ముద్ర,తెలంగాణ బ్యూరో
ప్రతీ డ్రగ్స్ కేసులోకి తనని లాగితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని KTR హెచ్చరించారు. ఎలాంటి టెస్ట్‌కైనా తాను సిద్ధమని పేర్కొన్నారు. డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చిన ప్రతీసారి BRS పార్టీని లాగడం దారుణమన్నారు. తాను, తమ పార్టీ డ్రగ్స్ వాడకానికి పూర్తి వ్యతిరేకమన్నారు. BRS Ex MLA పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ కేసులో చిక్కుకున్న నేపథ్యంలో KTR వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
డ్రగ్స్ టెస్టు చేయించుకోవాలన్న టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ సూచనను స్వీకరిస్తున్నానని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు డ్రగ్స్ వాడటం దురదృష్టకరమన్నారు. వ్యక్తిగతంగా డ్రగ్స్ వాడకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తానన్నారు. డ్రగ్స్ వాడకం, చట్టవిరుద్ధ కార్యకలాపాలను బీఆర్‌ఎస్ ఖండిస్తుందని చెప్పారు. డ్రగ్స్‌ను వినియోగించేది ఎంతటివారైనా శిక్షించాలని డిమాండ్ చేశారు.
‘‘ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు డ్రగ్స్ టెస్టుకు సిద్ధంగా ఉండాలి. నేను ఏ పరీక్షకైనా సిద్ధమని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశా. ప్రజాప్రతినిధులు డ్రగ్స్ టెస్టు చేయించుకొని అందరికీ ఆదర్శంగా ఉందాం. డ్రగ్స్ కేసులోకి నన్ను లాగితే చట్టపరంగా నోటీసులిస్తా’’ అని అన్నారు.
మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై మాజీ మంత్రి కేటీఆర్ బృందం సమాధానం చెప్పాలని మహేశ్‌కుమార్ గౌడ్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. కేటీఆర్, ఆయన అనుచరులు డ్రగ్స్ తీసుకుంటున్నట్లు అనుమానాలు ఉన్నాయని, అవసరమైతే డ్రగ్స్ పరీక్షలకు కేటీఆర్ సిద్ధం కావాలని ఆయన అన్నారు.