Take a fresh look at your lifestyle.

సంస్థ ప్రగతిలో ఉద్యోగ సంఘాలు భాగస్వామ్యులు కావాలి

  • సింగరేణి ఎస్సీ, ఎస్టీ, బీసీ లైసెన్ ఆఫీసర్లు, ఉద్యోగ సంఘాలతో సీఎండీ బలరామ్.

ముద్ర, తెలంగాణ బ్యూరో : మారుతున్న మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా సింగరేణి సంస్థ బహుముఖ వ్యాపార విస్తరణ దిశగా కార్యాచరణ రూపొందించుకొని అమలు చేస్తోందని సింగరేణి సీఎండీ ఎన్. బలరామ్ స్పష్టం చేశారు.ఇలాంటి పరిస్థితుల్లో ఉత్పత్తి, ఉత్పాదకత, నాణ్యత పెంపుదలకు, గైర్హాజరు తగ్గింపునకు ఉద్యోగ సంఘాలు సహకరించి సంస్థ ప్రగతిలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని ఆయన కోరారు. శనివారం సాయంత్రం కొత్తగూడెం కార్పోరేట్ కార్యాలయం నుంచి ఆయన తొలిసారిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ చీఫ్ లైసెన్ ఆఫీసర్లు, ఏరియాలోని లైసెన్ ఆఫీసర్లు, ఉద్యోగ సంఘాల నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కంపెనీ ప్రస్తుత ఆర్థిక స్థితిగతులు, భవిష్యత్తు ప్రణాళికలు, బొగ్గు మార్కెట్లో సింగరేణి ఎదుర్కొంటున్న సవాళ్లు తదితర అంశాలను వివరించారు, సింగరేణి సంస్థ ముందుకు వెళ్లాలంటే కార్మిక సంఘాలు కూడా యాజమాన్యానికి పూర్తి సహకారం అందించాలన్నారు ముఖ్యంగా ఉత్పాదకత బాగా పెరగాల్సి ఉందని, ప్రతీ ఉద్యోగి ఎనిమిది గంటల షిఫ్ట్ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేస్తూ యంత్రాలను కూడా గరిష్టంగా వినియోగించాల్సి ఉందన్నారు. దేశంలోని ఇతర బొగ్గు సంస్థలతో పోల్చుకుంటే సింగరేణి బొగ్గు ధర ఎక్కువ ఉండటం వల్ల వినియోగదారులు క్రమంగా దూరం అవుతున్నారని కాబట్టి ఉత్పాదకత పెంపుదల ప్రతీ ఒక్కరి బాధ్యత అన్నారు. బొగ్గు నాణ్యతా ప్రమాణాలు  పెంచాలని, రక్షణతో పని చేయాలని,  ఇందుకు కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు తమ పరిధిలోని సభ్యులను చైతన్య పరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా అన్ని ఏరియాల నుంచి పాల్గొన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ లైసన్ అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. కంపెనీ చేపట్టబోయే విస్తరణ ప్రణాళికలు విజయవంతం కావడానికి పూర్తి సహకారం అందిస్తామన్నారు. కంపెనీ ప్రగతికి దోహదపడే పలు కీలక సూచనలను చేశారు. ఉత్పత్తి, ఉత్పాదకత పెరిగేలా కార్మికులను చైతన్య పరుస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వారిని భాగస్వాములను చేయడంపై, కంపెనీ అభివృద్ధిపై వారి సూచనలను తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ ఉద్యోగుల చీఫ్ లైసెన్ ఆఫీసర్, జీఎం మణుగూరు దుర్గం రాంచందర్, ఎస్టీ ఉద్యోగుల చీఫ్ లైసెన్ ఆఫీసర్, జీఎం ఇల్లందు వీసం కృష్ణయ్య, బీసీ ఉద్యోగుల చీఫ్ లైసెన్ ఆఫీసర్, ఐటీ (హెచ్ఓడీ) హరి శంకర్, సంస్థ డైరెక్టర్లు డి సత్యనారాయణ రావు, ఎల్వీ సూర్యనారాయణ, కె వెంకటేశ్వర్లు, ఈడీ  సుభాని, జీఎం (సీపీపీ) మనోహర్, జీఎం మార్కెటింగ్ ఎన్.వి రాజశేఖర్ రావు, కార్పోరేట్ జనరల్ మేనేజర్లు, అన్ని ఏరియాల జీఎంలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.