యుద్ధానికి ముందు డ్రగ్స్ ఆయుధం
కాంగ్రెస్ కలిసి వచ్చిన డ్రగ్స్ కేసు
అధికార పార్టీ చూపంతా కేటీఆర్ వైపే..?
బడ్జెట్ సెషన్ లో బీఆర్ఎస్ కు తిప్పలు
గులాబీ దళం చిక్కుల్లో పడుతుందా
మండలిలో విమర్శలు చేసిన ఎమ్మెల్సీలు
తన జోలికి రావద్దన్న కేటీఆర్
ముద్ర, తెలంగాణ బ్యూరో :
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న ముందు రోజే డ్రగ్స్ కేసు హైదరాబాద్ లో వెలుగు చూసింది. కేటీఆర్‌తో దగ్గర సంబంధాలు ఉన్న పైలట్ రోహిత్ రెడ్డి దొరకడాన్ని కాంగ్రెస్ అడ్వాంటేజ్ గా తీసుకుంటోంది. డ్రగ్స్ కేసు రాజకీయ పేలుళ్లకు కారణం అవుతోంది. ఏపీలో ఎంపీ మహేష్ ను పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలని టీడీపీ ఆదేశించింది. వెంటనే చర్యలు తీసుకుంది. అయితే పైలట్ రోహిత్ రెడ్డి విషయంలో బీఆర్ఎస్ ఆలోచిస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ వెంటనే కేటీఆర్ ను టార్గెట్ చేసింది. ఆయనతో వైట్ చాలెంజ్ విసురుతోంది. కేటీఆర్ కూడా రివర్స్ చాలెంజ్ విసిరారు. అసెంబ్లీ సమాశాల్లోనూ ఇది హాట్ టాపిక్ అయ్యే అవకాశం ఉంది. గతంలోనూ డ్రగ్స్ అంశం రాజకీయంగా కీలకంగా మారింది. ఇప్పుడు మరోసారి అదే అంశం హాట్ టాపిక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతం కేవలం ఒక క్రైమ్ ఇన్సిడెంట్‌గా మిగిలిపోకుండా, తెలుగు రాష్ట్రాల్లో పెను రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో వెలుగులోకి వచ్చిన పేర్లు, ఆపై జరిగిన పరిణామాలు అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి కేంద్రబిందువుగా మారాయి. డ్రగ్స్ కేసును అస్త్రంగా చేసుకుని రాజకీయంగా పైచేయి సాధించేందుకు అటు ఏపీలోనూ, ఇటు తెలంగాణలోనూ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో డ్రగ్స్ కేసు ప్రకంపనలు రాగానే టీడీపీ అధిష్టానం అత్యంత వేగంగా స్పందించడం చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ పుట్టా మహేష్ యాదవ్‌ను పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది తప్పు ఎవరిదైనా సరే, క్రమశిక్షణ విషయంలో రాజీ పడబోం అనే సంకేతాలను ప్రజల్లోకి పంపడం ద్వారా ప్రభుత్వం నైతిక విజయాన్ని సాధించే ప్రయత్నం చేస్తోంది. అధికారంలో ఉన్న పార్టీగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ద్వారా విపక్షాల నోళ్లు నొక్కేయవచ్చని టీడీపీ భావిస్తోంది.
పైలట్ రోహిత్ రెడ్డిపై ఎలాంటి చర్యలు ప్రకటించని బీఆర్ఎస్
తెలంగాణలో పరిస్థితి మరోలా ఉంది. ఫామ్‌హౌస్ పార్టీలో రోహిత్ రెడ్డి పేరు వినిపించడం బీఆర్ఎస్‌ను ఇరకాటంలోకి నెట్టింది. పార్టీకి కీలక నేత కావడంతో బీఆర్ఎస్ అధిష్టానం చర్యల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. గతంలోనూ పలుమార్లు డ్రగ్స్ ఇష్యూస్ బీఆర్ఎస్ నేతల చుట్టూ తిరిగినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఇది పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. రోహిత్ రెడ్డి విషయంలో వేచి చూసే ధోరణి అవలంబించడం వల్ల ప్రతిపక్షాలకు విమర్శలు చేసేందుకు అవకాశం ఇచ్చినట్లయింది. తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్ ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవడం లేదు. గతంలో రేవంత్ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్ ను ఇప్పుడు మళ్ళీ తెరపైకి తెచ్చారు. కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ నేతలు డ్రగ్స్ టెస్టులకు సిద్ధమా అని సవాల్ విసురుతున్నారు. దీనికి ప్రతిగా కేటీఆర్ కూడా రివర్స్ ఛాలెంజ్ విసరడం, నాటి కేసుల ప్రస్తావన తీసుకురావడంతో రాజకీయం మరింత హీటెక్కింది. రాష్ట్రంలో డ్రగ్ ఫ్రీ తెలంగాణ నినాదాన్ని వినిపిస్తున్న కాంగ్రెస్, ఈ కేసు ద్వారా బీఆర్ఎస్ ముసుగు తొలగిస్తామన్నట్లుగా వ్యవహరిస్తోంది.
