బాసర ట్రిపుల్ ఐటీ లో ఏం జరుగుతోంది? హఠాత్తుగా సెలవుల వెనుక ఆంతర్యమేమిటి? సమస్యలను దాటవేయటమే వ్యూహమా?
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులు, విద్యార్థుల నిరసనలు, సిబ్బంది ఆందోళనలు, వెరసి సెలవులు ఇచ్చేలా పురికొల్పాయన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. గత నెల రోజులుగా బాసర ట్రిపుల్ ఐటీ లో అంతర్గతంగా అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయన్న విషయం గతంలోనే “ముద్ర” వెలికి తీసింది. ఈ క్రమంలో నేటినుంచి సెలవులు ప్రకటించటం ఊహించని పరిణామంగా పేర్కొంటున్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం తగిన చర్యలు చేపట్టడం లేదన్నది గత కొన్నేళ్లుగా వెలుగు చూస్తున్న వాస్తవం. ఈ పరిస్థితుల్లో తరచూ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడం, తమ సమస్యల సాధన కోసం నిరసనలు వ్యక్తం చేయడం పరిపాటిగా మారింది. దీనికి తోడు ఇటీవల కాలంలో సిబ్బంది కూడా తమ సమస్యల సాధనకు ఆందోళనలు చేపడుతూ వచ్చారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని గత కొద్ది రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తున్న తరుణంలో యాజమాన్యం వారితో చర్చలు కొనసాగించింది. ఈ చర్చల్లో సమస్యల పరిష్కారానికి వారం రోజుల గడువు కోరినట్లు విద్యార్థులు పేర్కొంటున్నారు. ఇదే తరుణంలో విద్యార్థిని ఒకరు అనారోగ్యంతో మృతి చెందడంతో నిరసనలు ఊపందుకున్నాయి. ఒకపక్క సమస్యల పరిష్కారానికి గడువు సమీపించడం, మరో పక్క విద్యార్థిని మృతికి నిరసనగా ఉద్యమం చేపట్టడంతో యాజమాన్యానికి తల నెప్పి వ్యవహారంగా మారింది. ఈ క్రమంలో సమస్య తీవ్రతను తగ్గించేందుకు సెలవుల ప్రకటనే ఏకైక మార్గంగా భావించినట్లు తెలుస్తోంది. ఐతే ఈ సెలవుల ప్రకటన వల్ల విద్యార్థుల చదువుల పరిస్థితి ఏమవుతుందోనని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో వచ్చే విద్యా సంవత్సరం అడ్మిషన్లకు సంబంధించి ప్రకటన వెలువడింది. ఐతే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో అడ్మిషన్లపై ప్రభావం చూపే ప్రమాదం కూడా లేకపోలేదు.