ముద్ర ప్రతినిధి, నిర్మల్:
సమాజంలో సగం మహిళలు అని, వారు అన్ని రంగాల్లో రాణించి అబలలు కాదు సబలలు అని నిరూపించుకున్నారని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవ కలెక్టరేట్ సమావేశ మందిరంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలు అబలలు కాదని, సబలలుగా అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుతున్నారని అన్నారు. విద్య ద్వారా మాత్రమే మహిళా సాధికారత సాధ్యమవుతుందని, ప్రతి మహిళ తన హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో మహిళలు ఉన్నత స్థానాలను అధిరోహించడం గర్వకారణమన్నారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న చట్టాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహిళల అభివృద్ధికి పురుషుల సహకారం కూడా అవసరమని, సమాన అవకాశాలను వినియోగించుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మహిళలు ఉద్యోగ, కుటుంబ బాధ్యతలతో పాటు తమ వ్యక్తిగత ఆరోగ్యంపై కూడా దృష్టి సారించాలన్నారు. విజయవంతమైన మహిళలు ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలన్నారు. మహిళా ఉద్యోగులకు పని ప్రదేశాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళా ఉద్యోగులు, స్వయం సహాయక సంఘాల సభ్యులను కలెక్టర్ ఘనంగా సన్మానించి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ అధికారి వినూత్న, డిఆర్డిఓ విజయలక్ష్మి, ఖజానా శాఖ అధికారి సరోజ, ఉపాధి కల్పన అధికారి విజయలక్ష్మి, ఇతర శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.