అసెంబ్లీలో రాజకీయ యుద్ధం
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ డ్రగ్స్ ఇష్యూ ప్రధాన అస్త్రంగా మారే అవకాశం ఉంది. ప్రజాప్రతినిధులు డ్రగ్స్ పార్టీల్లో పాల్గొనడం, అందులో గన్ కల్చర్ చోటుచేసుకోవడం వంటి అంశాలపై ప్రభుత్వం గట్టిగా నిలదీసేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వంటి వారు ప్రతి 90 రోజులకు ఒకసారి టెస్టులు చేయాలనే ప్రతిపాదనలు తేవడం ఈ చర్చను మరింత ముందుకు తీసుకెళ్లేలా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ అంశం రాజకీయంగా కీలకం కావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో జరిగిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు, కొకైన్ స్కామ్స్ ఎన్నికల సమయంలో ఎంతో ప్రభావం చూపాయి. ఇప్పుడు మొయినాబాద్ కేసు ద్వారా మరోసారి అదే తరహా సెన్సేషన్ మొదలైంది. ఇది కేవలం ఒక పార్టీకే పరిమితం కాకుండా, అందరి చుట్టూ తిరుగుతుండటంతో రాబోయే రోజుల్లో రాజకీయ సమీకరణలు ఏ మలుపు తిరుగుతాయోనన్న ఆసక్తి నెలకొంది.
డ్రగ్స్ టెస్టుకు సీఎం రేవంత్ రెడ్డి రెడీ.. మరి కేసీఆర్, కేటీఆర్ వస్తారా ?
డ్రగ్స్ టెస్టుకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అంతా సిద్ధమని, మరి కేసీఆర్, కేటీఆర్ సిద్ధమా అని శాసనమండలిలో మహేష్ కుమార్ గౌడ్ ఛాలెంజ్ చేశారు. మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసు తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపుతుండగా… దీనికి అసెంబ్లీ సమావేశాలు వేదికగా మారుతున్నాయి. ఈ అంశంపై శాసనమండలిలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. డ్రగ్స్ వ్యవహారంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. టీపీసీసీ చీఫ్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ నేతలకు బహిరంగ సవాల్ విసిరారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులంతా డ్రగ్ టెస్టుకు సిద్ధంగా ఉన్నారని ఆయన ప్రకటించారు. తొలి డ్రగ్స్ టెస్ట్ సీఎం రేవంత్ రెడ్డి చేయించుకుంటారని మహేష్ గౌడ్ అన్నారు.
డ్రగ్స్ టెస్టులకు రేవంత్ రెడీ.. కేసీఆర్, కేటీఆర్ సిద్ధమా?
‘తెలంగాణ ప్రజలకు ప్రజాప్రతినిధులు ఆదర్శంగా నిలవాలి. పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని డ్రగ్స్, గంజాయిపరం చేసిన ఘనులు బీఆర్ఎస్ నేతలు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందుకోసం స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసింది. డ్రగ్స్ కు మేం వ్యతిరేకంగా అని చెప్పేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్ టెస్ట్ చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులంతా కూడా డ్రగ్స్ పరీక్షలకు వస్తారు. మరి బీఆర్ఎస్ నేతలు డ్రగ్స్ టెస్టుకు సిద్ధమా?. బీఆర్ఎస్ సభ్యులు తమ నాయకులైన ప్రతిపక్షనేత కేసీఆర్, కేటీఆర్‌లను కూడా డ్రగ్ టెస్టుకు తీసుకురాగలరా’ అని మహేష్ కుమార్ గౌడ్ ఛాలెంజ్ చేశారు.
