- సోమవారం పొద్దున్నే రండి.
- గతంలో నోటీసులు ఇచ్చిన ఏసీబీ.
- విదేశాలకు వెళ్తున్నానంటూ వాయిదా వేయించుకున్న కేటీఆర్.
- చిల్లర వేషాలు అంటూ మండిపడ్డ కేటీఆర్.
- ఫార్ములా సంస్థ అకౌంట్లోనే ఇంకా 44 కోట్లు.
- విచారణకు కచ్చితంగా వెళ్తా.
- ఓటుకు నోటు కేసు కూడా ఏసీబీ దగ్గర పెండింగ్ ఉంది.
- లై డిటెక్టర్ టెస్ట్‌కు సిద్ధమా..?
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఫార్ములా ఈ రేసు కేసు విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కేటీఆర్కు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. సోమవారం ఉదయం తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు.ఇంతకు ముందు ఓసారి నోటీసులు జారీ చేసినా.. తాను విదేశీ పర్యటనకు వెళ్తున్నానని రాలేనని, వచ్చిన తర్వాత విచారణకు హాజరవుతానని చెప్పారు. ఆ మేరకు ఏసీబీ అధికారులు ఇప్పుడు నోటీసులు జారీ చేశారు.ఈ ఫార్ములా ఈ రేసు కేసు విషయంలో ఓసారి ఈడీ ఎదుట కూడా హాజరయ్యారు. ఏసీబీ విచారణకు వెళ్లినా లాయర్ ను అనుమతించలేదని మళ్లీ వెనక్కి వెళ్లిపోయారు. అప్పట్లోనే మరోసారి పిలుస్తారని ప్రచారం జరిగింది కానీ ఎలాంటి నోటీసులు రాలేదు. చాలా కాలం తర్వాత గత నెలలో నోటీసులు ఇచ్చారు.ఈ నోటీసులపై అప్పట్లో కేటీఆర్ కేటీఆర్ సోషల్ మీడియాలో స్పందించారు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, కేసు పూర్తిగా రాజకీయ వేధింపు అయినప్పటికీ, నేను ఖచ్చితంగా ఏజెన్సీలతో సహకరిస్తానననిప్రకటించారు. చాలా ముందుగానే పార్టీ కార్యక్రమాల కోసం విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నానని, తాను తిరిగి వచ్చిన తర్వాత వారి ముందు హాజరవుతానంటూ ఏసీబీ అధికారులకు లిఖితపూర్వకంగా తెలియజేశాననని ప్రకటించారు.ఆ ప్రకారం ఇప్పుడు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది.
నిజానికి, ఏసీబీ కేసును క్వాష్ చేయాలని కేటీఆర్ సుప్రీంకోర్టు వరకూ వెళ్లారు. కానీ అనుకున్న ఫలితంరాలేదు. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను వెంటనే విచారించాల్సిన అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. దీంతో అప్పట్లో ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. ‘అసలు ఫార్ములా ఈ రేస్ ఎందుకు తీసుకురావాలనుకున్నారు.?, ఎవరి నిర్ణయం వల్ల నగదు బదిలీ చేశారు.?, హెచ్ఎండీ నిధులు ఎలా బదిలీ చేశారు.?, అగ్రిమెంట్లు, ఆర్బీఐ అనుమతి లేకుండా ఎలా చెల్లింపులు చేశారు.?, హెచ్‌ఎండీఏ నుంచి ఈ కార్ రేసింగ్‌కు రూ.55 కోట్లు ట్రాన్స్‌ఫర్ ఎలా జరిగింది.?, ఐటీకి హెచ్‌ఎండీఏ రూ.8.6 కోట్లు ఎందుకు పే చేయాల్సి వచ్చింది.?, 10 సీజన్స్ నిర్వహించాలని వారు షరతులు విధించారా.?, అర్వింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిల పాత్ర ఏంటి.?’ వంటి వాటిపై గత విచారణలో అడిగినట్లుగా చెబుతున్నారు. ఎన్నికలకు ముందు ఫార్ములా ఈ నిర్వహించే కంపెనీకి హెచ్‌ఎండీఏ ఖాతా నుంచి యాభై కోట్ల ను చెల్లించారు. అయితే అలాంటి చెల్లింపుల కోసం కనీసం కేబినెట్ అనుమతి కూడా తీసుకోలేదు.కేవలం కేటీఆర్ నోటి మాట ద్వారానే చెల్లించేశారు. తర్వాత ఎన్నికల్లో..బీఆర్ఎస్ పరాజయం పాలైంది. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో యాభై కోట్ల గోల్ మాల్ పై చర్యలు ప్రారంభించారు. అయితే తన ఆదేశంతోనే చెల్లించామని కేటీఆర్ అంగీకరిస్తున్నారు. ఫార్ములా ఈ రేసు కోసం.. హైదరాబాద్ కోసమే చెల్లించామని అంటున్నారు. ఇందులో అవినీతికి అవకాశమే లేదని చెబుతున్నారు.
