జగిత్యాలలో విషాదం…
శోక సంద్రంలో కుటుంబ సభ్యులు…
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
గుండె పోటుతో పదేళ్ల చిన్నారి మృతి చెందిన విషాదకర సంఘటన జగిత్యాలలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…. జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామానికి చెందిన తోపారపు నిషాంత్ (10) బాలుడు గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందాడు. మూడో తరగతి చదువుతున్న చిన్నారి ఇలా అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. నిషాంత్ తల్లిదండ్రులు చంద్రశేఖర్, నవిత. కాగా తండ్రి చంద్రశేఖర్ జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నారు. వారి వ్యవసాయ పొలం వద్ద ఉన్న శివాలయంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుండగా, నిషాంత్ అక్కడ ఉత్సాహంగా పాల్గొన్నాడు. అయితే ఆ సమయంలో బాలుడికి ఫిట్స్ రావడంతో ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు. కంగారుపడిన కుటుంబ సభ్యులు వెంటనే బాలుడిని చికిత్స నిమిత్తం జగిత్యాలలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. దురదృష్టవశాత్తు ఆసుపత్రికి చేరుకునే మార్గమధ్యలోనే నిషాంత్ తీవ్రమైన గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచాడు. వైద్యులు పరీక్షించి బాలుడు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. చంద్రశేఖర్, నవిత దంపతులకు నిషాంత్ ఒక్కగానొక్క కుమారుడు. కళ్లముందే ఆడుతూ పాడుతూ ఉన్న బిడ్డ, అప్పటివరకు అందరితో కలిసి అన్నదానంలో పాల్గొన్న చిన్నారి ఇలా విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. చిన్న వయసులోనే గుండెపోటుతో బాలుడు మరణించాడనే వార్త విన్న పొరండ్ల గ్రామస్థులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.