Take a fresh look at your lifestyle.

కౌన్సెలింగ్ గడువును పెంచలేం పీజీ మెడికల్ సీట్ల భర్తీపై సుప్రీం కోర్టు స్పష్టీకరణ

ఇప్పటికే అనేక సార్లు పొడిగించాం ఇక చాలు
తెలుగు రాష్ట్రాల్లోని పీజీ వైద్య విద్యార్థులకు, ప్రైవేట్ మెడికల్ కళాశాలలకు చుక్కెదురు

న్యూఢిల్లీ :

తెలుగు రాష్ట్రాల్లోని పీజీ వైద్య విద్యార్థులకు, ప్రైవేట్ మెడికల్ కళాశాలలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. పీజీ మెడికల్ సీట్ల భర్తీకి సంబంధించిన కౌన్సెలింగ్ గడువును పెంచేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పీజీ వైద్య సీట్ల భర్తీకి సంబంధించి కౌన్సెలింగ్ గడువును పొడిగించాలని దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇప్పటికే అనేక విడతలుగా కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయినందున, ఇకపై సమయాన్ని పొడిగించడం సాధ్యం కాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసుపై మంగళవారం విచారణ చేపట్టిన దేశ అత్యున్నత న్యాయస్ధానం ఇప్పటికే ఏడుసార్లు కౌన్సెలింగ్ నిర్వహించిన విషయాన్ని గుర్తు చేసింది. ఇన్ని అవకాశాలు కల్పించిన తర్వాత కూడా ఇంకా గడువు పెంచాలని కోరడం సమంజసం కాదని అభిప్రాయపడింది. విద్యా సంవత్సరం క్యాలెండర్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. జాతీయ మెడికల్ కమిషన్ కోర్టుకు సమర్పించిన వివరాలను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. ప్రతి ఏటా దేశవ్యాప్తంగా మెడికల్ సీట్లు మిగిలిపోవడం సహజమని, దీని కోసం నిరంతరం గడువు పెంచడం కుదరదని ఎన్‌ఎంసీ స్పష్టం చేసింది. మిగిలిపోయిన సీట్లలో అత్యధికం ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోనే ఉన్నాయని, ప్రభుత్వ కోటా సీట్లు దాదాపు భర్తీ అయ్యాయని కమిషన్ వివరించింది. ఈ నేపథ్యంలో గడువు పొడిగింపు అవసరం లేదని ఎన్ఎంసీ గట్టిగా వాదించింది.
కళాశాలలకు చిన్న ఊరట
గడువు పెంచేందుకు నిరాకరించినప్పటికీ, ప్రైవేట్ వైద్య కళాశాలలకు కోర్టు ఒక చిన్న అవకాశం కల్పించింది. తమ సమస్యలను జాతీయ మెడికల్ కమిషన్ కమిటీ ముందు చెప్పుకునేందుకు ధర్మాసనం అనుమతించింది. ఇప్పటికే కమిటీని ఆశ్రయించి ఉంటే, దానిపై నిర్ణయం తీసుకునే పూర్తి స్వేచ్ఛ ఎన్ఎంసీ కమిటీకే ఉంటుందని కోర్టు తెలిపింది. ఇప్పటివరకు కమిటీని సంప్రదించని పక్షంలో, ఇప్పుడు వెళ్లి తమ విన్నపాలను సమర్పించుకోవచ్చని ధర్మాసనం పేర్కొంది. సుప్రీంకోర్టు తాజాగా వెల్లడించిన నిర్ణయంతో తెలుగు రాష్ట్రాల్లోని పీజీ మెడికల్ కౌన్సెలింగ్ ప్రక్రియకు దాదాపు తెరపడినట్లయింది.

Leave A Reply

Your email address will not be published.