మూడవ రోజు కొనసాగిన భక్తుల రద్దీ…
లడ్డులు లేక కౌంటర్ల వద్ద భక్తుల ఆందోళన…
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు గుట్టపై హనుమాన్ దీక్ష పరులతో కాషాయ మయంగా మారింది. మూడు రోజులపాటు జరిగే హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా మూడో రోజు కూడా భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గలేదు.

రాష్ట్రం నలుమూలల నుంచి దీక్షాపరులు కొండగట్టుకు చేరుకుని స్వామివారిని దర్శించుకుని, మాల విరమణ చేసి తిరిగి ప్రయాణం అయ్యారు. అయితే భక్తులు పెద్ద ఎత్తున రావడంతో వారికి సరిపడా సౌకర్యాలు కల్పించడంలో ఆలయ అధికారులు విఫలమయ్యారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పి అశోక్ కుమార్లు ఉత్సవాల సందర్భంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భక్తులకు ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
లడ్డు ప్రసాదాలు లేక భక్తుల ఆగ్రహం…
కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ మేరకు దేవస్థానం ప్రసాదం కౌంటర్ వద్ద భక్తులు సరిపడా లడ్డు ప్రసాదాలు లేక భక్తులు ఆందోళన దిగారు.

ఎంత దూరం నుంచి వ్యయ ప్రయాసలకు ఓర్చి వస్తే కనీసం స్వామివారి ప్రసాదం కూడా ఇవ్వడం లేదని ఇబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటల తరబడి క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నా లడ్డూ ప్రసాదం అందుబాటులో లేక ఆగ్రహం వ్యక్తం భక్తులు మండిపడ్డారు. ప్రసాదాలు అడిగితే దురుసుగా ప్రవర్తించిన ఆలయ సిబ్బందితో వాగ్వాదానికి దిగడంతోపాటు నేరుగా ప్రసాదం తయారీ కేంద్రం దగ్గరకు వచ్చి ఓ భక్తుడు ఆందోళనకు దిగాడు.
కొండగట్టు వెళ్తున్న అంజన్న భక్తులకి రోడ్డు ప్రమాదం…

భూపాలపల్లికి చెందిన హనుమాన్ మాల ధరించిన ఐదుగురు భక్తులు ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న సన్నిధికి కారులో బయలుదేరారు. ఈ మేరకు జగిత్యాల మండలం తక్కళ్లపల్లి సమీపంలోకి రాగానే ముందు టైరు పేలడంతో అదుపుతప్పిన కారు, వేగంగా వెళ్లి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి స్వల్ప గాయాలు కాగా ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వారిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు.