‌న్‌గ‌ల్ హ‌స్త‌గ‌తం

ఇబ్ర‌హీంప‌ట్నం మున్సిప‌ల్ చైర్మ‌న్‌, వైస్ చైర్మ‌న్ ఎన్నిక నేటికి వాయిదా

(ముద్ర, ఉమ్మ‌డి రంగారెడ్డిజిల్లా ప్ర‌తినిధి): జిల్లాలో ఓట‌ర్లు ఇచ్చిన తీర్పుకు భిన్నంగా మున్సిపాలిటీల్లో అధికారం హ‌స్త‌గ‌త‌మైంది.కౌన్సిల‌ర్ల‌ బ‌లాబ‌లాల‌తో సంబంధం లేకుండా అధికార కాంగ్రెస్ పార్టీ 90 శాతం మున్సిప‌ల్ చైర్మ‌న్ పీఠాల‌ను చేజిక్కించుకుంది. జిల్లాలో ఎన్నిక‌లు జ‌రిగిన 6 మున్సిపాలిటీల‌కు గాను ఐదు చోట్లా కాంగ్రెస్ త‌న జెండాను ఎగుర‌వేసింది. త‌ద్వ‌రా అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందుల‌య్యేలా షాద్‌న‌గ‌ర్‌, చేవెళ్ల‌, శంక‌ర్‌ప‌ల్లి మున్సిపాలిటీల చైర్మ‌న్ పీఠాలు కాంగ్రెస్ ఖాతాలో చేరాయి. మొయినాబాద్ మున్సిపాలిటీలో ఏ పార్టీకి మెజార్టీ లేక హంగ్ ఏర్ప‌డిన చోట సైతం అధికార కాంగ్రెస్ త‌న మార్కు రాజ‌కీయంతో చైర్మ‌న్ పీఠాన్ని ద‌క్కించుకుంది. ఇక్క‌డ ఇండిపెండెంట్ల‌తో పాటు బీఆర్ఎస్ నుంచి ముగ్గురు కౌన్సిల‌ర్ల‌ను త‌మ వైపుకు తిప్పుకొని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాన్నిఖంగుతినిపించింది. ఆమ‌న‌గ్‌ల్ లో కాంగ్రెస్‌కు ఒక్క‌రే కౌన్సిల‌ర్‌ ఉన్న‌ప్ప‌టికీ ఇక్క‌డ స్ఠానిక ఎమ్మెల్యే, ఎంపీలు రాజ‌కీయ తంత్రంతో మున్సిపాలిటీ అధికార పీఠాన్ని ద‌క్కించుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇక్క‌డ హైడ్రామా మ‌ధ్య 6 బీజేపీ స‌భ్యుల మ‌ద్ద‌తుతో బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్‌కు జంప్ అయిన కౌన్సిల‌ర్ ను మున్సిప‌ల్‌ చైర్మ‌న్‌గా, బీజేపీ కౌన్సిల‌ర్ ను వైస్ చైర్ ప‌ర్స‌న్‌గా ఎన్నుకున్నారు. మొత్తంగా చూస్తే.. అనూహ్య‌మైన పొత్తులు, జంపింగ్‌ల మ‌ధ్య‌ రాజ‌కీయ‌ ప్ర‌త్య‌ర్థుల‌ను చిత్తుచేస్తూ అధికార కాంగ్రెస్ జిల్లాలో మున్సిపాలిటీల్లో తిరుగులేని ఆధీప‌త్యం ప్ర‌ద‌ర్శించింది.

బీఆర్ఎస్‌లో కుర్చీ కొట్లాట‌.. ఇబ్ర‌హీంప‌ట్నం చైర్మ‌న్ ఎన్నిక వాయిదా..

