దేశంలో సరిపడా పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిల్వలున్నాయి
ప్రజలెవరూ తొందరపడి నిల్వలు చేసుకోవద్దు
న్యూ ఢిల్లీ :
పశ్చిమాసియాలో జరుగుతోన్న యుద్ధం ప్రభావం ప్రస్తుతం దేశంలో ఏమాత్రం లేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఇంధన కొరత ఉందంటూ వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిల్వలు దేశంలో సరిపడా ఉన్నాయన్న ఆయన ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. శనివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంధన సరఫరా, ధరల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. . సరఫరా విషయంలో గతంలో రెండు, మూడు కంపెనీలకు కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఎదురైన మాట వాస్తవమేనన్న ఆయన ప్రస్తుతం ఆ సమస్య పూర్తిగా పరిష్కారమైందని వెల్లడించారు. ఇంధన సరఫరా వ్యవస్థ ఇప్పుడు గాడిలో పడిందన్నారు. ప్రజలు ఎవరూ తొందరపడి నిల్వలు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. దేశంలో మళ్ళీ లాక్‌డౌన్ విధిస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని కిషన్ రెడ్డి ఖండించారు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్ ప్రసక్తే లేదన్నారు. కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గ్యాస్ ఏజెన్సీలు, పెట్రోల్ బంకుల వద్ద అనవసరంగా క్యూ కట్టి ఆందోళన చెందవద్దని కోరారు. ఇతర దేశాల నుంచి రావాల్సిన ఇంధనాన్ని సకాలంలో వంద శాతం తెచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని మంత్రి తెలిపారు. అంతర్జాతీయంగా అనేక దేశాలు సుంకాలు పెంచుతున్నప్పటికీ, సామాన్యుడిపై భారం పడకూడదనే ఉద్దేశంతో కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వంతుగా వ్యాట్ తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని ఆయన సూచించారు.