- ఫార్ములా ఈ – కేసులో మాజీమంత్రి కేటీఆర్‌కు నోటీసులు.
- ఈనెల 28న విచారణకు హాజరు కావాలి.
- యూకే, అమెరికా పర్యటన తర్వాత హాజరువుతానన్న కేటీఆర్.
- చట్టాన్ని గౌరవించే వ్యక్తిని నేను, విచారణకు సహకరిస్తా.
- ఏసీబీ నోటీసులకు వ్రాతపూర్వక సమాధానమిచ్చిన కేటీఆర్.
ముద్ర, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు, కేటీఆర్‌కు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో నిర్వహించిన ఫార్ములా ఈ – కేసులో ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే నెలాఖరులో బీఆర్ఎస్ రజతోత్సవ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు యూకే, అమెరికా పర్యటన షెడ్యూల్ ఇప్పటికే ఖరారైనందున, అక్కడ నుంచి తిరిగి వచ్చిన తర్వాత హాజరవుతానని కేటీఆర్ బదులిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలు, అరాచకాలను ప్రశ్నిస్తున్నందుకు రగిలిపోతున్న సీఎం రేవంత్ రెడ్డి తనపై ప్రతీకారంతో ఎంతకైనా దిగజారుతారన్న సంగతి ఈ ఏసీబీ నోటీసులతో అర్ధమైందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.రాజకీయ వేధింపుల్లో భాగంగానే తనకు ఏసీబీ చేత నోటీసులు ఇప్పించారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపు కోసం తహతహలాడుతున్నారని ఆయన మండిపడ్డారు. 48 గంటల క్రితం నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఈడీ ఛార్జ్‌షీట్‌లో సీఎం రేవంత్ రెడ్డి పేరు బయటకు వచ్చిందని, అందుకే ఆయన కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి నాయకుడిగానే కాకుండా, మనిషిగా కూడా ఎంతగా పతనం అవుతున్నారో చెప్పడానికి ఈ చౌకబారు ప్రతీకార చర్యలే నిదర్శనం కేటీఆర్ స్పష్టంచేశారు. బీఆర్ఎస్ ను చూస్తే రేవంత్ లో రోజురోజుకూ భయం పెరిగిపోతోందని స్పష్టంగా అర్థమవుతోంది కేటీఆర్ చెప్పారు.చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా విచారణకు సహకరిస్తానని కేటీఆర్ తెలిపారు. నోటీసులపై ఏసీబీ అధికారులకు వ్రాతపూర్వకంగా తాను సమాధానం ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ హాయాంలో హైదరాబాద్‌లో ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో అవకతవకలు జరిగాయని, నిబంధనలకు విరుద్ధంగా నిధుల చెల్లింపు జరిగిందన్న అభియోగాలపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.మాజీ మంత్రి కేటీఆర్, సీనియర్ ఐఎఎస్ అధికారి అర్వింద్ కుమార్, హెచ్ ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిలను ఈకేసులో నిందితులుగా చేర్చారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కేటీఆర్, అర్వింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలతో పాటు ఈ కార్ రేస్ నిర్వాహకులను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. అప్పట్లో కేటీఆర్‌ను అరెస్టు చేస్తారనే ప్రచారం కూడా జోరుగా సాగించింది. కానీ అలాంటిదేమీ జరగలేదు. గత కొంతకాలంగా ఏసీబీ మౌనంగా ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం నాడు మాజీ మంత్రి కేటీఆర్‌కు ఏసీబీ రెండోసారి నోటీసులు జారీ చేయడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చానీయంశంగా మారింది.మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాజీమంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్‌లకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులను జారీ చేసిన విషయం తెలిసిందే. ఒకేసారి బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు నోటీసులు అందడం గమనార్హం.
- కుట్రపూరితంగా కేటీఆర్‌కి నోటీసులు – ఎమ్మెల్సీ కవిత
తన సోదరుడు కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేయడంపై ఎమ్మెల్సీ కవిత ఘాటుగా స్పందించారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటీఆర్‌కి నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆమె తెలిపారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటిల రాజకీయ క్రీడలో భాగంగానే ఏసీబీ నోటీసులు జారీ చేసినట్లు స్పష్టమవుతోందన్నారు.తమ పార్టీ నాయకులకు వరుస నోటీసులు జారీ చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉన్నట్లు తేటతెల్లమైందని ఆమె మండిపడ్డారు.ఎవరెన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించినా తట్టుకొని నిలబడ్డ చరిత్ర కేసీఆర్ సైనికులదని ఆమె పేర్కొన్నారు.