మ‌రోవైపు బీఆర్ఎస్ కు విజ‌యావ‌కాశాలు ఉన్న ఇబ్ర‌హీంప‌ట్నం మున్సిపాలిటీలో చైర్మ‌న్ ప‌ద‌విపై ఆ పార్టీ కౌన్సిల‌ర్ల మ‌ధ్య వివాదం త‌లెత్తింది. చైర్మ‌న్ కుర్చీ కోసం ఇబ్ర‌హీంప‌ట్నం టౌన్‌, శివారు కౌన్సిల‌ర్లు ప‌ట్టుబ‌డుతున్నారు. బీఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిష‌న్ రెడ్డి సీతారాంపేట్ నుంచి గెలిచిన కౌన్సిల‌ర్‌కు చైర్మ‌న్ ప‌ద‌విని ఇవ్వాల‌ని భావిస్తుండ‌టంతో కౌన్సిల‌ర్ల మ‌ధ్య ఏకాభిప్రాయం కుద‌ర‌డంలేదు.
మాజీ మున్సిప‌ల్ వైప్ చైర్మ‌న్ ఆకుల యాద‌గిరి త‌న‌కే ఇవ్వాల‌ని లేదా మెజార్టీ కౌన్సిల‌ర్లు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న టౌన్ నుంచి గెలిచిన కౌన్సిల‌ర్ల‌కు మున్సిప‌ల్ చైర్మ‌న్ ప‌ద‌విని ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. సోమ‌వారం జ‌రిగిన మున్సిప‌ల్ చైర్మ‌న్‌, వైస్‌చైర్మ‌న్ ఎన్నిక స‌మావేశానికి బీఆర్ ఎస్ అస‌మ్మ‌తి కౌన్సిల‌ర్ ఆకుల యాద‌గిరి హాజ‌రుకాక‌పోవ‌డంతో ఆయ‌న భార్యా,పిల్ల‌లు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. త‌న భ‌ర్త‌ను త‌మ ముందుకు తీసుకురావాల‌ని వారు మున్సిప‌ల్ కార్యాల‌యం ఎదుట ఆందోళ‌న‌కు దిగారు. దీంతో కౌన్సిల‌ర్ ఆకుల యాద‌గిరిని హాజ‌రుప‌ర్చాల‌ని మున్సిప‌ల్ చైర్మ‌న్‌, వైస్‌ చైర్మ‌న్ ఎన్నిక స‌మావేశంలోనూ కాంగ్రెస్ కౌన్సిల‌ర్లు సైతం ఆందోళ‌న‌కు దిగారు. దీంతో స‌మావేశానికి తీవ్ర అంత‌రాయం క‌లుగ‌డంతో ఎన్నిక‌ల అధికారి, ఆర్డీవో మున్సిప‌ల్ చైర్మ‌న్‌, వైస్‌ చైర్మ‌న్ ఎన్నిక‌ను మంగ‌ళ‌వారానికి వాయిదా వేశారు. అయితే, మంగ‌ళ‌వారం జ‌రిగే మున్సిప‌ల్ చైర్మ‌న్‌, వైస్‌ చైర్మ‌న్ ఎన్నిక స‌మావేశానికి బీఆర్ ఎస్ అస‌మ్మ‌తి ఎమ్మెల్యే ఆకుల యాద‌గిరి హాజ‌ర‌వుతారా? లేదా? అయోమయం నెల‌కొన్న‌ది. బీఆర్ఎస్ కౌన్సిల‌ర్ల మ‌ధ్య విభేదాలు స‌ద్దుమ‌ణ‌గ‌క‌పోతే అనూహ్య‌మైన రాజ‌కీయ ప‌రిణామాలు చోటుచేసుకొని ఇబ్ర‌హీంప‌ట్నం మున్సిపాలిటీ సైతం కాంగ్రెస్ వ‌శ‌మ‌య్యే అవ‌కాశాలు ప్ర‌స్ఫుటంగా క‌నిపిస్తున్నాయి. అవ‌స‌ర‌మైతే బీఆర్ఎస్‌లో ఒక వ‌ర్గం కౌన్సిల‌ర్ల‌కు మ‌ద్ద‌తివ్వ‌డం ద్వారా ఇబ్ర‌హీంప‌ట్నం మున్సిప‌ల్ ఫీఠాన్ని ఎలాగైనా త‌మ ఖాతాలో వేసుకోవాల‌ని స్థానిక ఎమ్మెల్యే మ‌ల్‌రెడ్డి రంగారెడ్డి, కాంగ్రెస్ నాయ‌క‌త్వం పావులు క‌దుపుతోంది. అయితే, త‌మ కౌన్సిల‌ర్ల‌ను ఎలాగైనా కాపాడుకొని ఇబ్ర‌హీంప‌ట్నం మున్సిపాలిటీపై గులాభీ జెండా ఎగుర‌వేయాల‌ని మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిష‌న్‌రెడ్డి పట్టుద‌ల‌తో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఇబ్ర‌హీంప‌ట్నం మున్సిపాలిటీలో చైర్మ‌న్ పీఠం కోసం కాంగ్రెస్‌, బీఆర్ ఎస్ మ‌ధ్య మ‌రోమారు ర‌స‌వ‌త్త‌ర పోరు తెర‌పైకి వ‌చ్చింది.

