Take a fresh look at your lifestyle.

‘స్ధానిక’ ఎన్నికలపై జాప్యమెందుకు

  • రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు.
  • గత ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామన్న సర్కార్​.
  • ఎన్నికల నిర్వహణపై దాఖలైన పిటీషన్లపై విచారణ.
  • నెల రోజులు గడువు కోరిన ప్రభుత్వం.
  • 60 రోజులు కావాలన్న ఎన్నికల కమిషన్​.
  • ఆగస్టు తర్వాతే ‘స్ధానిక’ పోరు.

ముద్ర, తెలంగాణ బ్యూరో :  రాష్ట్రంలో స్ధానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో జరుగుతోన్న జాప్యంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్ని రోజుల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు  నిర్వహిస్తారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గత ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామన్న రాష్ట్ర సర్కార్​.. ఎన్నికలు ఎందుకు నిర్వహించకపొయిందో చెప్పాలని నిలదీసింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నల్గొండ జిల్లా మాజీ సర్పంచ్ లతో పాటు దాఖలైన మొత్తం ఆరు పిటిషన్లపై సోమవారం రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. గతేడాది ఫిబ్రవరి 1వ తేదీతో రాష్ట్రంలో సర్పంచ్ ల పదవీ కాలం పూర్తయింది. అదే ఏడాది జులై 5న ఎంపీటీసీ సభ్యుల పదవీ కాలం ముగిసింది.నిబంధనల ప్రకారం ఆరు నెలలలోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. దీంతో ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వ జాప్యాన్ని సవాల్ చేస్తూ గతంలో హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ఇది వరకు వాదనలు జరిగాయి. ఈ అంశం సోమవారం మరోసారి విచారణకు వచ్చింది. దీంతో స్థానిక సంస్థల నిర్వహణ విషయంలో పిటిషనర్లు, రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

  • ఆరు పిటిషన్లు.

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించడం లేదంటూ ఆరు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటి విచారణలో భాగంగానే హైకోర్టు.. ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు నోటీసులు జారీచేసింది. ఈ ఏడాది జనవరి 30న జరిగిన విచారణలో హైకోర్టు బెంచ్ పంచాయతీ రాజ్ శాఖను మూడు వారాల్లో సమాధానం దాఖలు చేయాలని ఆదేశించింది. కొంత జాప్యం తర్వాత ఇప్పుడు మళ్లీ విచారణకు వచ్చింది. గత విచారణలో ప్రభుత్వం ఫిబ్రవరి లోపు ఎన్నికుల నిర్వహిస్తామని చెప్పింది. కానీ ఫిబ్రవరి ముగిసిపోయి మరో నాలుగు నెలలు గడిచిపోయినా ఎన్నికలు నిరవహించలేదు. ఇప్పుడు మరో అరవై రోజుల సమయం కావాలని ఎన్నికల కమిషన్ హైకోర్టుకు తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఇది గ్రామీణ ప్రాంతాలలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను దెబ్బతీ స్తోందని పిటిషనర్ విచారణలో వాదించారు. స్థానిక సంస్థల ఎన్నికలు సంవత్సరాలుగా నిర్వహించకపోవడం వల్ల సంబంధిత గ్రామాలకు సంక్షేమ కార్యకలాపాలు అందకుండా పోయాయని పిల్ లో వాదించారు.

  • 60 రోజుల గడువివ్వండి: ఈసీ

విచారణ సందర్భంగా ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం 30 రోజులు, ఎన్నికల సంఘం 60 రోజుల పాటు గడువు కావాలని హైకోర్టును కోరాయి. రిజర్వేషన్లు, వార్డు డివిజన్ ప్రక్రియ పూర్తి కావడానికి ప్రభుత్వం గడువు కోరగా ప్రభుత్వం వైపు నుంచి క్లియరెన్స్ వస్తే ఎన్నికలు నిర్వహించేందుకు తమకు రెండు నెలల పాటు సమయం కావాలని ఎన్నికల సంఘం కోర్టుకు తెలిపింది. అయితే గత ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదని పిటిషనర్ తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఎన్నికల నిర్వహణ విషయంలో గత విచారణలోనే చెప్పినట్లుగా ప్రభుత్వం ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

  • ఆగస్టు తర్వాతే ‘స్ధానిక’ పోరు

స్ధానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సమాయత్తం అవుతోన్నా.. తాజా పరిణామాల నేపథ్యంలో ఆగస్టు తర్వాతే ఎన్నికలు జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇప్పటికే పంచాయతీరాజ్ అధికారులు, ఎన్నికల నిర్వహణకు సంబంధించి కసరత్తు పూర్తి చేస్తున్నాయి. అయితే కులగణన, బీసీల రిజర్వేషన్ అంశం సైతం కోర్టు పరిధిలో ఉంది. ఈ నేపథ్యంలో రిజర్వ్ చేసిన తీర్పులో ఏముంది? ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు జారీ కానున్నాయనేది ఆసక్తిగా మారింది. ప్రభుత్వం, ఈసీ వాదనలను కోర్టు పరిగణలోకి తీసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఆగస్టు తర్వాతే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Leave A Reply

Your email address will not be published.