ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
కవయిత్రి మొల్లను మహిళలు ఆదర్శంగా తీసుకోవాలని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కవయిత్రి మొల్ల జయంతి సందర్భంగా మహబూబ్‌నగర్ లోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ లో ఉన్న మొల్ల విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…మొల్ల ఆదర్శ మహిళ అని, 16వ శతాబ్దంలో విద్యకు ప్రాధాన్యత ఇచ్చిన గొప్ప కవయిత్రి అని పేర్కొన్నారు. రామాయణం టీవీ సీరియల్ నిర్మాణ సమయంలో ప్రామాణిక గ్రంథాలుగా తీసుకున్న వాటిలో రంగనాథ రామాయణం తో పాటు మొల్ల రచించిన మొల్ల రామాయణం ఉండటం గర్వించదగ్గ విషయమన్నారు.
పాలమూరు బిడ్డలకు నాణ్యమైన విద్యను అందిస్తే వారు ఉన్నతంగా ఎదగడమే కాకుండా భావితరాలకు మార్గదర్శకులవుతారన్నారు. కులవృత్తుల వారికి ఉన్న నైపుణ్యాలు అమెరికా వంటి అగ్రదేశాల్లో పట్టాలు పొందిన వారికంటే ఏమాత్రం తక్కువ కాదన్నారు. సమాజం అభివృద్ధి చెందాలంటే పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు నైపుణ్య శిక్షణ అవసరమని భావించి, మహబూబ్‌నగర్ యువత కోసం ముఖ్యమంత్రితో మాట్లాడి ఏ టీ సీ సెంటర్ ఏర్పాటు చేయించామని, అలాగే మహిళలకు వివిధ రంగాల్లో నైపుణ్యాలు పెంపొందించేందుకు మహబూబ్‌నగర్ ఫస్ట్ స్కిల్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేశామని తెలిపారు. అదనంగా టాస్క్ సెంటర్ ద్వారా నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఎంబీసీ అంటే వెనుకబడిన తరగతులు కాదని, “మోస్ట్ పవర్‌ఫుల్ ఇన్ స్కిల్స్” అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో పిల్లలకు మంచి విద్య అందుబాటులో ఉందని, 5వ తరగతి నుంచే ప్రవేశాలు కల్పిస్తారని, అందుకు ఎలాంటి సిఫార్సులు అవసరం లేదని స్పష్టం చేశారు.అలాగే కవయిత్రి మొల్ల జయంతిని రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా నిర్వహించేందుకు తన వంతు కృషి చేస్తానని, వచ్చే జయంతి వరకు జీఓ తీసుకువస్తమన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి ఇప్పటికే వినతి చేసినట్లు తెలిపారు. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై మాట్లాడుతామన్నారు. మొల్ల జీవిత చరిత్రను భావితరాలకు అందించేందుకు పాఠ్యపుస్తకాలలో చేర్చాలని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ట్రైనింగ్ కు రిప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కుమ్మర సంఘం అధ్యక్షులు బుగ్గన, నియోజకవర్గం అధ్యక్షులు నాగన్న, నాయకులు శేఖరాచారి, ఆంజనేయులు, మాసయ్య, సారంగి లక్ష్మికాంత్, రామచంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.