- సింగరేణి కార్మికసంఘాల ఐక్యవేదిక.
యైటింక్లయిన్ కాలని. ముద్ర: కేంద్ర బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మికవర్గ నిరంకుశ విధానాలను వ్యతిరేకిస్తూ, జాతీయ కార్మిక సంఘాలు ఈ నెల 9న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కలసి రావాలంటూ, సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు కార్మికులకు పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం సింగరేణి రామగుండం ఓసీపీ.1 ప్రాజెక్టు ఆపరేషన్, బేస్ వర్క్ షాప్ లలో ఏర్పాటు చేసిన ద్వారా సమావేశాల్లో పాల్గొన్న ఐక్యవేదిక నాయకులు ఐఎన్టియూ సి కేంద్ర కమిటీ కార్యదర్శి గడ్డం తిరుపతి యాదవ్, టిబిజికెఎస్ అధ్యక్షులు మిరియాల రాజిరెడ్డి లు కార్మికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. దేశంలోని బడా కార్పొరేట్ సంస్థలకు తొత్తుగా మారిన కేంద్ర సర్కార్, ప్రభుత్వ రంగ పరిశ్రమలను అప్పగించి, కార్మికవర్గ హక్కులను, కాలరాశి, కార్మికవర్గాన్ని మొత్తంగా బానిసలుగా మార్చేందుకు కుట్రలు పన్నిందని ఆరోపించారు. అందులో భాగంగానే, అనేకమంది అమరుల త్యాగాల ఫలితంగా లభించిన 44 కార్మిక చట్టాలను కాలరాశి, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా 4 కోడ్ లను ప్రవేశ పెట్టడం, అందులో 8 గంటల పని దినాన్ని, 10, 12 గంటలకు మార్పు చేసేందుకు దిగజారిందని దుయ్యబట్టారు. కార్మిక వ్యతిరేక నల్ల చట్టాల అమలు చేసే ప్రయత్నాలను విరమించుకోవాల ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ.. ఈ నెల 9న జాతీయ కార్మిక సంఘాలు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపు ఇచ్చిందన్నారు. ఆ పిలుపులో సింగరేణి కార్మికవర్గం కూడా భాగస్వాములు కావాలని వారు కోరారు. అలాగే ఒక్కరోజు సార్వత్రిక సమ్మె ప్రాముఖ్యతను కార్మికులకు వివరించి, కార్మికులందరూ విధిగా సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. వేరువేరుగా జరిగిన ఈ సమావేశాల్లో ఐక్యవేదిక నాయకులు గునుగంటి వెంకటస్వామి, జె. దామోదరరావు ఎన్. శ్రీనివాసరావు, పింగిలి సంపత్ రెడ్డి, జిట్కు శ్రీనివాస్, డిటి. రావు, సల్ల శేఖర్, సంజీవ్, సదానందం, సయ్యద్ సలీం, ప్రవీణ్ రెడ్డి, రామచందర్రావు, రాజన్న, జి. గోపాల్, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.