Take a fresh look at your lifestyle.

భూ అమ్మకాలకు రంగం సిద్ధం

  • కేబినెట్‌లో కీలక చర్చ ఇదే.
  • హెచ్‌ఎండీఏ, హౌసింగ్‌ భూములపై సుదీర్ఘ చర్చ.
  • ఇందిరమ్మ ఇండ్లు, గ్రేటర్‌లో ప్రాజెక్టుల కోసం నిధుల సమీకరణ.
  • రూ. 10 వేల కోట్లు వస్తాయని ప్రాథమిక అంచనా.
  • ఈసారి జాబితాతో కోకాపేట భూములు కూడా..!
  • ఆమోదం చెప్పిన మంత్రివర్గం..?

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో భూముల అమ్మకాలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మరో కీలక చర్చ జరిగినట్లు తెలుస్తున్నది. వచ్చే రెండు, మూడు నెలల్లో రూ. 5 నుంచి రూ. 10 వేల కోట్లను భూ అమ్మకాల ద్వారా సమకూర్చుకునేందుకు సిద్ధమయ్యారు. దీనిలో భాగంగా హైదరాబాద్‌లో భూముల వేలం మళ్లీ మొదలు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. హెచ్‌ఎండీఏ ద్వారా ఈసారి రూ.5 వేల కోట్లు, హౌసింగ్‌ భూములను అమ్మి మరో 5 వేల కోట్లను టార్గెట్‌గా పెట్టుకుంది. ఇందిరమ్మ ఇండ్ల పథకంతో పాటుగా రోడ్లు, హెచ్‌ఎండీఏ పరిధిలోని పనులకు నిధులు అత్యవసరం కావడంతో.. భూముల అమ్మకాలపై ఆశలు పెట్టుకున్నారు.ఇప్పటి వరకు హెచ్‌ఎండీఏ చేతిలో కోకాపేట్, ఉప్పల్ భగాయత్ వంటి ప్రాంతాల్లో ప్లాట్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. గతంలో మంచి స్పందన రావడంతో ఇక్కడ మళ్లీ వేలం వేస్తున్నారు. రెండు, మూడు దశల్లో మరో పది ప్రాంతాల్లో ఉన్న ప్లాట్లను వేలం వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అటు హెచ్‌ఎండీఏ సైతం నివేదించింది. అటు నగరంలో ప్రారంభించనున్న కొన్ని ప్రాజెక్టులు, మౌలిక సదుపాయల కల్పన, రోడ్ల విస్తరణ వంటి కార్యక్రమాల కోసం వినియోగించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

  • విడుతల వారీగా..!

హైదరాబాద్‌ మహానగరాభివృద్ధిలో భాగంగా మెగా మాస్టర్‌ప్లాన్‌– 2050, అలానే సికింద్రాబాద్ నుంచి డెయిరీఫాం, శామీర్‌పేట్ వరకు ఎలివేటెడ్ కారిడార్లను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి కావడానికి సుమారు 3 వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చవుతోందని అంచనా వేస్తున్నారు. వీటితో పాటుగా హుస్సేన్‌సాగర్ సుందరీకరణ, ఇతర అభివృద్ధి పనుల కోసం భూముల అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఖర్చు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం మొదటి దశలో భాగంగా.. గతంలో భూములు వేలం వేసినప్పుడు.. కొనుగోలుదార్ల నుంచి ఎక్కువ స్పందన వచ్చిన ప్రాంతాల్లో మిగిలిపోయిన ప్లాట్లను వేలం వేస్తారు. వాటిని అమ్మిన తర్వాత.. రెండు, మూడు దశల్లో వేరే ప్రాంతాల్లోని స్థలాలను వేలం వేసేందుకు అధికారులు రెడీ అవుతున్నారు.ఈ మొదటి దశలో గతంలో భూములు వేలం వేసినప్పుడు తుర్కయంజాల్, ఉప్పల్ భగాయత్, కోకాపేట్‌ నియోపొలిస్‌, ఇన్ముల్‌నర్వ ప్రాంతాల్లో కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపారు. గతంలో ఈ ప్రాంతంలో భూములు వేలం వేయడం ద్వారా.. అప్పటి ప్రభుత్వానికి రూ.వేల కోట్ల ఆదాయం లభించినట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు కూడా ముందుగా మొదటి దశలో భాగంగా ఈ ప్రాంతంలోని ప్లాట్లను వేలం వేయనున్నారు.

  • ఇక్కడ కూడా..!

