Take a fresh look at your lifestyle.

ప్రపంచం దృష్టికి తెలంగాణ అభివృద్ధి

  • భారత్ సమ్మిట్ తో కాంగ్రెస్​ దిశ నిర్దేశం.
  • సమ్మిట్ వేదికగా రాష్ట్రానికి పెట్టుబడులు ఆహ్వానించాం.
  • ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశమంతా ఏకమవ్వాలి.
  • మీడియాతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

ముద్ర, తెలంగాణ బ్యూరో : భారత్ సమ్మిట్ తో తెలంగాణ.. ప్రపంచం దృష్టిని ఆకర్శిస్తోందని డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.ఇదే వేదిక ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రపంచానికి దిశా నిర్దేశం చేస్తోందని చెప్పారు.శుక్రవారం హైదరాబాద్ హెచ్ఐసీసీ నోవాటెల్ లో జరిగిన భారత్ సమ్మిట్ కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమం చారిత్రాత్మకమైన సమ్మిట్ గా నిలిచిపోతుందని అభివర్ణించారు.కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాల ఆధారంగా భారత్ సమ్మిట్ జరుగుతోందని చెప్పారు.ఇందులో శాంతి కాముకులు, ప్రపంచ న్యాయం కోరుకునేవారు( గ్లోబల్ జస్టిస్) ప్రోగ్రెసివ్ ఆలోచనలు ఉన్న వారందరూ ఎనిమిది ప్యానెల్స్ గా చర్చల్లో పాల్గొన్నారని తెలిపారు. వంద దేశాల నుంచి హాజరైన ప్రతినిధులు లింగ న్యాయం, ఫెమినిస్ట్ ఫ్యూచర్, ఫ్యాక్ట్ వర్సెస్ ఫిక్షన్, కౌంటరింగ్ డిస్ ఇన్ఫర్మేషన్, యూత్ అండ్ పాలిటిక్స్ ఆఫ్ టుమారో, షేవింగ్ న్యూ మల్టీ ల్యాటరీజం అంశాలపై లోతుగా చర్చించారని చెప్పారు.తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమం గురించి భారత్ సమ్మిట్ ద్వారా ప్రపంచానికి చాటి చెప్పామన్నారు. సామాజిక న్యాయం, అభివృద్ధిని మేళవించి కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలను ఏ విధంగా ముందుకు తీసుకుపోతున్నామో ప్రపంచ ప్రతినిధులకు వివరించామని వెల్లడించారు. క్లీన్ అండ్ గ్రీన్ న్యూ ఎనర్జీ పాలసీ ద్వారా 2035 నాటికి 40 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, రీజినల్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్డు మధ్య ఏర్పాటు చేస్తున్న క్లస్టర్స్, ఫ్యూచర్ సిటీ, మూసి పునర్జీవం, నాలెడ్జ్ ఐటీ సెంటర్, ఇందిరా గిరి జల వికాసం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు, రాజీవ్ యువ వికాసం తదితర పథకాల గురించి భారత్ సమ్మిట్ హాజరైన ప్రతినిధులకు వివరించామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి అమలు చేస్తున్న సంక్షేమంపై ప్రతినిధులు సంతోషాన్ని వ్యక్తం చేశారని వెల్లడించారు. దేశానికే మోడల్ గా నిలవబోతున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ప్రతినిధులను కోరినట్లు వెల్లడించారు. లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీసుకున్న గ్లోబల్ జస్టిస్ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని ఈ సమ్మిట్ కు హాజరైన ప్రతినిధులు స్వాగతించి, అభినందించారని వెల్లడించారు.ప్రపంచంలో కోల్డ్ వార్ జరుగుతున్న సమయంలో ప్రపంచం మొత్తం రెండు కూటములుగా విడిపోయిన సమయంలో కొన్ని దేశాలతో కలిసి ఆనాటి ప్రధాని పండిట్ లాల్ నెహ్రూ అలీన విధానాన్ని తీసుకొని ప్రపంచానికి దిశా నిర్దేశం చూపారని చెప్పారు.సుదీర్ఘకాలం తర్వాత ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆర్థిక రాజకీయ సామాజిక అసమానతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అహింస, సత్యం, సామాజిక న్యాయం అనే మూడు ప్రాథమిక మూల సిద్ధాంతాలతో మరోసారి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ భారత్ సమ్మిట్ ద్వారా దిశా నిర్దేశం చేస్తున్నదని చెప్పారు.

  • ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏకమవుదాం..!

దేశాన్ని విచ్ఛిన్నం చేస్తోన్న ఉగ్రవాద సమస్యకు వ్యతిరేకంగా అందరూ ఏకతాటిపైకి వచ్చి ఏకమవుదామని సమ్మిట్​ లో పాల్గొన్న వక్తలు నిర్ణయం తీసుకున్నారు. శాంతి, అహింసా మార్గంలో గ్లోబల్ జస్టిస్ కోసం కాంగ్రెస్ తో కలిసి రావాలని కోరారు. జమ్మూ కాశ్మీర్ పెహల్గామ్ లో ఉగ్రవాదులు జరిపిన కాల్పులకు నిరసనగా, బాధితులకు సంఘీభావంగా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించాలని ఏఐసీసీ ఇచ్చిన పిలుపుమేరకు హైదరాబాదులో పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నిర్వహించే కొవ్వొత్తుల ర్యాలీలో స్వచ్ఛందంగా పాల్గొంటామని భారత్ సమ్మిట్ కు హాజరైన ప్రతినిధులు తెలిపారని భట్టి ఈ సందర్భంగా చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.