సవతి తల్లే హంతకురాలు.. సుపారీ ఇచ్చి హత్య
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ఇటీవల వై ఎస్సార్ కాలనీ సమీపంలో యువకుడు హత్యకు గురైన కేసులో సవతి తల్లి సుపారీ ఇచ్చి హత్య చేయించిందని పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు ఎస్పీ జానకి షర్మిల, డి ఎస్పీ శ్రీనివాస్ లు వివరాలు వెల్లడించారు. మృతుడు అస్లాం ఖాన్ కు సవతి తల్లి అన్వరీ బేగం తో కొంత కాలంగా వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో తను వేరే మహిళను పెళ్లిచేసుకుంటానని మృతుడు సవతి తల్లికి చెప్పడంతో ఆమె తమ బంధాన్ని తెంచుకునేందుకు అంగీకరించలేదు. దీంతో మృతుడు తన బాబాయి ఇంటికి మకాం మార్చాడు. నిందితురాలు మహారాష్ట్ర కు చెందిన వారికి సుపారీ ఇచ్చి హత్య చేయించేందుకు రంగం సిద్ధం చేసుకుంది.నిందితులు ముఖీద్, అఫ్రోజ్, షేక్ షాహిద్ @ సల్మాన్, సాయినాథ్ పవార్ ఈ నెల 15 న మృతుడు నడుపుతున్న ఆటోను అడ్డగించి కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. అనంతరం పోలీసులు బృందాలుగా దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను అరెస్టు చేసి నేరానికి ఉపయోగించిన స్కార్పియో,మోటార్ సైకిల్, రెండు కత్తులు, ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసును చాకచక్యంగా ఛేదించిన నిర్మల్ ఎస్‌డీపీఓ పి. శ్రీనివాస్, ప్రత్యేక బృందాల అధికారులు ఎం. కృష్ణ, జి. లింబాద్రి, ఎస్. శ్రీకాంత్, గోపీ,గణేష్, సాయి కృష్ణ లను ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ అభినందించారు. సహకరించిన భైంసా ఏఎస్పీ సాయి కిరణ్, తదితర సిబ్బందిని కూడా అభినందించారు.