Take a fresh look at your lifestyle.

ప్రాణాలు పోసే డాక్టర్లకు భద్రత కరవు డాక్టర్లపై దాడులు – రోగులకు సంకటం చర్యలు తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నారాయణునికి ప్రతిరూపంగా భావించే వైద్యులకు రక్షణ కరువవుతోంది. ప్రాణాలు పోసే వైద్యులకు భద్రత కరువవుతోంది. తాజాగా గురువారం రాత్రి నిర్మల్ పట్టణంలోని పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సంతోష్ రాజ్ పై జరిగిన దాడి ఈ విషయాన్ని బలపరుస్తోంది. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకుంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు వైద్యులు సిద్ధమవుతున్నారు. వివరాల్లోకి వెళితే డాక్టర్ సంతోష్ రాజ్ పిల్లల వైద్య నిపుణులు. ఒక బాలునికి చికిత్స నిమిత్తం వచ్చిన బంధువులు డిశ్చార్జి అనంతరం అవసరమైన బిల్లులను ఇన్సూరెన్స్ క్లెయిమ్ నిమిత్తం కోరారు. ఇదే క్రమంలో వాస్తవంగా చికిత్సకు అయిన మొత్తానికి పత్రాలు అందించారు. ఐతే బిల్లును ఎక్కువ మొత్తానికి ఇవ్వాలని ఒత్తిడి తేవడంతో ఆయన నిరాకరించారు. ఐతే బాలుని బంధువులు దుర్భాషలాడుతూ డాక్టర్ పై చేయి చేసుకున్నారు. ఈ ఘటనపై ఆగ్రహించిన వైద్యులు తమ ఔట్ పేషెంట్ సేవలను బహిష్కరించి, అదే రాత్రి జాతీయ రహదారి 44పై ధర్నాకు దిగారు. డాక్టర్ పై దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి చర్యలు చేపట్టాలంటూ నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. డాక్టర్ పై దాడిని నిరసిస్తూ ఆర్యవైశ్య సంఘం, నిర్మల్ లాబ్ టెక్నీషియన్స్ సంఘం, కెమిస్ట్స్ సంఘం, ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, పర మెడికల్ సిబ్బంది డాక్టర్లతో కలిసి ధర్నా, రాస్తా రోకో లలో పాల్గొన్నారు. దీంతో రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో తొలుత ఎఎస్పీ సాయి కిరణ్ ఆందోళన చేస్తున్న డాక్టర్లకు నచ్చజెప్పేందుకు యత్నించారు. ఐతే వారు అంగీకరించకపోవడంతో చివరికి ఎస్పీ జానకి షర్మిల అక్కడికి చేరుకున్నారు. దాడికి బాధ్యులైన వారిపై కేసు నమోదు చేశామని తెలిపారు. అనంతరం 24 గంటల్లోపు పట్టుకోవాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని నిరసనలు చేస్తున్న డాక్టర్లు డిమాండ్ చేశారు. ఎస్పీ జానకి షర్మిల ఇచ్చిన హమీ మేరకు వారు నిరసనలు విరమించారు.

చర్యలు తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు: ఐ ఎం ఏ అధ్యక్షులు మురళీధర్
ఇదిలా ఉండగా డాక్టర్లు ఐ ఎం ఏ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం ఐ ఎం ఏ అధ్యక్షులు డాక్టర్ మురళీధర్ నేతృత్వంలో ఎం ఎల్ ఎ ఏలేటి మహేశ్వర్ రెడ్డి తో సమావేశమయ్యారు. అనంతరం సంఘ కార్యవర్గ సమావేశంలో చర్చించారు. డాక్టర్లపై దాడులు వారి సేవలకు అడ్డంకిగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఐ ఎం ఏ అధ్యక్షులు మురళీధర్ “ముద్ర ప్రతినిధి” తో మాట్లాడుతూ దాడులను ప్రతి ఒక్కరు ఖండించాలని కోరారు. ఇలాంటి దాడుల వల్ల అత్యవసర పరిస్థితుల్లో సేవలు అందకుండా పోయే అవకాశం ఉందన్నారు. ఐఎంఎ రాష్ట్ర శాఖ తో ఈ విషయంలో చర్చిస్తున్నామన్నారు. ఇచ్చిన హామీ మేరకు 24 గంటల్లోగా చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధమని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.