Take a fresh look at your lifestyle.

హైదరాబాద్​ కు కృష్ణా, గోదావరి జలాలు

  • 15 టీఎంసీల తరలింపునకు కృషి.
  • తాగునీటి సమస్యకు త్వరలోనే పరిష్కారం.
  • అర్హులైన పేదలకు రెండు పడకల గదులు.
  • భూగర్భ జలాలను పెంచేందుకు ఇంకుడు గుంతలు ఏర్పాటు.
  • 300 గజాలు విస్తీర్ణం గల ఇంటిలో తప్పనిసరిగా ఇంకుడు గుంతలు  ఏర్పాటు చేసుకోవాలి.
  • సీజనల్ వ్యాధులపై విస్తృత ప్రచారం.
  • జిల్లాలోని 169 బస్తీ దావఖానాల్లో అందుబాటులో మందులు.
  • కొనసాగుతోన్న నూతన రేషన్ కార్డుల సర్వే.
  • రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.
ముద్ర, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ నగరవాసుల తాగునీటి సమస్య పరిష్కారం కోసం కృష్ణా గోదావరి నదుల నుంచి 15 టీఎంసీల నీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని హైదరాబాద్​ ఇన్​ ఛార్జీ, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.హైదరాబాద్ మహానగరంలో జన సాంద్రత పెరుగుతున్న నేపథ్యంలో జీహెచ్​ ఎంసీ పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి సంక్షేమ పథకాలు, నీటి నిల్వలు, ప్రజల అవసరాల మేరకు మౌలిక వసతులు కల్పించే కృతనిశ్చయంతో తమ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. శనివారం గ్రేటర్​ హైదరాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ (జీహెచ్​ ఎంసీ) కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాస్థాయి సమీక్షా సమావేశం జరిగింది.ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు.హైదరాబాద్ జిల్లా అభివృద్ధికి చేపట్టవలసిన చర్యలపై చర్చించారు.రాజీ యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు, సివిల్ సప్లై, వైద్య ఆరోగ్యం, ఎలక్ట్రిసిటీ, విద్య తదితర అంశాలపై చర్యలపై సమీక్షించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  వర్షాకాలం నేపథ్యంలో హైదరాబాద్ జిల్లాను వర్షపు నీటి ద్వారా భూగర్భ జలాలు పెంచే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. అందులో భాగంగా ప్రతి మూడొందల గజాల ఇంటి స్థలం ఉన్నవారు గుంతలు చేపట్టే విధంగా జిహెచ్ఎంసి అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.అదేవిధంగా వర్షాకాలం నేపథ్యంలో 150 ప్రత్యేక బృందాలను ఏర్పాటుతోపాటు నిరంతర పర్యవేక్షణ, పటిష్ట చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.జిల్లాలో 141 వాటర్ లాగిన్ పాయింట్స్ గుర్తించామని వాటిలో 76 వాటర్ లాగింగ్ పనులు పూర్తి చేశామన్నారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జిల్లాలోని 169 బస్తీ దవఖానాల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచినట్లు మంత్రి వివరించారు.బస్తీ దవఖానాలను ఇతర వ్యాధుల చికిత్స ల కోసం సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తెలిపారు.హైదరాబాద్ లో వర్షపు నీటి తొలగింపుకు శాశ్వత పరిష్కారం కల్పిస్తామన్ని మంత్రి చెప్పారు.వర్షాకాలంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని మంత్రి పిలుపునిచ్చారు. చెట్లు ప్రగతికి మెట్లు అని భావించి ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలని విజ్ఙప్తి చేశారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాస పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి కేటగిరీల వారీగా రుణాలు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ జిల్లాలో  41,726 మంది నిరుద్యోగ యువతకు రుణాలు అందించాలని లక్ష్యం కాగా 1,25, 595 మంది నిరుద్యోగ యువకులు దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రస్థాయిలో రాజీవ్ యువశక్తి పథకానికి రూ. 6230.52 కోట్లు కేటాయించిందని అన్నారు.సన్న బియ్యం పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి పొన్నం చెప్పారు. హైదరాబాద్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో మే నుంచి 653 రేషన్ షాపుల ద్వారా ప్రతి నెల 14,500 మెట్రిక్ టన్నుల బియ్యం అందిస్తున్నామని వివరించారు.వర్షాకాలం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో మూడు నెలలకు గాను 42,619 మెట్రిక్ టన్నుల సన్నబియాన్ని కేటాయించడం జరిగిందని అందులో నుంచి ఇప్పటివరకు 8440 మెట్రిక్ టన్నుల బియ్యన్ని రేషన్ షాపులకు అందించడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు.రేషన్ కార్డుల సర్వే ప్రక్రియ చేపట్టామని  త్వరలో అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన రేషన్ కార్డులో అందించడం జరుగుతుందని తెలిపారు.
అర్హులైన నిరుపేదలందరికీ ప్రతి నియోజకవర్గానికి 3500 రెండు పడక గదుల ఇండ్లను మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.హైదరాబాద్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్ల చొప్పున అందించనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ స్థలాలు తక్కువగా ఉన్నందున ఇల్లు కట్టించేందుకు కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ ప్రత్యేక ప్రణాళికతో అర్హులైన పేదలకు ఇండ్ల నిర్మాణాలు చేపట్టి పంపిణీ చేస్తామన్నారు. ఇప్పటికే కట్టిన  62,500 పైగా ఉన్న రెండు పడకల గదుల ఇండ్లను ప్రభుత్వంతో చర్చించి ఈనెల 15 వరకు అందజేస్తామన్నారు. స్థలాలు ఉన్న పేదలకు అత్యంత ప్రాధాన్యతతో రెండు పడకల గదుల ఇళ్లను నిర్మించి ఇవ్వటం జరుగుతుందని అన్నారు. సమావేశంలో భాగంగా పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు శాసనమండలి సభ్యులు లేవనెత్తిన అనేక అంశాలపై అంశాల వారీగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలన్నింటినీ త్వరలో పరిష్కరిస్తానని మంత్రి భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, జీహెచ్​ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్ వి కర్ణన్, హెచ్ఎండిఏ కమిషనర్ అశోక్ రెడ్డి,హైడ్రా కమిషనర్   రంగనాథ్, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.