Take a fresh look at your lifestyle.

ఖమ్మం వినోభా భూదాన్ భూముల కూల్చివేత: పేదలకు న్యాయం లేదా రాజకీయ ఆట?

రియల్ భూమ్ లో వినోభా భూదాన్
రగిలిన ఖమ్మం
అసలు కూల్చివేతల వివాదం ఏంటి..?
నిజంగానే బాధితులా.. ?
భూదాన భూములంటున్న ప్రభుత్వం
మండిపడుతున్న విపక్షాలు
సామాన్యడి ఆశ చంపేస్తున్నారా..?

ముద్ర, తెలంగాణ బ్యూరో :
కాంగ్రెస్ కు కంచుకోటగా.. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తమకు పట్టున్న జిల్లా ఖమ్మం అనే చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖమ్మం రగులుతోంది. ఒక డిప్యూటీ సీఎం.. ఇంకో కీలక మంత్రి.. మరో సీనియర్ మంత్రి ఉన్న ఈ జిల్లా ఇప్పుడు అదుపులోకి రావడం లేదు. ఖమ్మం నగరాన్ని ఆనుకుని ఉన్నవెలుగుమట్ల భూదాన్ భూముల్లో నిర్మించుకున్న సుమారు 650 ఇళ్లను రెవెన్యూ అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేశారు. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, కనీసం ఇంట్లోని సామాన్లు సర్దుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా జేసీబీలతో గూడును నేలమట్టం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలీ పనులు చేసుకుంటూ, అప్పులు చేసి కష్టపడి సంపాదించిన సొమ్ముతో ఒక్కో ఇటుక పేర్చుకుని నిర్మించుకున్న ఇళ్లు కళ్లముందే ధ్వంసమవుతుంటే మహిళలు, వృద్ధులు అడ్డంగా పడుతూ రోదించిన తీరు అక్కడి వారిని కలిచివేసింది.

భూదాన్ బోర్డుకు చెందిన భూములు
ఈ భూములు భూదాన్ బోర్డుకు చెందినవని, ఇవి ప్రభుత్వ పరిధిలోకి వస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. గత ఎనిమిది నెలలుగా పేదలు ఈ భూమిలో గుడిసెలు వేసుకుని, క్రమంగా రేకుల ఇళ్లు, పక్కా ఇళ్లు నిర్మించుకున్నారు. సుమారు 17 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ భూమి విలువ కొన్ని కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం. గతంలోనే అధికారులు ఇక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ, ఇళ్ల నిర్మాణాలు ఆగకపోవడంతో కోర్టు ఆదేశాల మేరకు ఈ తొలగింపు చర్యలు చేపట్టినట్లు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి.

కోర్టు ఆదేశాలు అంటున్న అధికారులు – విపక్షాల ఆగ్రహం
ఈ ఘటనపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. బీఆర్‌ఎస్, సీపీఎం, సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా వంటి పార్టీల నేతలు బాధితులకు మద్దతుగా నిలుస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. పేదల ఇళ్లను కూల్చడం అమానుషమని, వారికి ప్రత్యామ్నాయం చూపకుండా ఇలా చేయడం రాజ్యాంగ విరుద్ధమని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో తాము పేదలకు అండగా ఉన్నామని, ఇప్పుడు అధికార పార్టీ నాయకులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని, వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపట్టారు.

కోర్టు ఆదేశాల వల్లేనంటున్న కాంగ్రెస్ నేతలు
అధికార కాంగ్రెస్ నేతలు ఈ విషయంలో ఆచితూచి స్పందిస్తున్నారు. ఇవి భూదాన్ భూములు కావడం వల్ల చట్టపరమైన చిక్కులు ఉన్నాయని, ప్రభుత్వ భూములను ఆక్రమించడం సరైనది కాదని కొందరు నేతలు వివరిస్తున్నారు. అయితే, నిజమైన పేదలకు అన్యాయం జరగకుండా చూస్తామని, అర్హులైన వారికి ప్రభుత్వం తరపున ఇళ్ల పట్టాలు లేదా ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామని స్థానిక కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలోనే ఈ ఆక్రమణలు మొదలయ్యాయని, సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని వారు పేర్కొంటున్నారు. మొత్తంగా ఖమ్మంలో ఇళ్ల కూల్చివేత వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాధితులు తమ సామాన్లతో శిథిలాల మధ్యే వర్షంలో కాలం గడుపుతున్నారు. పిల్లల చదువుల కారణంగా తమను కరుణించాలని, తమకు గూడు కల్పించాలని వేడుకుంటున్నారు. ప్రభుత్వం స్పందించి మానవతా దృక్పథంతో నిర్ణయం తీసుకోవాలని, రాజకీయాల కంటే పేదల బతుకులకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తులు వ్యక్తమవుతున్నాయి.