చైర్మ‌న్ పీఠంకై…కొత్త పొత్తులు.. జంపింగ్‌లు..

మున్సిపాలిటీల్లో అధికారాన్ని ద‌క్కించుకునేందుకు జిల్లాలో రాత్రికే రాత్రే ప్ర‌ధాన పార్టీల‌ మ‌ధ్య కొత్త‌(అన‌ధికార) పొత్తులు పొడిచాయి. మ‌రికొన్ని చోట్ల చైర్మ‌న్, వైస్ చైర్మ‌న్ ప‌ద‌వులే ప‌ర‌మావ‌ధిగా ఒక పార్టీ నుంచి గెలిచిన కౌన్సిల‌ర్లు మ‌రో పార్టీకి జంప్ అయ్యి సొంత పార్టీకి షాక్ ఇచ్చారు. దీంతో ఎన్నిక‌ల‌ ప్ర‌చారంలో ప్ర‌జ‌ల ముందుంచిన ఆయా పార్టీల సిద్ధాంతాలు, హామీలన్నీ బుట్ట‌దాఖ‌ల‌య్యాయి. మున్సిప‌ల్ చైర్మ‌న్ పీఠాల‌పై త‌మ వారిని కూర్చోబెట్టి స్థానికంగా త‌మ ఆధీప‌త్యాన్ని నిల‌బెట్టుకోవాల్సిదేన‌న్న‌ పంతంతో ఎమ్యెల్యేలు, ఎంపీలు ఎత్తులు, పై ఎత్తులు ప్ర‌ద‌ర్శించారు. ఎలాగైనా గెలిచితీరాల్సిందేన‌న్న సూత్రంతో ప్ర‌ధాన పార్టీల అధినాయ‌కత్వాలు సైతం ఇవేవీ ప‌ట్టించుకోలేదు. ఎక్స్అఫిసియో మెంబ‌ర్ల ఓట్లు , అధికార పార్టీగా అద‌న‌పు బ‌లం తోడ‌వ‌డంతో రాత్రికి రాత్రే కొత్త పొత్తులు చిగురించడం, ఇత‌ర పార్టీల‌ జంపింగ్ జిలానీల మ‌ద్ద‌తుతో జిల్లాలో ఐదు మున్సిపాలిటీల్లో సునాయ‌సంగా కాంగ్రెస్ జెండా ఎగుర‌వేసింది.