గతంలో వేలం సందర్బంగా కోకాపేట్‌లో అయితే భూముల ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోయాయి. ఈ ప్రాంతంలో భూముల కొనుగోలుకు విదేశాల్లో ఉన్న వారితో పాటుగా.. దేశంలోని అనేక నిర్మాణ సంస్థలు, రియల్ ఎస్టేట్ కంపెనీలు పోటీ పడ్డాయి. అలానే ఉప్పల్‌భగాయత్‌లో కూడా కొనుగోలుకు మంచి స్పందన లభించడంతో.. ఇక్కడ రెండు దశల్లో ప్లాట్‌లను విక్రయించారు. ఇక మొదటి దశ పూర్తయిన తర్వాత.. రెండూ, మూడు దశల్లో మరో పది ప్రాంతాల్లో స్థలాల వేలం వేయనున్నారు. కోకాపేట్‌, ఉప్పల్ భగాయత్, తుర్కయాంజల్, ఇన్ముల్‌నర్వ నాలుగు ప్రాంతాల్లో హెచ్ఎండీఏ రైతుల నుంచి భూములు సేకరించింది. ఇలా సేకరించిన భూములపై రైతులకు 60 శాతం ప్లాట్‌లను కేటాయించింది. మిగిలిన 40 శాతం ప్లాట్లు హెచ్‌ఎండీఏకు లభించాయి.హెచ్‌ఎండీఏ దగ్గర మొత్తం ప్లాట్లు 1,141 ఉండగా..వీటిల్లో రైతులకు కేటాయించినవి 696. మిగిలిన వాటిల్లో ఇప్పటి వరకు విక్రయించినవి 59 కాగా, అమ్మకానికి 385 ప్లాట్లు రెడీగా ఉన్నాయి. త్వరలోనే వీటిని వేలం వేసేందుకు రెడీ అవుతున్నారు.

  • ఇండ్ల బిల్లులకు ఇవే.

ఇందిరమ్మ ఇళ్ల పథకం నిధుల సమీకరణలో భాగంగా మంత్రిమండలి కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం..హౌసింగ్ బోర్డు ఆధీనంలోని వివాదరహిత ప్లాట్లను వేలం వేయనుంది.ఈ వేలం ద్వారా వచ్చే నిధులను ఇందిరమ్మ పథకానికి వినియోగిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 70 వేలకు పైచిలుకు లబ్ధిదారులను ఎంపిక చేశారు. ప్రతి నియోజవకవర్గానికి 3500 ఇండ్లు కేటాయించేందుకు సిద్ధమవుతున్నారు. ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం చేయనుండగా.. మెుత్తం 4 విడతల్లో ఈ నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు నిధుల సమీకరణ కోసం తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర హౌసింగ్ బోర్డు తమ ఆధీనంలోని వివాదరహిత ప్లాట్లను వేలం వేయడానికి సిద్ధమవుతోంది. అన్ని జిల్లాల్లో గుర్తించిన ఈ ప్లాట్ల వివరాలను అధికారులు సిద్ధం చేశారు. త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసి, ఈ వేలం ద్వారా భారీగా రెవెన్యూ సమకూర్చుకోవాలని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నిధులను నేరుగా ఇందిరమ్మ పథకానికి ఉపయోగించాలని భావిస్తోంది.

  • 1250 ప్లాట్లతో వేల కోట్లు.

హైదరాబాద్‌తో పాటు జోగుళాంబ గద్వాల, జడ్చర్ల, ఇతర జిల్లా కేంద్రాల్లోని ప్లాట్లను వేలం వేయనున్నారు. అధికారులు గుర్తించిన ప్లాట్లలో కోర్టు వివాదాలు లేనివి, ఎలాంటి కేసులు లేనివి, కమర్షియల్ ఏరియాల్లో ఉన్నవి ఉన్నాయి. మొత్తం 1250 జాగాలు (ప్లాట్లు) ఉండగా, ఇవి సుమారు 3.22 లక్షల చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్నాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా, హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి సమీపంలోని ఖైతలాపూర్‌లోనే 250కి పైగా ప్లాట్లు ఉన్నట్లు సమాచారం. ఈ ప్లాట్లకు మార్కెట్ విలువ ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో హౌసింగ్ బోర్డుకు వేల కోట్ల విలువైన వందల ఎకరాల భూములు, ప్లాట్లు ఉన్నాయి.హైదరాబాద్, రంగారెడ్డితో పాటు మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ జిల్లాల్లో ఈ భూములు అధికంగా ఉన్నాయి. అన్యాక్రాంతం కాకుండా వీటిని పరిరక్షించడానికి హౌసింగ్ బోర్డు చర్యలు చేపట్టింది. ప్లాట్ల చుట్టూ గోడలు, ఫెన్సింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే, అవి హౌసింగ్ బోర్డు భూములు అని తెలియజేస్తూ బోర్డులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ చర్యల ద్వారా ప్రభుత్వ ఆస్తులను కాపాడటంతో పాటు, వేలం ద్వారా సమీకరించిన నిధులతో ఇందిరమ్మ వంటి ప్రజా సంక్షేమ పథకాలకు ఊతం ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

  • మంత్రి వర్గం ఆమోదం..?

భూముల అమ్మకాలపై గురువారం జరిగిన కేబినెట్‌లో సుదీర్ఘంగా చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. ఎందుకంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల పథకంతో పాటు గ్రేటర్‌, హెచ్‌ఎండీఏ పరిధి కొన్ని పథకాలు, ప్రాజెక్టులకు నిధులు చాలా అవసరం.అందుకే ఈ భూముల మీద నివేదిక తెప్పించుకున్న ప్రభుత్వం..వీటిని అమ్మేందుకు ఆమోదం చెప్పినట్లు తెలుస్తున్నది. గతంలోనే ఈ భూములపై ఆయా శాఖలు సుదీర్ఘ నివేదికను అందించాయి. ఈసారి కొంత ధర పెంచి ప్లాట్లుగా విక్రయించేందుకు అంతా సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. తాజాగా మంత్రివర్గం కూడా ఆమోదించడంతో.. ఇక భూముల అమ్మకాలు మొదలుకానున్నాయి.

Leave A Reply

Your email address will not be published.