ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిరాశ్రయులైన పలువురికి నిర్మల్ పోలీసులు బాసటగా నిలిచారు. వారికి ఆశ్రయం కల్పించారు. వివరాలు ఇలా ఉన్నాయి. గత కొద్ది రోజులుగా తీవ్రమైన ఎండల కారణంగా పట్టణంలోని రోడ్లపై, బస్టాండ్లలో ఆశ్రయం పొందుతున్న పలువురు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండ వేడిని తట్టుకోలేక పలు ప్రాంతాల్లో పలువురు మృతి చెందిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్పీ జి.జానకి షర్మిల ఆదేశాల మేరకు కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిరాశ్రయులను గుర్తించి వారికి అవసరమైన సహాయం అందించారు. డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్మల్ టౌన్ పోలీసులు కొంతమంది నిరాశ్రయులను వృద్ధాశ్రమాలకు తరలించి సంరక్షణ చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఇన్‌స్పెక్టర్ సమ్మయ్య, ఎస్‌ఐ జ్యోతిమణి,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.