Take a fresh look at your lifestyle.

ఐదు రాష్ట్రాల ఎన్నికల నగారా

షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం
ఏప్రిల్‌ లో పోలింగ్.. మే 4న ఫలితాలు!
తమిళనాడు, బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్‌కు ఏర్పాట్లు
824 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు
ఈ 5 రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమలు
ఆరు రాష్ట్రాల్లో ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు

ముద్ర , ఢిల్లీ :

దేశంలో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ వెంటనే అమల్లోకి వచ్చింది.

ఈ ఎన్నికల్లో మొత్తం 824 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. తమిళనాడులో 234, పశ్చిమ బెంగాల్‌లో 294, కేరళలో 140, అస్సాంలో 126 స్థానాలు ఉండగా, పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా మొత్తం 17.4 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఎన్నికల నిర్వహణ కోసం దేశవ్యాప్తంగా సుమారు 2.19 లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు దాదాపు 25 లక్షల మంది ఎన్నికల అధికారులు, సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు.

ఈ రాష్ట్రాల శాసనసభల పదవీకాలం మే, జూన్ నెలల్లో వేర్వేరు తేదీల్లో ముగియనుండడంతో ఎన్నికల సంఘం ముందస్తుగా షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఇప్పటికే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను పూర్తి చేసిన ఎన్నికల సంఘం క్షేత్ర స్థాయి పరిస్థితులను సమీక్షించింది.

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషి కలిసి ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు.

ఎనిమిది స్థానాల్లో ఉప ఎన్నికలు

ఇదిలా ఉండగా, ఆరు రాష్ట్రాల్లోని మొత్తం ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. గోవా, కర్ణాటక, నాగాలాండ్, త్రిపురా రాష్ట్రాల్లోని ఐదు స్థానాలకు ఏప్రిల్ 9న పోలింగ్ నిర్వహించనుండగా, గుజరాత్ మరియు మహారాష్ట్రలోని మూడు అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుంది.

ఈ స్థానాల్లోని సిట్టింగ్ ఎమ్మెల్యేల మరణంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ ఉప ఎన్నికల ఫలితాలు కూడా మే 4న వెల్లడించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.