సామాన్యుడి ఆశను రియల్ భూమ్‌ చంపేస్తోందా?
కొందరిది మహోన్నత ఆశయం, మరికొందరిది జీవిత కల, ఇంకొందరిది వ్యాపార బుద్ధి, ఇలా రకరకాల ఆలోచనలో ఖమ్మం రగిలిపోతోంది. ఇందులో రాజకీయం జోక్యం చేసుకోవడంతో వివాదం మరింత ముదురుతోంది.
గత కొన్ని రోజులుగా ఖమ్మం శివారు వెలుగుమట్లలోని వినోభా నవోదయ కాలనీ వార్తల్లో మార్మోగుతోంది. పదిహేను సంవత్సరాలకుపైగా నివాసం ఉంటున్న పేదల ఇళ్లు, గుడిసెలను ప్రభుత్వం భారీగా పోలీసులను మోహరించి రాత్రికి రాత్రే ఖాళీ చేయించడం సంచలనంగా మారుతోంది. అడ్డుకునేందుకు బాధితులు చేసిన నిరసన సైతం ఎలాంటి ప్రయోజనం ఇవ్వలేదు. ఈ చర్యపై అన్ని వర్గాల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడా బాధితులకు తాము అండగా ఉన్నామని ప్రతిపక్షాలు ముందుకొస్తున్నాయి. గురువారం బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా బాధితుల పరామర్శకు వెళారు.

వినోబా భావే ఆశయంతో మొదలై…రియల్ భూంకి బలై!
దశాబ్దాల క్రితం ఆచార్య వినోబాభావే దేశవ్యాప్తంగా చేపట్టిన భూదాన్ ఉద్యమంతో స్పూర్తి పొందిన కొందరు దాతలు వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని సుమారు 31 నుంచి 60 ఎకరాల తమ భూమిని పేదలకు పంపిణీ చేయమని ప్రభుత్వానికి ఇచ్చారు. భూమి లేని నిరుపేదలకు ఒక గూడు దొరుకుతుందన్నది వారి ఆశయం. అయితే భూదాన్ బోర్డు పేరుతో స్థలం ఉన్నప్పటికీ అధికారికంగా ఎవరికీ ఈ స్థలంలో పట్టాలు కేటాయించలేదు. కాలక్రమేణా ఖమ్మం పట్టణం విస్తరించడం, నగరంలో కొత్త కలెక్టరేట్ కూడా ఈ ప్రాంతానికి అత్యంత సమీపంలోనే నిర్మాణమవడంతో ఇక్కడి భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఏళ్ల క్రితం ‘దానం’గా వచ్చిన భూమి ఇప్పుడు కోట్ల రూపాయల ‘బిజినెస్‌’గా మారిపోయింది.