షాద్‌న‌గ‌ర్ మున్సిప‌ల్‌ చైర్మ‌న్‌గా అగ‌నూరు బ‌స్వం

 

షాద్‌న‌గ‌ర్ మున్సిపాలిటీలో ఊహించిన‌ట్టుగానే కాంగ్రెస్ జెండా ఎగిరింది. ఇక్క‌డ 28 వార్డుల‌కు గాను 15 వార్డుల్లో గెల్చిన కాంగ్రెస్ స్థానిక ఎమ్మెల్యే వీర్ల‌ప‌ల్లి శంక‌ర్ ఎక్స్అఫిసియో మెంబ‌ర్‌గా ఓటేశారు. దీంతో ఇక్క‌డ కాంగ్రెస్ నుంచి మున్సిప‌ల్ చైర్మ‌న్‌గా అగనూరు బ‌స్వం, వైస్‌ చైర్మ‌న్ గా అందే మోహ‌న్ ఎన్నిక‌య్యారు.

చేవెళ్ల మున్సిప‌ల్ చైర్మ‌న్‌గా దేవ‌ర స‌మ‌తా వెంక‌ట్‌రెడ్డి

 

చేవెళ్ల మున్సిప‌ల్ చైర్మ‌న్‌, వైస్ చైర్మ‌న్ ప‌ద‌వుల‌ను కాంగ్రెస్ గెల్చుకుంది. ఇక్క‌డ మొత్తం 18 మున్సిప‌ల్ వార్డుల్లో కాంగ్రెస్ మెజార్టీ 11 వార్డులు గెలిచింది. దీంతో మున్సిప‌ల్‌ చైర్మ‌న్‌గా(జ‌న‌ర‌ల్‌) దేవ‌ర స‌మ‌తా వెంక‌ట్ రెడ్డి, వైస్ చైర్మ‌న్‌గా రాములు గౌడ్‌ ఎన్నిక‌య్యారు.

శంక‌ర్‌ప‌ల్లి మున్సిప‌ల్ చైర్మ‌న్‌గా సాత ప్ర‌వీణ్‌

 

 

 

శంక‌ర్‌ప‌ల్లి మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులు ఉండ‌గా, కాంగ్రెస్‌ 9 వార్డుల‌ను ద‌క్కించుకుంది. దీంతో మెజార్టీ వార్డు కౌన్సిల‌ర్ల మ‌ద్ద‌తుతో కాంగ్రెస్ నుంచి మున్సిప‌ల్ చైర్మ‌న్‌గా(జ‌న‌ర‌ల్‌) సాత ప్ర‌వీణ్‌, వైస్‌ చైర్మ‌న్‌గా శ్వేత పాండురంగారెడ్డి ఎన్నిక‌య్యారు.

మొయినాబాద్ మున్సిప‌ల్ చైర్మ‌న్‌గా దుబ్బ సోనియా

ఇక హంగ్ ఏర్ప‌డిన మొయినాబాద్ మున్సిపాలిటీని నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య కాంగ్రెస్ చేజేక్కించుకుంది. ఇక్క‌డ మొత్తం 26 వార్డులకు గాను కాంగ్రెస్‌ 10, బీఆర్ ఎస్‌ 7, బీజేపీ 4, స్వ‌తంత్రులు 5 వార్డులు గెలిచారు. దీంతో అధికార కాంగ్రెస్ ఇక్క‌డ చైర్మ‌న్ పీఠానికి 4 స్థానాల‌కు దూరంలో ఉండిపోయింది. దాంతో మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డి రంగంలోకి దిగడంతో ఒక్క రాత్రికే ఆయా పార్టీల బ‌లాబ‌లాలు తారుమార‌య్యాయి. బీఆర్ ఎస్ నుంచి ముగ్గురు, న‌లుగురు స్వ‌తంత్రులు క‌లిపి మొత్తం 7 కౌన్సిల‌ర్లను త‌మ వైపుకు తిప్పుకొని మొయినాబాద్ మున్సిపాలిటీని కాంగ్రెస్ త‌న ఖాతాలో వేసుకుంది. ఇక్క‌డ మున్సిప‌ల్ చైర్మ‌న్‌గా(ఎస్సీ జ‌న‌ర‌ల్‌) దుబ్బ సోనియా, వైప్ చైర్మ‌న్‌గా గుడుగు రాజు ఎన్నిక‌య్యారు.

