సమస్యలు రెండు వారాల్లో పరిష్కరించాలని ఆల్టిమేటం
ప్రభుత్వంలో సంస్ధ విలీనం, ఫిట్ మెంట్ అమలు ప్రధాన డిమాండ్లు
ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేత, పనిభారం తగ్గింపు కోసం పట్టు
సంస్ధ యాజమాన్యానికి జేఏసీ నేతల నోటీసులు
ముద్ర, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. తమ డిమాండ్లను తీర్చాలంటూ ఆర్టీసీ జేఏసీ నేతలు రేవంత్ రెడ్డి సర్కార్‌ను డిమాండ్ చేశారు. ఫిట్‌మెంట్, ప్రభుత్వంలో విలీనం, పెండింగ్ బకాయిలు, ఆంక్షలు ఎత్తివేయాలంటూ పలు డిమాండ్లు చేశారు. ఈ మేరకు జేఏసీ నాయకులు శుక్రవారం ఆర్టీసీ ఎండీ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకన్నకు, కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయంలో కమిషనర్‌కు సమ్మె నోటీసును అందజేశారు. మొత్తం 31 డిమాండ్లతో ఈ సమ్మె నోటీసును సమర్పించినట్లు జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న తెలిపారు. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల హోదా కల్పించాలని, 2017 పీఆర్‌సీ అమలు చేసి పెండింగ్ వేతనాలు చెల్లించాలని, 2021 పీఆర్‌సీని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవడం, కార్మికులపై విధించిన శిక్షలను రద్దు చేసి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని జెసి వైస్ చైర్మన్ థామస్ రెడ్డి కోరారు. డ్యూటీలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు తగిన పరిహారం ఇవ్వడం, ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వకుండా ఆర్టీసీ ద్వారానే నడపాలని ఆయన డిమాండ్ చేశారు. పెండింగ్ డీఏలను చెల్లించడం, రిటైర్డ్ ఉద్యోగులకు పెండింగ్ ప్రయోజనాలు ఇవ్వడం, ఖాళీ పోస్టులను భర్తీ చేయడం వంటి వంటి డిమాండ్లను కూడా నెరవేర్చాలని ప్రస్తావించారు. ఈ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే మార్చి 26 నుంచి సమ్మె ప్రారంభిస్తామని జేఏసీ స్పష్టం చేసింది. జేఈసీ కన్వీనర్ ఎండి మౌలానా, కో కన్వీనర్లు యాదయ్య, సురేష్, యాదగిరి పాల్గొన్నారు.
గతేడాది సమ్మె చేసేందుకు సిద్ధమైన ఆర్టీసీ కార్మికులు.. ప్రభుత్వ హామీతో వెనక్కి తగ్గారు. తమ సమస్యలను పరిష్కరించుకునే వరకు ఈసారి సమ్మెను విరమించకూడదని ఆర్టీసీ కార్మిక సంఘాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈసారి ఎలాంటి పరిస్థితుల్లో డిమాండ్లను సాధించుకునే వరకు వెనక్కి తగ్గకూడదని నిర్ణయించుకున్నారు. రెండు వారాల్లోపు ప్రభుత్వం స్పందించకుంటే సమ్మె తప్పదని నేతలు హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే సమ్మె తేదీపై రెండు వారాల తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. ఈ క్రమంలో గతంలో ఆర్టీసీకి ప్రభుత్వం ఇచ్చిన హామీలను పట్టించుకోవడం లేదని కార్మిక సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలు పణంగా పెట్టి ఏళ్లుగా ఆర్టీసీకి సేవలు అందిస్తున్నా తమకు మాత్రం ఎదుగుదల లేదని వాపోయారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను చేపట్టకపోతే రాష్ట్రవ్యాప్తంగా బస్సు చక్రం ఆగిపోక తప్పదని ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ హెచ్చరించింది. ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చిన కార్మిక జేఏసీ నేతలు.. తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించారు. ఈ నెల 26వ తేదీన హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద దీక్ష చేపట్టేందుకు కార్మిక సంఘాలు రెడీ అవుతున్నాయి.
విలీనమే ప్రధాన డిమాండ్
తమ చిరకాల కోరిక అయిన రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం డిమాండ్ ను జేఏసీ నాయకులు ప్రధాన డిమాండ్ గా పేర్కొన్నారు. ఆ ప్రక్రియను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. అదే సమంయలో 2021 వేతన సవరణను 30 శాతం ఫిట్‌మెంట్‌తో అమలు చేయాలని కోరారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం కింద ప్రతినెలా రూ.350 కోట్లను ఎలాంటి కోతలు లేకుండా ఆర్టీసీకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి రావాల్సిన రూ.2,500 కోట్ల పాత పెండింగ్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. అదే సమయంలో ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని పేర్కొన్నారు. ఆర్టీసీ ట్రేడ్ యూనియన్లపై ప్రభుత్వం గతంలో విధించిన ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసి.. వెంటనే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని తెలిపారు. ఆర్టీసీలోని అన్ని విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులపై ప్రస్తుతం ఉన్న అధిక పనిభారాన్ని తగ్గించాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు.
ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రధాన డిమాండ్లు
పూర్తిస్థాయిలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలి.
ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న వేతన సవరణను వెంటనే అమలు చేయాలి.
రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్, పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను రిలీజ్ చేయాలి.
ఆర్టీసీని బలోపేతం చేసేందుకు కొత్త బస్సులను ప్రవేశపెట్టాలి. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.