బీడీ కార్మికులకు చేయూత పథకం అమలు చేయాలి -తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజన్న
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా జీవన భృతి అమలు చేయాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె రాజన్న డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజన్న మాట్లాడుతూ వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధిని కల్పిస్తున్న బీడీ పరిశ్రమ రోజురోజుకు దిగజారుతోందని అన్నారు. బీడీ పరిశ్రమలో నెలకు 8 నుంచి 10 రోజులకు మించి పని దొరకడం లేదన్నారు. ప్రభుత్వం ఎన్నికల హామీలో ప్రకటించిన ప్రకారం చేయూత పథకం ద్వారా రూ.4 వేల రూపాయలు జీవనభృతి అమలు చేసి కార్మికులను ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎం బక్కన్న, ఆర్ రామలక్ష్మణ్, గంగన్న, లక్ష్మి, ఎస్ లక్ష్మి, ఫెరోజ్, గంగాధర్, గంగామణి, నారాయణ, సుశీల, గోదావరి, తదితరులు పాల్గొన్నారు.