వివాదం ఎక్కడ మొదలైంది? ఇప్పుడెందుకు రగులుతోంది?
గత 10 ఏళ్లకుపైగా ‘వినోబా నవోదయ కాలనీ’పేరుతో సుమారు 600 నుంచి 1,000 కుటుంబాలు అక్కడ గుడిసెలు, రేకుల ఇళ్లు వేసుకుని నివసిస్తున్నాయి. వీరికి మున్సిపల్ అధికారులు నల్లా కనెక్షన్లు ఇచ్చారు, విద్యుత్ శాఖ మీటర్లు బిగించారు. అంతేకాదు, గత ఎన్నికల సందర్భంగా ఇక్కడ ఓట్లు కోరిన రాజకీయ నాయకులు వారికి పట్టాలు ఇస్తామనే హామీలు కూడా ఇచ్చారు. కానీ భూదాన్ బోర్డు నుంచి ఈ భూమి ఎవరికీ అధికారికంగా కేటాయించలేదనీ, కొందరు దళారులు నకిలీ పత్రాలతో ఇక్కడ పేదలను చేర్పించి లక్షల రూపాయలు వసూలు చేశారని ప్రభుత్వం, రెవెన్యూ అధికారుల వాదన. ప్రస్తుత ఉద్రిక్తతలకు రెండు ప్రధాన కారణాలు.. భూదాన్ బోర్డు ఆస్తులను రక్షించడంలో విఫలమైతే అధికారులదే బాధ్యత అని హైకోర్టు ఘాటుగా స్పందించింది. దీంతో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగి స్థలం స్వాధీనం చేసుకోవాలనే చర్యలు చేపట్టింది. ఇది ఒకవైపు నుంచి వినిపిస్తున్న వాదన. ఈ భూమికి కేవలం 500 మీటర్ల దూరంలోనే కొత్త కలెక్టరేట్ నిర్మాణం జరగడంతో, ఇక్కడి భూమి విలువ ఎకరాకు ₹10 కోట్లకుపైగా పెరిగింది. మొత్తం భూమి విలువ సుమారు రూ 250 నుంచి 300 కోట్లు కావడంతో అధికార యంత్రాంగం దీనిపై కన్నేసిందన్న విమర్శ రెండోది.
ఈ వాదనలు ఇలా సాగుతున్న టైంలోనే ఈనెల 24న పెద్ద ఎత్తున ఆక్రమణల కూల్చివేత కార్యక్రమం జరిగింది. మూడు జిల్లాల నుంచి సుమారు 1,000 మందికి పైగా పోలీసుల పహారాలో, ఎస్.డి.ఆర్.ఎఫ్ (SDRF) బృందాల సమక్షంలో డజన్ల కొద్దీ జెసిబిలతో ఇళ్లను నేలమట్టం చేశారు. మహిళలు అడ్డుకోవడానికి ప్రయత్నించినా, కొందరు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడినా యంత్రాంగం వెనకడుగు వేయలేదు. “మా ఓట్లు తీసుకునేటప్పుడు ఈ భూమి ప్రభుత్వానిదని తెలీదా?” అని బాధితులు ప్రశ్నించారు.

ఇప్పుడు పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంటోందా..
ఎన్నికలకు ముందు అన్నిపార్టీల వాళ్లూ తమకు పట్టాలిస్తామని చెప్పారు. ఇప్పుడు అధికార పార్టీ నేతలు కానీ జిల్లా నుంచే మంత్రులైన ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎందుకు మొహంచాటేస్తున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కేవలం ప్రభుత్వ భూమిని కాపాడుతున్నామని కాంగ్రెస్ చెబుతోంది. భూమాఫియా నుంచి భూదాన్ భూములను విడిపించడమే లక్ష్యంగా పేర్కొంటున్నారు. తమ హయాంలో ప్రభుత్వం కనీస వసతులు కల్పించగా, రేవంత్ సర్కారు ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్లు కూల్చడం అమానుషమని బీఆరెస్, వామపక్షాలు విమర్శిస్తున్నాయి. కారణాలేమైనా దశాబ్దాలుగా అక్కడ బతుకుతున్న పేదల జీవితాలు ఒక్కరోజులో రోడ్డున పడ్డాయి. ఉన్నట్టుండి నివాసాలు కూల్చేసి తాత్కాలికంగా ఫంక్షన్ హాళ్లలో వసతి కల్పించిన ప్రభుత్వం వారికి శాశ్వత ప్రత్యామ్నాయం మాత్రం చూపలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. నేటి రియల్ ఏస్టేట్ భూమ్‌లో పెరుగుతున్న భూముల ధరలకూ, సొంత గూడు కలకు మధ్య నలుగుతున్న పేదవాడికి పరిష్కారం చూపకపోతే ఈ వేడి ఖమ్మం నగరాన్ని మరింత రగిలించే అవకాశం కనిపిస్తోంది.

Leave A Reply

Your email address will not be published.