Take a fresh look at your lifestyle.

‘బనకచర్ల’పై న్యాయ పోరాటమే సరి..!

  • గోదావరి నీటి వాటాలో ఒక్క చుక్కను కూడా వదులుకోము.
  • బీఆర్​ఎస్​ హయాంలోనే బనకచర్లకు పునాది.
  • త్వరలోనే సీఎల్పీ భేటీ.. బనకచర్ల పై ప్రజెంటేషన్.
  • ఏపీతో చర్చించాలని నిర్ణయం.
  • నవంబర్ లోపు అన్ని కలెక్టరేట్ లలో తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటు.
  • క్రీడా పాలసీకి క్యాబినెట్ ఆమోదం.
  • రీజనల్‌ రింగ్‌ రోడ్డు సదరన్‌ పార్ట్‌ అలైన్‌మెంట్‌కు మంత్రివర్గం గ్రీన్​ సిగ్నల్​.
  • ఈ నెల 30లోపు కాళేశ్వరం కమిషన్‌కు గత బీఆర్ఎస్ ప్రభుత్వ మంత్రివర్గ మినిట్స్‌ నివేదిక.
  • చౌటుప్పల్ టు సంగారెడ్డి వరకు 201 కి.మీ ఆర్​ఆర్​ఆర్​ కు ఆమోదం.
  • 9 రోజుల్లో రూ. 9 కోట్ల రైతు భరోసా ఇచ్చాం.
  • నేడు రాష్ట్ర సచివాలయం ముందు 2వేల మందితో రైతు నేస్తం సభ.
  • రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాలు వెల్లడించిన మంత్రులు పొంగులేటి, పొన్నం.

ముద్ర, తెలంగాణ బ్యూరో : గోదావరి నదిపై ఏపీ అక్రమంగా నిర్మింతలపెట్టిన గోదావరి–బనకచర్ల (జీబీ) లింక్​ ప్రాజెక్ట్ పై న్యాయపోరాటం చేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకున్నది.గోదావరి నీటి వాటాలో ఒక్క చుక్కను కూడా వదులుకోబోమని స్పష్టం చేసింది.ఈ విషయంలో కృతనిశ్చయంతో ఉన్నట్లు తేల్చి చెప్పింది. వచ్చే నెల మొదటి వారంలో సీఎల్పీ భేటీ నిర్వహించి.. బనకచర్లను అడ్డుకునేందుకు కేంద్రానికి ఏ విధంగా ఫిర్యాదు చేసామో ప్రజెంటేషన్​ ఇవ్వాలని నిర్ణయించింది. రెండు రాష్ట్రాలకు చెందిన సమస్యలను విభజన చట్టంలో ఉన్న అంశాలను హైలెవెల్ కమిటీ ముందు చర్చించాలని భావిస్తోంది. పోమవారం హైదరాబాద్ లో ని కమాండ్​ కంట్రోల్​ రూం లో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కేబినెట్​ కీలక నిర్ణయాలు తీసుకున్నది.సుమారు నాలుగు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో మంత్రివర్గం కీలక అంశాలపై చర్చించి.. ఆమోదం తెలిపింది.క్యాబినెట్ భేటీ అనంతరం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాబినెట్ సుదీర్ఘంగా జరిగిందన్నారు. బనకచర్లపై తెలంగాణ వాటాలో ఉన్న ఒక్క చుక్కను కూడా వదులుకోమని ఎంతవరకైనా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.బనకచర్లకు గత ప్రభుత్వంలో పునాది వేశారని,వారి తప్పును కప్పి పుచ్చుకునేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి పొంగులేటి మండిపడ్డారు.జూలై మొదటి వారంలో బనకచర్లపై ప్రజాప్రతినిధులతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుందన్నారు.ప్రాజెక్ట్ ను అడ్డుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరిస్తామన్నారు. బనకచర్లపై హైలెవల్ అధికారుల కమిటీ చర్చ చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.ప్రతిపక్ష బీఆర్ఎస్ బనకచర్ల బంకను తమ ప్రభుత్వానికి రుద్దాలని చూస్తోందని ఆరోపించారు. ఈ విషయంపై ప్రజల్లో అసత్య ప్రచారానికి తెరలేపిందని బీఆర్ఎస్ పై మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విచారణ కమిషన్​ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన సమాచారాన్ని ఈ నెల 30లోగా పీసీ ఘోష్​ కమిషన్​ కు అందజేస్తామని మంత్రి తెలిపారు. నాటి కేబినెట్ తో పాటు, సబ్ కమిటీకి సంబంధించిన పూర్తి వివరాలను కమిషన్ కు ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని పొంగులేటి చెప్పారు. అలాగే క్రీడా పాలసీని కేబినెట్‌ ఆమోదించినట్లు మంత్రి వివరించారు. 2047 రైజింగ్ తెలంగాణ విజన్ కు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసిందన్నారు. సంగారెడ్డి జిల్లాలో 2 కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రతి నెలకు రెండు సార్లు క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు. వీటితో పాటు రీజనల్‌ రింగ్‌ రోడ్డు సదరన్‌ పార్ట్‌ అలైన్‌మెంట్‌కి కేబినెట్‌ ఆమోదం తెలిపినట్లు మంత్రి చెప్పారు. చౌటుప్పల్ టు సంగారెడ్డి వరకు 201 కి.మీ ఆర్​ఆర్​ఆర్​ ను ఆమోదించామన్నారు. తమ ప్రభుత్వం రైతుపక్షపాతి అన్న మంత్రి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈనెల 16న సీఎం చేతుల మీదుగా ప్రారంభించిన రైతు భరోసా పెట్టుబడి సాయం పంపిణీని విజయవంతంగా పూర్తి చేశామని మంత్రి వివరించారు. కేవలం తొమ్మిది రోజుల్లోనే రూ. 9 వేల కోట్ల రైతు భరోసా చెల్లించామని చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయం దండగ కాదు పండగ అని మరోసారి నిరూపించామని పొంగులేటి వివరించారు. రాష్ట్ర రైతుల పక్షాన సీఎం,డిప్యూటీ సీఎంకు రాష్ట్ర మంత్రివర్గం శుభాకాంక్షలు తెలిపిందన్నారు.ఇందులో భాగంగా నేడు రాష్ట్ర సచివాలయం ముందు 2వేల మంది రైతులతో రైతు నేస్తం పేరిట రైతు సంబురాలు జరపాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. పదేండ్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్​ఎస్​ తెలంగాణ తల్లి విగ్రహాన్ని విస్మరించిందన్నారు.తమ పాలనలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేశామన్నారు.రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ లలో నవంబర్ లోపు తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.