- బీఆర్ఎస్ నేతలకు ఇన్సైడ్ సవాల్.
- ఘోష్ కమిషన్ నోటీసుల రూపంలో నయా ప్లాన్.
- కేసీఆర్‌కు నోటీసుల వెనక కుట్ర అంటూ నిరసనలు.
- లేఖ వివాదం, కొత్త కార్యాలయం ఏర్పాటు నేపథ్యంలో నిర్ణయం.
- బీఆర్ఎస్ కలిసి వస్తుందా లేదా అనేది తేల్చేందుకే..!
- అధిష్టానం ఆదేశాల కోసం పార్టీ నేతల వెయిటింగ్.
ముద్ర, తెలంగాణ బ్యూరో : మై డియర్ డ్యాడీ అంటూ కేసీఆర్‌ను పలు విధాలుగా ప్రశ్నించి పార్టీలో జరుగుతున్న పరిణామాలపై విమర్శనాస్త్రాలు ఎక్కు పెట్టిన కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత మాస్టర్ ప్లాన్‌తో రంగంలోకి దిగారు. తన టార్గెట్ కేటీఆర్ అని, కేసీఆర్ కాదని, అంతేకానీ, కేసీఆర్‌కు ఏదైనా అయితే తానే ముందుంటాననే రీతిలో గులాబీ నేతలకు సంకేతాలు ఇస్తున్నారు. అయితే, కేసీఆర్‌కు నోటీసులు అనే ఆయుధాన్ని ఇప్పుడు కవిత పట్టుకున్నారు. పార్టీ చీఫ్ కేసీఆర్‌కు నోటీసులు ఇస్తారా అంటూ అదే అంశంపై కవిత నిరసనకు దిగుతున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ ఎగువ, దిగువ స్థాయిలోని నేతలందరికీ కవిత ఓ కొత్త సవాల్ విసిరినట్లైంది. కేసీఆర్‌కోసం చేస్తున్న నిరసన కావడం, ఇది ఫెయిల్ అయితే మొత్తంగా కేసీఆర్, కేటీఆర్ మాత్రమే కాకుండా బీఆర్ఎస్ పార్టీకి కొంత అవమానం అనే రీతిలో గులాబీ శ్రేణులు భావించాల్సి వస్తుంది.అందుకే బీఆర్ఎస్ నేతలు పాల్గొనాలా లేదా అనే ప్రశ్నార్థకంలో ఉన్నారు. ఒకవేళ కవిత చేస్తున్న దీక్ష మనకెందుకు అని సైలెంట్‌గా ఉంటే ఈ ప్రభావం పార్టీపై పడనున్నట్లు కూడా అంచనా వేస్తున్నారు. గులాబీ నేతలు కలిసి రాకుంటే.. కవిత నిరసన అట్టర్ ప్లాప్ అయితే మాత్రం ఇటు కాంగ్రెస్, బీజేపీకి మళ్లీ అస్త్రాలు ఇచ్చినట్లే అవుతుంది. కమిషన్ విచారణ మరింత ముదిరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
- కూతురా.. మజాకా..!
కల్వకుంట్ల కవిత సొంత పార్టీ ప్రారంభించబోతున్నారన్న ప్రచారం మధ్య శనివారం బంజారాహిల్స్‌లో తెలంగాణ జాగృతి కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు. బంజారాహిల్స్ ఓ రాజకీయ పార్టీని నిర్వహించడానికి అవసరమైనంత పెద్ద భవనంలో తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.ఇక అక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహించనున్నారు.ఇప్పటికే తెలంగాణ జాగృతి శాఖల్ని ఏర్పాటు చేయడం ప్రారంభించారు. సింగరేణి పరిధిలోని పదకొండు డివిజన్లకు కార్యదర్శిలను నియమించారు. మరోవైపు, కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై కవిత నిరసనలకు పిలుపునిచ్చారు. ఐదో తేదీన కేసీఆర్ కమిషన్ ముందు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు.ఈ నోటీసులకు నిరసనగా నాలుగో తేదీన భారీగా నిరసనలు చేపట్టాలని కవిత నిర్ణయించారు.అయితే ఈ నిరసనలకు బీఆర్ఎస్ మద్దతు లేదు. కవిత కూడా బీఆర్ఎస్ తరపున పిలుపునివ్వలేదు. తెలంగాణ జాగృతి తరపునే నిరసనలకు పిలుపునిచ్చారు. అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేకుండానే నిరసనలు నిర్వహిస్తున్నారు. కానీ, ఈ నిరసనలకు అందరూ రావచ్చంటూ మాత్రం చెప్పుకొచ్చారు.