మొయినాబాద్ డ్రగ్స్ కేసుతో సంబంధం లేదు..
డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం తాము చిత్తశుద్ధితో పని చేస్తున్నామని, తప్పు చేయని వారు భయపడాల్సిన అవసరం లేదని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసును అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారన్న బీఆర్ఎస్ ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. నేరస్తులు ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. ఈ సవాళ్లు, ప్రతిసవాళ్లతో శాసనమండలి దద్దరిల్లింది. రాజకీయ నేతల మధ్య మొదలైన ఈ ‘డ్రగ్ టెస్ట్’ వార్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ డ్రగ్స్ టెస్టుకు ఎవరు వస్తారో, ఎవరు డుమ్మా కొడతారని తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ షోకాజ్ నోటీసులు..
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ అధిష్టానం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని, ఈ కేసుకు సంబంధించి వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. నివేదిక సంతృప్తికరంగా లేని పక్షంలో క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరిస్తూ, తుది నిర్ణయం వచ్చే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. రాజకీయ వర్గాల్లో ఈ నిర్ణయం సంచలనం సృష్టిస్తోంది.
ఇప్పటికే కేటీఆర్ కౌంటర్ ఎటాక్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ మాటల యుద్ధంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విసిరిన సవాల్‌కు కేటీఆర్ రెండు రోజుల కిందటే స్పందించారు.కేటీఆర్, ఆయన అనుచరులు డ్రగ్స్ తీసుకుంటున్నట్లు అనుమానాలు ఉన్నాయని, కేటీఆర్ డ్రగ్స్ పరీక్షలకు సిద్ధం కావాలని మహేష్ కుమార్ గౌడ్ అంతకుముందు డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన కేటీఆర్, మహేష్ కుమార్ గౌడ్ ఛాలెంజ్ తాను స్వీకరిస్తున్నానని, డ్రగ్స్ టెస్టుకైనా తాను సిద్ధమని ప్రకటించారు. రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు అందరూ స్వచ్ఛందంగా డ్రగ్స్ పరీక్షలు చేయించుకుని సమాజానికి ఆదర్శంగా నిలవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు, మాజీ ప్రజాప్రతినిధులు డ్రగ్స్ వాడటం దురదృష్టకరమని, వ్యక్తిగతంగా తాను డ్రగ్స్ వాడకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తానని కేటీఆర్ స్పష్టం చేశారు. డ్రగ్స్ వినియోగించేది ఎంతటి వారైనా సరే, చట్టపరంగా కఠినంగా శిక్షించాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. అదే సమయంలో, ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేసినా.. ఈ కేసులోకి లాగాలని చూస్తే కనుక చట్టపరమైన నోటీసులు ఇస్తానని కేటీఆర్ హెచ్చరించారు. కేటీఆర్‌పై గతంలో రేవంత్ రెడ్డి పలుమార్లు ఆరోపణలు చేశారు. తన బొచ్చు కూడా ఇస్తాను టెస్టులు చేపించుకోవాలని మంత్రిగా ఉన్న సమయంలో కేటీఆర్ బదులిచ్చారు. ఎలాంటి డ్రగ్స్ టెస్టులకైనా సిద్ధమేనని, అయితే నిరాధార ఆరోపణలు చేసినా, తన పరువుకు భంగం వాటిల్లేలా వ్యాఖ్యలు చేస్తే కనుక చట్టప్రకారం పరువునష్టం దావా వేసి నోటీసులు పంపిస్తానని గతంలో చెప్పిన మాటలను కేటీఆర్ మరోసారి గుర్తుచేశారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫాం హౌస్‌లో డ్రగ్స్ పార్టీ నిర్వహించడంతో పార్టీకి చెందిన మరికొందరు నేతలు, కేటీఆర్ అనుచరులు డ్రగ్స్ తీసుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. డ్రగ్స్ తానెప్పుడూ తీసుకోలేదని, ఎప్పుడైనా సరే టెస్టులకు వెనుకాడనని కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు.