Take a fresh look at your lifestyle.

బీఆర్ఎస్ కథ ఒడిసిన ముచ్చట -టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

కేసీఆర్ ఎర్రవల్లి ఫాం హౌస్: కు పరిమితమయ్యారు
కవిత వేరు కుంపటికి రంగం సిద్ధం చేసుకుంటోంది
బీఆర్ఎస్ లో వాటాలు పంచుకోలేని పరిస్థితి

ముద్ర, నాగర్ కర్నూల్ :

తెలంగాణలో బీఆర్ఎస్ కథ ఒడిసిన ముచ్చట అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి ఫాం హౌస్: కు పరిమితమైతే… ఆమె బిడ్డ కవిత వేరు కుంపటికి రంగం సిద్ధం చేసుకుంటోందన్నారు. కల్వకుంట్ల ఫ్యామిలి దీన స్థితిని చూసి సంతోష్ రావు కళ్లలో ఆనందం వెయ్యి రేట్లు పెరిగిందన్నారు. ప్రస్తుత పార్టీ పరిస్ధితులను చూస్తే బీఆర్ఎస్ పాలనలో అక్రమంగా సంపాదించుకున్న వాటాలు పంచుకోలేని దుస్థితి నెలకొందన్నారు. మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించిన ఆయన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన డీసీసీ కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో నీళ్ల దోపిడీ పేరిట రూ. 1.20లక్షల కోట్లు గోదావరి పాలు చేశారని ఆరోపించారు. గత పాలకుల అవినీతి, ధన దాహానికి కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోచే పరిస్థితి దాపురించిందన్నారు. కాళేశ్వరం దగ్గర ఇచ్చిన ప్రెసెంటేషన్ లో కేవలం 86వేల ఎకరాలే ఈ ప్రాజెక్ట్ కింద సాగునీరు అందిందని ఇరిగేషన్ ఇంజనీర్ ఇన్ చీఫ్ గా పని చేసిన మురళీధర్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. అయినా కాళేశ్వరం ప్రాజెక్ట్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అని దాని కింద రూ. 45 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతున్నాయని కేటీఆర్ ప్రగల్భాలు పలుకుతున్నారని మండిపడ్డారు. అబద్ధాలు ఆడడంలో ఆయనకు నోబెల్ ప్రైజ్ ఇవ్వొచ్చని చురకలంటించారు. బీజేపీని తెలంగాణ ప్రజలు నమ్మారన్న మహేశ్ కుమార్ గౌడ్… అంబానీ, అదానీలకు దోచిపెట్టడమే ప్రధానమంత్రి మోదీ పని అన్నారు. కులగణనతో పాటు బీసీ సామాజిక వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం చేసిన ఘనత కాంగ్రెస్ కే దక్కిందన్నారు. పార్టీలోనూ ఆయా వర్గాలకు పెద్ద పీట వేస్తోందన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కార్యవర్గంలో కూడా సామాజిక న్యాయం పాటించిందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందించి రైతుల జీవితాల్లో శాశ్వత మార్పు తీసుకురావడం సర్కార్ లక్ష్యమన్నారు. ప్రాజెక్ట్ పనుల కోసం కేంద్రం నుంచి నిధులు, సహకారం లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తోందని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తోందన్న ఆయన పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే సాగు, తాగునీరు, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు.

Leave A Reply

Your email address will not be published.