ఆమ‌న్‌గ‌ల్ మున్సిప‌ల్ చైర్మ‌న్‌గా ప‌త్యా నాయ‌క్‌

 

ఆమ‌న్‌గ‌ల్ మున్సిపాలిటీ చైర్మ‌న్ ఎన్నిక‌లో హైడ్రామా చోటుచేసుకుంది. ఇక్క‌డ మొత్తం 15 వార్డుల్లో బీఆర్ ఎస్‌ 8 వార్డులు, బీజేపీ 6 వార్డులు, కాంగ్రెస్‌ 1 వార్డు గెలిచాయి. దీంతో ఇక్క‌డ బీఆర్ ఎస్ చైర్మ‌న్ పీఠాన్ని ద‌క్కించుకోవ‌డం ఖాయ‌మ‌నుకున్నారు. కానీ అనూహ్య ప‌రిణామాల మ‌ధ్య కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ ఎస్ కౌన్సిల‌ర్ ప‌త్యా నాయ‌క్ చైర్మ‌న్‌గా, బీజేపీ కౌన్సిల‌ర్ త‌ల్లోజు గీత ఎన్నిక‌య్యారు. త‌న సొంత ప్రాంతం ఆమ‌న్‌గ‌ల్ మున్సిపాలిటీని ఎట్టి ప‌రిస్థితుల్లో బీఆర్ ఎస్‌కు ద‌క్క‌కుండా కాంగ్రెస్ ఎమ్మెల్యే క‌సిరెడ్డి నారాయ‌ణ‌రెడ్డి, ఎంపీ మ‌ల్లు ర‌వి వ్యూహాత్మ‌కంగా బీజేపీ మ‌ద్ద‌తుతో చైర్మ‌న్ ప‌ద‌విని కైవ‌సం చేసుకోవాల‌ని ప‌థ‌కం ర‌చించారు. కానీ గ‌ద్వాల మున్సిప‌ల్ పీఠం కాంగ్రెస్ ద‌క్కాలంటే స్ఠానిక ఎంపీగా మ‌ల్లు ర‌విని ఆఖ‌రు నిముషంలో అక్క‌డికి మార్చారు. దీంతో ఆమ‌న్‌గ‌ల్ మున్సిప‌ల్ చైర్మ‌న్ ప‌ద‌విని ద‌క్కించుకునేందుకు ఒక్క ఓటు త‌క్కువ ప‌డే ప‌రిస్థితి తలెత్త‌డంతో కాంగ్రెస్ నేత‌లు వ్యూహాం మార్చారు. ప్ర‌త్య‌ర్థి శిబిరంలో ఉన్న బీఆర్ఎస్ కౌన్సిల‌ర్ ప‌త్యా నాయ‌క్‌ను పార్టీలో చేర్చుకొని అత‌న్నే మున్సిప‌ల్ చైర్మ‌న్ ప‌ద‌వికి ప్ర‌తిపాదించారు. ప‌త్యానాయ‌క్ పేరును కాంగ్రెస్ కౌన్సిల‌ర్ ప్ర‌తిపాదించ‌గా, బీజేపీకి చెందిన 6 స‌భ్యులు, ఎక్స్ అఫిసియో స‌భ్యుడి కోటాలో స్థానిక ఎమ్మెల్యే క‌సిరెడ్డి నారాయ‌ణ‌రెడ్డి మ‌ద్ద‌తిచ్చి బీఆర్ ఎస్‌ పార్టీ నేత‌ల‌ను ఖంగుతినిపించారు.

చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మూడు మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న సందర్భంగా మాజీ ఎంపీ రంజిత్ రెడ్డికి స్వీట్లు తినిపిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే కాల యాదయ్య, బీమ్ భరత్ లు

Leave A Reply

Your email address will not be published.