- అవన్నీ చిల్లర వేషాలు : కేటీఆర్
తమ పరిపాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, పరిపాలన చేతకాని సీఎం రేవంత్ రెడ్డి నోటీసుల పేరుతో నాటకాలు ఆడుతున్నాడని కేటీఆర్ అన్నారు. అబద్ధాలతో అధికారంలోకి వచ్చి, ప్రభుత్వాన్ని నడపడం చేతకాని జోకర్ ముఖ్యమంత్రి ప్రజల దృష్టి మరల్చేందుకు పూటకో వేషం వేస్తున్నాడని, రోజుకో కుట్ర చేస్తున్నాడనీ, కానీ ఈ చిల్లర చేష్టలు, పనికిరాని డ్రామాలతో ప్రతినిత్యం తెలంగాణ ప్రజల గొంతుకై పోరాడుతున్న మమ్మల్ని అడ్డుకోలేరని కేటీఆర్ ఆరోపించారు. ఫార్ములా ఈ రేసు నిర్వహణ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం హెచ్ఎండిఏ అధికారిక బ్యాంకు ఖాతా నుంచి పారదర్శకంగా, సాధికారికంగా పంపిన రూ. 44 కోట్లు ఇప్పటికీ ఫార్ములా ఈ సంస్థ అకౌంట్ లోనే ఉన్నా, వాటిని వెనక్కి రప్పించడం చేతకావడం లేదన్నారు.హైదరాబాద్ నగరానికి తెలంగాణకు ఎంతగానో పేరు తీసుకువచ్చిన ఫార్ములా ఈ రేసును అర్ధాంతరంగా రాజకీయ దురుద్దేశంతో రద్దు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఫార్ములా ఈ సంస్థ వద్ద ఉన్న 44 కోట్ల ప్రజాధనాన్ని వెనక్కి తీసుకువచ్చే ప్రయత్నం ఎందుకు చేయడం లేదన్నారు.నోటీసుల పేరుతో ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకునేందుకు కుట్ర చేశారన్నారు. తనకు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చిన, విచారణ పేరుతో సాగదీసినా ఫార్ములా ఈ అంశం సంపూర్ణ పారదర్శకంగా జరిగిందని, ఈ విషయం అందరికీ తెలుసు అని కేటీఆర్ అన్నారు. తాజాగా మరోసారి ఇదే అంశంలో ఏసీబీ తనకు నోటీసు ఇచ్చిందని, చట్టాలను గౌరవించే పౌరుడిగాతప్పకుండా సోమవారం ఉదయం 10 గంటలకు ఏసీబీ విచారణకు హాజరవడంతోపాటు.. విచారణకు అన్నివిధాలుగా సహకరిస్తానన్నారు.అయితే పదేళ్ల క్రితం నోటుకు ఓటు కుంభకోణంలో నోట్లకట్టలున్న నల్లబ్యాగుతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ రేవంత్ రెడ్డి కేసు కూడా ఇదే ఏసీబీ పరిధిలో పెండింగ్ లో ఉందన్న విషయం కేటీఆర్ గుర్తు చేశారు. ఇద్దరిపై కూడా ఏసీబీ కేసులున్న నేపథ్యంలో.. ఇద్దరిలో దోషులెవరో, నిర్దోషులెవరో తేల్చేందుకు జడ్జి సమక్షంలో లైవ్ టెలివిజన్ సాక్షిగా లై డిటెక్టర్ టెస్టును ఎదుర్కొనే దమ్మూ, ధైర్యం సీఎంకు ఉందా అని సవాల్ చేశారు. లై డిటెక్టర్ టెస్టుకు తాను సిద్దం అని, సీఎం సిద్ధమా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.