Take a fresh look at your lifestyle.

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశం
ఆసుపత్రి పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచన

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్

నాగర్ కర్నూల్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల నుంచి వివిధ రోగాలతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్య సేవలు అందేలా వైద్యులు, సిబ్బంది కృషి చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆదేశించారు.

 

సోమవారం ఉదయం 7 గంటలకే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి, విధుల్లో ఉన్న వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది హాజరు వివరాలను తెలుసుకున్నారు. డ్యూటీల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకూడదని హెచ్చరించారు. రోగులకు సమయానికి వైద్యం అందించడంతో పాటు అత్యవసర సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల వద్దకు వెళ్లిన కలెక్టర్ వారి ఆరోగ్య పరిస్థితి, అందుతున్న వైద్య సేవలపై స్వయంగా ఆరా తీశారు. మందులు సమయానికి అందుతున్నాయా, డాక్టర్లు క్రమం తప్పకుండా పరీక్షిస్తున్నారా, వసతులు ఎలా ఉన్నాయనే అంశాలపై రోగులను ప్రశ్నించారు. కొంతమంది రోగులు వైద్య సేవలు మెరుగ్గా అందుతున్నాయని పేర్కొనగా, మరికొందరు పరిశుభ్రత విషయంలో మరింత శ్రద్ధ అవసరమని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా ఆసుపత్రి పరిసరాలను పరిశీలించిన కలెక్టర్ ఆసుపత్రి ప్రాంగణం, వార్డులు, మరుగుదొడ్లు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సానిటేషన్ నిర్వహణ కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ప్రతిరోజూ పర్యవేక్షణ చేయాలని సూచించారు. రోగులు మరియు వారి సహాయకులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించడం వైద్యాధికారుల బాధ్యత అని స్పష్టం చేశారు. తాను మళ్లీ వచ్చే సందర్శన వరకు ఆసుపత్రి పరిశుభ్ర వాతావరణంలో ఉండాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ప్రజలు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకే ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న వైద్య సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన సదుపాయాలు, నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉన్నారని తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా వైద్య సిబ్బంది సేవాభావంతో పనిచేయాలని, అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులకు ప్రత్యేక శ్రద్ధతో వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. రోగులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం ప్రతి ఉద్యోగి బాధ్యత అని పేర్కొన్నారు.

జిల్లా కలెక్టర్ వెంట వైద్యులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.