మెగా కృష్ణారెడ్డి కోసమే నైనీ టెండర్లు
ఈ వ్యవహారంలో సృజన్ రెడ్డి చిన్న చేప
అవినీతి తిమింగలానికి అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ ఆవేదన
హరీశ్ రావును నమ్మి ఆయన కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టారు
నేను కాంగ్రెస్ లో చేరను జాగృతి అధ్యక్షురాలు కవిత
ముద్ర, తెలంగాణ బ్యూరో :
బొగ్గు టెండర్ల వ్యవహారంలో పెద్ద తిమింగలం మెగాను కాపాడేందుకు మాజీ మంత్రి హరీశ్ రావు పాట్లు పడుతున్నారని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. తిమింగలం లాంటి కాంట్రాక్టర్ కు అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ ఆవేదన చెందుతోందన్నారు. మెగా కృష్ణారెడ్డి కోసమే నైనీ టెండర్లు పెట్టారన్న ఆమెఈ టెండర్ల అంశంలో సృజన్ రెడ్డి కేవలం చిన్న చేపనే అన్నారు. పవర్ మినిస్టర్ భట్టికి లేఖ రాయడానికి బీఆర్ఎస్ కు ఇబ్బంది ఏంటి అని నిలదీశారు. అసలు బీఆర్ఎస్ పాలనలో ఓబీసీలకు సైట్ విజిట్ విధానం లేదని సెటైర్ వేశారు. ఆదివారం బంజారాహిల్స్ లోని జాగృతి కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. నైని కోల్ బ్లాక్ టెండర్ల విషయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టగానే మా గుంట నక్క ప్రెస్ మీట్ పెట్టారని హరీశ్ రావును ఉద్దేశించి చెప్పారు. గుంట నక్క ప్రెస్ మీట్ ను గుడ్డిగా నమ్మి కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టారని వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో ప్రభుత్వం చేపడుతోన్న విచారణ రెండేళ్లుగా సాగుతూ ‘కార్తీకదీపం’ సీరియల్‌ను తలపిస్తోందని కవిత చురకలంటించారు. ప్రజల్లో ఇది హాస్యాస్పదంగా మారిందని ఎద్దేవా చేశారు. కేవలం ఎన్నికల లబ్ధి కోసమే ఈ అంశాన్ని తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. తీవ్రవాదుల కోసం వాడాల్సిన ట్యాపింగ్‌ను రాజకీయాలకు వాడటం సరికాదని సూచించారు. విచారణను సాగదీయకుండా వెంటనే బాధితులకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కవిత కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారనీ దానికి తాను వ్యతిరేకమంటూ టీపీసీసీ చీఫ్ చేసిన వ్యాఖ్యలపై కవిత స్పందించారు. ఎట్టిపరిస్థితుల్లోనే తాను కాంగ్రెస్‌లో చేరనని చెప్పారు. అసలు ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు.. మీరే జాగృతి పార్టీలో చేరండని మహేశ్ కుమార్ గౌడ్ కు సూచించారు. భవిష్యత్తులో తాను స్థాపించే పార్టీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు మహేష్ గౌడ్‌కు నా పార్టీలో కీలక పదవి ఇస్తానని వ్యాఖ్యానించారు.