- ఏడాదిన్నర అయినా సమస్యలు పరిష్కారం కాలేదు.
- 50 వేల కోట్లతో మిషన్ భగీరథ పనులు చేసినా ఇప్పటికీ నల్లానీరు ఇవ్వడం లేదు.
- రెండు నెలల్లో మంచినీరు ఇవ్వకుంటే జలమండలిని ముట్టడించి ఆందోళన ఉధృతం.
- భూగర్భ డ్రైనేజీ పనులు ఆగిపోయాయి.
- బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం దోస్తీ.. ఇటు ప్రజలు సమస్యలతో కుస్తీ.
- బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్.
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజకీయాలు తప్పితే ప్రజా సమస్యలు పట్టడం లేదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి ఏడాదిన్నర కాలం గడిచినప్పటికీ ఎక్కడా సమస్యలు పరిష్కారం కాలేదని ఆయన ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయ సమావేశాలకు హాజరయ్యేందుకు తీరిక ఉంది కానీ ప్రజా సమస్యలపై సమీక్ష చేయడానికి తీరిక లేదని ఆయన దుయ్యబట్టారు. వర్షాకాలం వచ్చినప్పటికీ భూగర్భ డ్రైనేజీ పనులు ఇంకా పూర్తికాలేదని, అలాగే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకు తాగునీటి సరఫరా చేయడం లేదని ఆయన మండిపడ్డారు.ఈ మేరకు శనివారం బీజేపీ కార్పోరేటర్లు, ప్రజలతో కలిసి జలమండలి కార్యాలయం ముట్టడి కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ”బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం దోస్తీ సమస్యలతో ప్రజల కుస్తీ” అంటూ ప్లకార్డులను ప్రదర్శించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదించారు.అనంతరం జలమండలి ఎండీతో ఈటల రాజేందర్, కార్పోరేటర్లు సమావేశమై, సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్ళారు.ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ అనేక శాఖలను ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకున్నారని, ఈ క్రమంలో వాటిపై సమీక్ష చేయడానికి ఆయనకు తీరిక లేకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్రంలో మూడో వంతు జనాభా ఉన్న హైదరాబాద్ సమస్యల మీద సమీక్షలు జరగడం లేదని, కనీసం నిధులు కేటాయింపు లేకపోవడం అత్యంత బాధాకరమన్నారు. హైదరాబాద్ పరిస్థితి పైన పటారం లోన లోటారంలా ఉందన్నారు.హైదరాబాద్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమని, దానికి అనుగుణంగా మురుగునీటి వ్యవస్థ కానీ, మంచినీరు సరఫరా జరగడం లేదన్నారు.వర్షాకాలం వచ్చినప్పటికీ నాలాలు, డ్రైనేజీల పూడికతీత పనులు పూర్తి కాలేదన్నారు. జలమండలి పక్కన ఉన్న నాలా కూడా డంపింగ్ యార్డులా మారిందన్నారు. జలమండలిలో ఐదు పైసలు బిల్లు కూడా లేదని, కొత్తగా నల్ల కనెక్షన్లు ఇవ్వలేకపోతున్నారని ఆయన విమర్శించారు. అలాగని ఇచ్చిన నల్ల కలెక్షన్లకు మంచినీరు సరఫరా చేయలేకపోతున్నారని అన్నారు.మిషన్ భగీరథ కోసం 50 వేల కోట్లరూపాయలు ఖర్చు చేసిన తర్వాత కూడా నగరవాసులు మంచినీళ్ళ కోసం ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. నాలుగైదు రోజులకోసారి నీళ్ళు వస్తున్నాయని, కొత్త కాలనీలు, అపార్టుమెంట్లకు కనెక్షన్లు ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు.విశ్వ నగరాన్ని కంపు నగరంగా మారుస్తున్నారని, రోడ్లమీద గుంతలు పూడ్చటానికి కూడా డబ్బులు లేవన్నారు. ఒక్కో నియోజకవర్గానికి 3500 ఇల్లు ఇస్తామని ప్రభుత్వం చెబుతుందని, ఏ నియోజకవర్గం వారికి ఆ నియోజకవర్గంలోనే ఇల్లు ఇవ్వాలని ఎంపీ ఈటల డిమాండ్ చేశారు. ముందుగా సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే వారికి మంజూరు చేయాలన్నారు. దూరంగా ఇవ్వటం వల్ల లబ్ధిదారులు ఉపాధి కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరమంతటికి బాలాజీ నగర్ డంప్ యార్డు ఒకటి మాత్రమే ఉందని, అక్కడ ఉన్న ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నగరానికి నలుమూలల డంప్ యార్డులు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.నగరాన్ని అందంగా తీర్చిదిద్దడంలో తప్పు లేదని, అయితే వందలాది కోట్లు ఖర్చు పెట్టి ఫ్లైఓవర్ల పిల్లర్ల మీద పెయింటింగ్స్ వేయడం కంటే రోడ్లపై గుంతలు పూడ్చాలని ఎంపీ ఈటల డిమాండ్ చేశారు.సుందరీకరణ పేరుతో చిరు వ్యాపారుల వ్యాపారాలు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.చేయాల్సిన పనులు సరిగా చేయకుండా హైడ్రాను తీసుకొచ్చి ఇంకా వేదనకు గురి చేస్తున్నారని అన్నారు.రియల్ ఎస్టేట్ ట్యాక్స్ మాత్రమే కాదని, ఉపాధిని కూడా అందిస్తుందని తెలిపారు.రియల్ ఎస్టేట్ రంగాన్ని దెబ్బతీయడం వలన అనేక మంది ఉపాధి కోల్పోయారని ఈటల తెలిపారు.నెంబర్ ఒన్‌గా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీసేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారని ఆయన దుయ్యబట్టారు.రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దయనీయంగా మారిందని, హామీల అమల్లో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు.
