శ్రీవారికి కల్పవృక్ష వాహన సేవ…
పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ గరికపాటి నరసింహారావుచే ప్రవచనం..
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు గురువారం స్వర్ణగిరిలో వైభవంగా జరిగాయి. నిత్య ఆరాధనలు పూర్తి చేసిన తరువాత స్వామి వారికి నివేదించిన ఉగాది పచ్చడిని భక్తులకు అందచేశారు. అనంతరం వసంతనవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని శ్రీ రామాయణ కృతు మహా యగ్యమును ప్రారంభించారు. ఇందుకు పూర్వాంగముగా ఉదయం 8 గంటలకు శ్రీ సీతా రామచంద్ర లక్ష్మణులకు పంచవింశత కలశ స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి కొలువుదీర్చారు.

ఉగాది ఆస్థానంలో భాగంగా ఆలయ స్థానాచార్యులు దిట్టకవి శ్రవణ్ కుమారాచార్యులు పంచాంగ శ్రవణం నిర్వహించారు. అనంతరం శ్రీ రామాయణ కృతు మహా యగ్యమునకు అంకుర్రార్పణ చేశారు.

సాయంత్రం శ్రీవారికి కల్పవృక్ష వాహన సేవ నిర్వహించారు. శ్రీవారి వైభవోత్సవ మండపంలో “కాల ప్రభావము – కలియుగ దైవము” అన్న అంశము మీద పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ గరికపాటి నరసింహారావు ప్రవచనం చేశారు. ఈ కార్యక్రమాలలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మానేపల్లి రామారావు కుటుంభ సమేతంగా పాల్గొన్నారు.
ప్రతిరోజు స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి అన్న ప్రసాద వితరణలో భాగంగా సుమారు 3000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు.