Take a fresh look at your lifestyle.

చెదిరిన ఓటు బ్యాంకు

కార్పొరేషన్లు.. మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జైత్రయాత్ర
39.80 శాతం ఓట్లతో అధికార పార్టీ హల్ చల్
‘హస్తం’ గాలికి రాలిన గులాబీ రెక్కలు
కరీంనగర్ మినహా ఎక్కడా వికసించని కమలం
ప్రధాన పార్టీలకు స్వతంత్రుల గట్టిపోటీ

ముద్ర, తెలంగాణ బ్యూరో :

‘హస్తం’సునామీలో.. ప్రధాన పార్టీల ఓటు బ్యాంకు చెల్లాచెదురైంది. ఈ నెల 11 విడుదలైన పుర ఫలితాల్లో రాష్ట్రంలోని ఏడు కార్పొరేషన్లు.. 116 మున్సిపాలిటీల్లో ఓటర్ల తీర్పు ఏకపక్షంగా వెల్లువెత్తింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు గణనీయంగా పుంజుకుంది. 2020 జనవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికలతో పోలిస్తే ఈ సారి తొమ్మిదింతలు పెరిగింది. 2020లో రాష్ట్రంలో 120 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో కేవలం మూడు స్ధానాల్లో గెలిచిన కాంగ్రెస్… ఈసారి ఏకంగా 64 పుర పీఠాలను కైవసం చేసుకున్నది. మొత్తం పోలైన ఓట్లతో పోలిస్తే అప్పుడు కేవలం 09 శాతం ఓటు బ్యాంకు సాధించిన కాంగ్రెస్.. ఈసారి 39.80శాతం ఓట్లు సాధించింది. గత ఎన్నికల్లో తెలంగాణ ఇచ్చింది తామేనంటూ ప్రజల్లో వెళ్లి భంగపడ్డ కాంగ్రెస్ పార్టీ.. ఈ సారి గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలు, రెండున్నరేళ్ల తమ పాలనలో చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించి ముందుకెళ్లింది. దీంతో అసెంబ్లీ, సర్పంచి ఎన్నికల్లో మార్పు కోరుకున్న ప్రజలు ఈ సారి మున్సిపల్ ఎన్నికల్లోనూ ఓటు బ్యాంకు రూపంలో కాంగ్రెస్ కు వెన్నంటి నిలిచారు. పుర పోరులోనూ కొత్త ఆశలు.. ఆకాంక్షలతో ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు. ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మాత్రం అసెంబ్లీ, లోక్ సభ, సర్పంచ్ ఎన్నికల్లో చవి చూసిన ఫలితాలనే మున్సిపల్ పోరులో చవి చూసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ ను నగర, పట్టణ ప్రజలు ఈ సారి ఆదరించలేదు. రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో ఎదుర్కొన్న విచారణలు, అవినీతి ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అయిన బీఆర్ఎస్ పుర ఓటర్ల దృష్టిని ఆకర్శించడంలో ఘోరంగా విఫలమైంది. ఫలితంగా గత మున్సిపల్ ఎన్నికల్లో ఎనిమిది కార్పొరేషన్లలో దూసుకెళ్లిన కారు.. ఈ సారి ఒక్క కార్పొరేషన్ పైనా గులాబీ జెండా ఎగురవేయలేకపోయింది. అప్పట్లో పట్టణాల్లోనూ పరుగులు పెట్టిన కారు 120 మున్సిపాలిటీలకు గానూ 109 స్ధానాలు సొంతం చేసుకోగా.. ఈ సారి ఫలితాల్లో బోల్తా పడింది.116 మున్సిపాలిటీలకు కేవలం 13 స్ధానాలతోనే సరిపెట్టుకున్నది. మొత్తం పోలైన ఓట్లలో కేవలం 28.75శాతం ఓట్లు మాత్రమే సాధించింది. ఇక అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో తొమ్మిది చొప్పున సీట్లతో వికసించి…. ప్రస్తుతం రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం తామేనంటూ గొప్పలు చెప్పుకున్న కమలం పార్టీకి… ఈ ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టబోయినంత పనైంది. ఏడు కార్పొరేషన్లలో ఒక్క కరీంనగర్ లో తప్పా ఎక్కడా తన ప్రభావాన్ని చూపలేకపోయింది. ఇటు 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే ఒక్క పుర పీఠంపైనా కాషాయం జెండా ఎగురించలేకపోయింది. ఈ క్రమంలో 15.67శాతం ఓట్లతోనే సరిపెట్టుకున్నది. మరోవైపు.. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు తెలిపి.. ఈ సారి ఒంటరిగా బరిలో నిలిచిన సీపీఐ అనూహ్యంగా.. కొత్తగూడెం కార్పొరేషన్ పై ఎర్రజెండా ఎగురవేసింది. ఈ ఎన్నికల్లో మొత్తం 49,450 ఓట్లు సాధించిన ఆ పార్టీ 1.30శాతం ఓట్లు సాధించి ఇతర పార్టీలకు షాక్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో కార్పొరేషన్లతో పాటు అనేక మున్సిపాలిటీల నుంచి తన అభ్యర్ధులను బరిలో దింపిన ఎంఐఎం పార్టీ ఎక్కడా తన ప్రాభావాన్ని కనబర్చలేకపోయింది. నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ వంటి ముఖ్య నగరాల్లో తనకు గట్టిపట్టు ఉందని భావించిన ఆ పార్టీకి ఆయా కార్పొరేషన్ ఓటర్లు ఆదరించలేదు. దీంతో ఈ ఎన్నికల్లో 3.28 శాతం ఓట్లు సాధించింది. మరోవైపు ఈ సారి ఎన్నికల్లో జాగృతి మద్దతులో బరిలో నిలిచిన ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్ బీ) రాష్ట్రంలో ప్రధాన పార్టీలు, నాయకులకు అందరికీ ఝలక్ ఇచ్చింది. ఇందులో భాగంగా గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీపై సింహం జెండా ఎగురవేసింది. ఈ ఎన్నికల్లో 1.51శాతం ఓట్లు సాధించి అందరినీ ఔరా అనిపించింది. వీరితో పాటు ప్రధాన పార్టీల నుంచి టిక్కెట్లు ఆశించి భంగపడి… స్వతంత్రంగా పోటీ చేసిన అభ్యర్ధులు ఈ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్శించారు. 3,14,096 ఓట్లు సాధించి 8.30శాతం ఓటింగ్ తో ప్రధాన పార్టీ అభ్యర్ధుల గెలుపును పరోక్షంగా అడ్డుకున్నారు. వీరి పోటీతో మొత్తం 38 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడగా.. అక్కడ ఏ పార్టీ అధికారంలో రావాలన్నా వారే కింగ్ మేకర్లుగా మారారు. దీంతో ప్రధాన పార్టీలన్నీ స్వతంత్రుల మద్దతు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తాయిలాలు, ఆపర్లతో బుజ్జగించి వారిని తమ వైపు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఈ నెల 16న జరగనున్న కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ ఛైర్మన్ల్, వైస్ ఛైర్మన్ల ఎన్నికలో వీరి మద్దతు అనివార్యమైంది. దీంతో ఈ ఎన్నిక ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్నది.

రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో ఓటర్ల సంఖ్య : 52,43,023
మున్సిపల్ ఎన్నికల్లో పోలైన ఓట్లు : 37,81,232
=======================================
మున్సిపాలిటీలు + కార్పొరేషన్ల వారీగా పోలైన ఓట్ల శాతం
పార్టీ పోలైన ఓట్లు ఓటింగ్ శాతం
=================================
కాంగ్రెస్ 15,05,006 39.80
బీఆర్ఎస్ 10,87,347 28.75
బీజేపీ 5,92,823 15.67
స్వతంత్రులు 3,14,096 8.30
ఎంఐఎం 1,24,236 3.28
ఏఐఎఫ్ బి 57,129 1.51
సీపీఐ 49,450 1.30
సీపీఎం 22,048 0.58
జనసేన పార్టీ 13,504 0.37
బీఎస్పీ 7,115 0.20
===============================
ఏడు కార్పొరేషన్లలో పార్టీలు సాధించిన సీట్లు (414)
కాంగ్రెస్ 190
బీజేపీ 75
బీఆర్ఎస్ 60
ఇతరులు 89
=============
మొత్తం 414
========================
116 మున్సిపాలిటీల్లో పార్టీలు గెలిచిన వార్డులు (2581)
కాంగ్రెస్ 1,347
బీఆర్ఎస్ 716
బీజేపీ 261
ఇతరులు 257
==============
మొత్తం 2,581

Leave A Reply

Your email address will not be published.