- త్వరలోనే కీలక నిర్ణయం.
- ఔటర్, ట్రిపుల్ ఆర్ మధ్య లావాదేవీలపై ప్రత్యేకం.
- ప్రైవేట్ ఎజెన్సీ నివేదికకు ఆదేశం.
- సలహా కమిటీ సమావేశంలో ఇప్పటికే చర్చలు.
- ధరల పెంపు శాస్త్రీయంగా ఉండాలన్న థర్డ్ పార్టీ రిపోర్ట్.
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో గడిచిన ఏడేనిమిదేండ్లు రియల్ ఎస్టేట్ వృద్ధితో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి.రియల్ భూమ్ కొన్నేండ్ల పాటు స్థిరంగా కొనసాగింది. ప్రస్తుతం ఈ రంగం కొంత ఒడిదుడుకుల మధ్య సాగుతున్నా.. కొనుగోళ్లు జరుగుతున్నట్లు రిజిస్ట్రేషన్ లెక్కలు చెబుతున్నాయి.అయితే ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం భూముల ధరలు తక్కువ విలువలు ఉండటంతో సర్కార్ ఆదాయానికి గండి పడుతోంది.ఈ వ్యత్యాసాన్ని తగ్గించి, ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం భూముల మార్కెట్ విలువలను సవరించాలని నిర్ణయించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో మార్కెట్ విలువల కేంద్ర మదింపు సలహా కమిటీ దీనిపై చర్చించింది ప్రైవేట్ ఏజెన్సీ నివేదిక ఆధారంగా, పెంపు శాస్త్రీయంగా ఉండాలని సూచించారు. త్వరలోనే పెంపుపై తుది నిర్ణయం వెలువడనుంది.తాజాగా రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువల పెంపునకు ప్రభుత్వం అంతా సిద్ధం చేసినట్లు తెలుస్తున్నది. ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు మధ్యలోని భూముల లావాదేవీలపై రిజిస్ట్రేషన్ మార్కెట్ ధరలను పెంచనున్నారు.అపార్ట్మెంట్స్పై 30 శాతం, ఓపెన్ ప్లాట్లపై వందశాతం, అంతకంటే ఎక్కవగా పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం వేగంగా వృద్ధి చెందుతోందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మారు మూల పల్లెల్లోనూ ఎకరం లక్షల్లో పలుకుతుండగా..ప్రభుత్వ రికార్డుల్లోని వాటి విలువలు తక్కువగా ఉంటుంది. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి పడుతోంది. భూముల మార్కెట్ విలువ, రిజిస్ట్రేషన్ వాల్యూ మధ్య వ్యత్యాసాన్ని తగ్గించి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. భూముల మార్కెట్ విలువలను పెంచేందుకు వేగంగా అడుగులు వేస్తోంది.ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో జరిగిన వనరుల సమీకరణ సమావేశంలో భూముల విలువ పెంపుపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు సూచించారు. దీనితో రాష్ట్ర స్థాయిలో మార్కెట్ విలువల కేంద్ర మదింపు సలహా కమిటీ (సీవీఏసీ) సమావేశమై ఈ అంశంపై చర్చించింది. గతంలోనే ఒక ప్రైవేట్ ఏజెన్సీతో భూముల విలువ పెంపుపై అధ్యయనం చేయించిన ప్రభుత్వం, ఆ నివేదిక ఆధారంగా ఆదాయాన్ని పెంచే మార్గాలను పరిశీలించాలని రిజిస్ట్రేషన్ శాఖకు సూచించింది. పలు దఫాలు సమావేశమైన అధికారులు తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదించారు. రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న ఈ విలువ పెంపుపై త్వరలోనే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. తాజాగా నివేదిక ఇవ్వాలని కోరడంతో పెంపు ఖాయమనే చర్చ జరుగుతోంది.రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ చైర్మన్‌గా, జాయింట్ ఐజీ కన్వీనర్‌గా వ్యవహరించే సీవీఏసీలో సీసీఎల్‌ఏ కార్యదర్శి, ఇతర శాఖల అధికారులు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ భూముల మార్కెట్ విలువలను సమీక్షించి, అవసరమైన సిఫార్సులతో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుంది. ఇటీవల మంగళవారం రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయంలో సీవీఏసీ సమావేశమై మార్కెట్ విలువలపై చర్చించింది. త్వరలో మరోసారి సమావేశమై పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. భూముల విలువలను ఎంత పెంచాలనేది ప్రభుత్వమే నిర్ణయించుకోవాలని, అయితే ఈ పెంపు శాస్త్రీయంగా ఉండాలని థర్డ్ పార్టీ ఏజెన్సీ తన నివేదికలో పేర్కొంది.అధికారులు తయారు చేసిన నివేదిక శాస్త్రీయంగా ఉందా, భూముల వాస్తవ ధరలకు, పుస్తక విలువలకు మధ్య ఉన్న వ్యత్యాసం ఎంత, దానిని సవరించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, శాస్త్రీయంగా పెంచడం వల్ల కలిగే ప్రయోజనాలు వంటి అంశాలపై ఏజెన్సీ తన అభిప్రాయాన్ని తెలియజేసింది.ఈ నిర్ణయం ప్రభుత్వానికి అదనపు ఆదాయాన్ని సమకూర్చడమే కాకుండా భూముల మార్కెట్ విలువలను వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా తీసుకురావడంలో సహాయపడతాయని అధికారులు భావిస్తున్నారు.