ఇలా అయితే పార్టీలో కొనసాగింపుపై ఆలోచిస్తా
నా రాజకీయ భవిష్యత్ ఏంటో గోచరించట్లేదు
మాజీ మంత్రి జీవన్ రెడ్డి
ముద్ర, జగిత్యాల :
దశాబ్దాల కాలం కాంగ్రెస్ లో ఉన్న తాను ప్రస్తుతం అవమానాలు భరిస్తూ పార్టీలో కొనసాగాలంటే ఆలోచించే పరిస్థితి వచ్చిందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తన భవిష్యత్ ఏంటో గోచరించట్లేదన్న ఆయన కాంగ్రెస్‌లో కొనసాగాలా.. వద్దా అన్న సందిగ్ధంలో ఉన్నానని చెప్పారు. జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ ఉన్నంత వరకు వేధింపులు తప్పవని కీలక వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక అంశంలో తాను ప్రతిపాదించిన వారిని కాదని, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గానికి అధిష్టానం ప్రాధాన్యత ఇవ్వడాన్ని జీవన్ రెడ్డి ఖండించారు. జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా వాణి పేరును పార్టీ దాదాపు ఖరారు చేయడంతో షాక్ కు గురైన ఆయన సోమవారం జగిత్యాలలో మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే సంజయ్‌కు కాంగ్రెస్ పవర్ ఆఫ్ అటార్నీ రాసిచ్చారా?.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు జగిత్యాల కాంగ్రెస్ పట్టా రాసిచ్చారా అని అధిష్టానాన్ని నిలదీశారు. స్పీకర్ ఏమో ఎమ్మెల్యే పార్టీ మారలేదు అంటున్నాడు.. ఎమ్మెల్యే సంసారం మాత్రం కాంగ్రెస్ పార్టీతో చేస్తున్నాడని ఆరోపించారు. జగిత్యాలలోనే ఇలా ఉంటే పార్టీ మారిన మరో తొమ్మిది ప్రాంతాల్లో ఎలాంటి పరిస్థితి ఉందో అర్ధం కావడం లేదన్నారు. అధినాయకత్వం కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలు గౌరవించాలని కోరారు.