- అందరూ సైలెంట్.. కానీ కవితే..?
కాళేశ్వరం నోటీసులపై బీఆర్ఎస్ మొత్తం సైలెంట్‌గానే వ్యవహరిస్తున్నది. కేసీఆర్ నుంచి మొదలుకుని కిందిస్థాయి వరకు దీనిపై ఎక్కువగా మాట్లాడటం లేదు. అటు హరీశ్‌రావు, కేటీఆర్ కూడా ఏదో ఓ విమర్శ చేసి వదిలేశారు. హరీశ్‌రావు మాత్రం ఈ నెల 2న పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తున్నారు.కానీ, కమిషన్ నోటీసులపై విమర్శలు చేయడం లేదు.అయితే, ఇలాంటి పరిస్థితుల్లో కవిత మాత్రం కేసీఆర్‌కు నోటీసులు అనే పాయింట్‌ను పట్టుకుని నిరసనలకు దిగుతున్నారు.నిజానికి, నిరసనలు చేయాలంటే బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే రోజుకో నిరసన చేసే అవకాశం ఉంది.కానీ, అసలు ఆ ఛాన్సే ఇవ్వలేదు. ఇలాంటి సమయంలో కేసీఆర్, కేటీఆర్‌తో దాదాపు దూరంగా వ్యవహరిస్తున్న కవిత మాత్రం కేసీఆర్‌కు నోటీసులు అనే అంశంపైనే నిరసనకు దిగుతున్నది. ఆయన్ను కమిషన్ హాజరుకావాలని చెప్పిన ఒక్క రోజు ముందు ఇందిరాపార్క్ దగ్గర బైఠాయిస్తున్నారు.
- బీఆర్ఎస్ దూరం.
ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కవిత వేరు.. పార్టీ వేరు అన్నట్టే నడుస్తున్నది. ఇటీవల కవిత ఎక్కడికి వెళ్లినా బీఆర్ఎస్ నేతలు స్వాగతించడం లేదు. ఆమెతో సమావేశం అయ్యేందుకు రావడం లేదు. కవిత పూర్తిగా జాగృతి క్యాడర్, అనుచరులతోనే ప్రస్తుతానికి సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.కేసీఆర్ కు నోటీసులు ఇస్తే.. కేటీఆర్ ఓ ట్వీట్ వేసి ఊరుకున్నారని అదే కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు వస్తే మాత్రం ధర్నాలకు పిలుపునిచ్చారని కవిత రెండు రోజుల కిందట మీడియా చిట్ చాట్ లో విమర్శిచారు. ఇప్పుడు కేసీఆర్ కోసం ఆమె రంగంలోకి దిగారు. కేసీఆర్ నోటీసులు ఇవ్వడం దుర్మార్గమని ఆరోపిస్తున్నారు. ఇలాంటి సమయంలో కవిత నిరసనల వ్యవహారం బీఆర్ఎస్ లోనూ హాట్ టాపిక్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కేసీఆర్ కు వచ్చిన కాళేశ్వరం కమిషన్ నోటీసుల గురించి ఎవరూ పెద్దగా స్పందించలేదు. నిరసనల దాకా ఆలోచించలేదు. తండ్రి కేసీఆర్‌పై తనకు లెక్క లేనంత అభిమానం ఉందని కేటీఆర్ కే లేదని కవిత నిరూపించాలని అనుకుంటున్నారు.ఈ క్రమంలో ఈ నోటీసుల వ్యవహారాన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్నారని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. నాలుగో తేదీన ఆమె పిలుపు మేరకు ఎంత మంది నిరసనలు చేస్తారన్నదాన్ని బట్టి క్షేత్ర స్థాయిలో ఆమె బలం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చునని భావిస్తున్నారు. కేసీఆర్ కోసం చేస్తున్నప్పటికీ ఈ నిరసనల్లో బీఆర్ఎస్ క్యాడర్ పాల్గొనే అవకాశం లేదు. ఈ అంశం కూడా ఆమెకు కలసి వచ్చే అవకాశం ఉంది.నిజానికి, గతంలో బీఆర్‌ఎస్ పార్టీకి సమాంతరంగా జాగృతి నడిచింది. దానికి జాతీయ అధ్యక్షురాలిగా కవితనే ఉన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో జైలు నుంచి విడదలైన ఆమె మళ్లీ జాగృతికి మరింత దగ్గరయ్యారు. ఇటీవలే కొత్త జాగృతి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కేసీఆర్ కుటుంబంలో కేటీఆర్, కవిత మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే.ఇటీవల ఆమె కేసీఆర్‌కు పంపించిన లేఖ లీక్ కావడం సంచలనం రేపింది.తాజాగా ఆమె కొత్తగా తెలంగాణ జాగృతి ఆఫీస్‌ను ప్రారంభించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఓవైపు కేసీఆర్ తనకు దేవుడు లాంటివాడని అంటూనే మరోవైపు పరోక్షంగా కేటీఆర్‌ను కవిత టార్గెట్ చేయడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది.
- సొంత ఎజెండా లేదంటూనే..?
మరోవైపు, తనకు సొంత ఎజెండా అంటూ ఏమిలేదని, పార్టీని కాపాడుకోవాలనేదే తన తపన అని కవిత చెప్తున్నారు. బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేయొద్దనేది తన వాదన అని పేర్కొన్నారు.బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదని ఆమె అభిప్రాయపడ్డారు.శనివారం జూబ్లీహిల్స్‌లో జాగృతి కొత్త ఆఫీస్‌ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్‌కు బీఆర్ఎస్, జాగృతి రెండు కళ్ల లాంటివని అన్నారు. తెలంగాణ జాగృతి ప్రారంభించి 18ఏళ్లు అవుతుందని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ప్రతి ఉద్యమంలో జాగృతి భాగమైంది. ఉద్యమ సమయంలో జాగృతి ఎన్నో తెలంగాణ ప్రజల సమస్యలపై ప్రభుత్వంతో పోరాడిందని కవిత గుర్తుచేశారు.కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్ స్పూర్తితో తెలంగాణ జాగృతి పుట్టిందని ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కనీసం జై తెలంగాణ అని కూడా అనరని ఆమె విమర్శించారు.రాజీవ్ యువ వికాసం అని కాదు తెలంగాణ యువ వికాసం అనే పేరుతో పథకాలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించారు.తెలంగాణ జాతికి మేలు చేసినందుకే కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆమె నిలదీశారు. కాళేశ్వరం విచారణలో కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చిన విషయంలో ఆమె రాష్ట్ర ప్రభుత్వంపై మండి పడ్డారు.అది కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్ అని అన్నారు.కేసీఆర్‌పై ఈగ వాలినా చూస్తూ ఊరుకోమని కవిత హెచ్చరించారు.స్తానిక సంస్థల ఎన్నికల లోపే బీసీ రిజర్వేషన్ సాధించుకుంటామని ఆమె అన్నారు. పార్లమెంట్‌లో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టకుంటే రైల్ రోకో కార్యక్రమం చేపడతామని కల్వకుంట్ల కవిత చెప్పారు. అయితే చివరిగా జై తెలంగాణ, జై కేసీఆర్, జై జాగృతి అని నినాదాలతో ప్రసంగాన్ని ఆమె ముగించారు. అయితే, ప్రసంగం పూర్తయిన తర్వాత ప్రతిసారి పలికే జై బీఆర్ఎస్ అని మాత్రం అనలేదు.