– పాలమూరు లో వైద్య రంగ అభివృద్ధి కి ప్రభుత్వం కృషి
– వైద్య సేవలు, విద్యా ప్రమాణాల పెంపు పై ప్రభుత్వం దృష్టి
– దక్షిణ తెలంగాణ లో వైద్య రంగానికి కేంద్రంగా పాలమూరు అభివృద్ధి
– మెడికల్ కళాశాలలో లో సీట్ల పెంపు, పీజీ కోర్సుల విస్తరణ
– జూన్ లో పాలమూరు సూపర్ స్పెషలిటీ ఆసుపత్రి ని ప్రారంభిస్తాం
– వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
………………………………………
ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
……………………………………….
దక్షిణ తెలంగాణ లో పాలమూరు జిల్లా ను మెడికల్ హబ్ గా తీర్చి దిద్దుతాం… మెడికల్, పీజీ కోర్సు ల విస్తరణ పెంచి వైద్య విద్యను విశ్రుత పరుస్తాం…పేదలకు వైద్య సేవలు అందించేందుకు జూన్ లో పాలమూరు సూపర్ స్పెషలిటీ ఆసుపత్రి ని ప్రారంభిస్తాం.. అని వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి దామోదర రాజానర్సింహా వెల్లడించారు.

శుక్రవారం జిల్లా ఆసుపత్రి లో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తో కలిసి మంత్రి పాల్గొన్నారు.ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో భాగంగా మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిర్వహించిన మెగా మెడికల్ క్యాంపు, స్వచ్చంద రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు, అక్కడే ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్ జిల్లాను దక్షిణ తెలంగాణ వైద్య రంగానికి కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతున్నదని, మెడికల్ కళాశాల లో సీట్ల పెంపు, పీజీ కోర్సుల విస్తరణ, విద్యార్థులకు వేర్వేరు హాస్టల్ సదుపాయాలు, ఆడిటోరియం నిర్మాణం వంటి అంశాలను ప్రాధాన్యతగా తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కొత్త గా నిర్మిస్తున్న సూపర్ స్పెషలిటీ ఆసుపత్రి భవనం పనులు త్వరలో పూర్తిచేసి, జూన్ నెలలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
టీచింగ్ హాస్పిటల్ ప్రారంభంతో పాటు హాస్టల్స్, ఆడిటోరియం నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.మెడికల్ కళాశాల,ఆసుపత్రికి అవసరమైన అదనపు మౌలిక సదుపాయాలను ప్రభుత్వం పూర్తిగా సమకూర్చుతుందని స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్‌ను సూపర్ స్పెషాలిటీ మెడికల్ హబ్‌గా అభివృద్ధి చేయడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. దక్షిణ తెలంగాణలోని నారాయణపేట, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాలకు మహబూబ్‌నగర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రెఫరల్ సెంటర్‌గా పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగా ఎంఆర్ఐ వంటి ఆధునిక వైద్య సదుపాయాలను స్థానికంగా అందుబాటులోకి తీసుకురావడం, ఆర్గన్ ట్రాన్స్‌ప్లాంట్ రిట్రీవల్ సెంటర్, వాస్క్యులర్ యాక్సెస్ సెంటర్ వంటి ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు. మెడికల్ కాలేజ్‌లో ప్రస్తుతం ఉన్న విభాగాలకు అదనంగా మరో 14 డిపార్ట్‌మెంట్లను ఏర్పాటు చేసి, ముఖ్యంగా సర్జికల్ విభాగాలను బలోపేతం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. టీచింగ్ ఫ్యాకల్టీ కొరతను తీర్చేందుకు నియామకాలు చేపడుతున్నామని, ఇప్పటికే అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామక ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. సామాన్య ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు, విద్యార్థులకు మెరుగైన మెడికల్ ఎడ్యుకేషన్ అందించడంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడదన్నారు.మహబూబ్‌నగర్ లో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కింద చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రశంసనీయమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రుల అభివృద్ధి, అవసరమైన హ్యూమన్ రిసోర్సుల సమీకరణలో వైద్య మంత్రి తీసుకుంటున్న చర్యలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు. ఈ ప్రాంతంలో ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న వైద్య సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన ప్రణాళికలతో ముందుకు సాగుతోందని ఆయన అన్నారు. తాను గతంలో ఎమ్మెల్యేగా, ప్రస్తుత ఎంపీ డికె అరుణ అప్పట్లో మంత్రిగా ఉన్నారని,ఆ సమయంలో మెడికల్ కాలేజ్ అవసరాన్ని పలు మార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఆ సమయంలో సంబంధిత మంత్రిత్వ శాఖతో చర్చలు జరిపి, ప్రపోజల్స్‌ను ముందుకు తీసుకెళ్లడంలో నాడు విద్యాశాఖ మంత్రిగా ఉన్న దామోదర రాజనర్సింహ పాత్ర కీలకంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.. మంత్రిగారి చొరవతోనే మహబూబ్‌నగర్‌లో మెడికల్ కాలేజ్,ఆసుపత్రి ఏర్పాటుకు దారి తీసిందని, దీంతో స్థానిక ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. అనంతరం పాత పాలమూరు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళల ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన డిజిటల్ హెల్త్ కార్డులను మంత్రి పంపిణీ చేశారు. మహిళల ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మహిళలకు 32 రకాల ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచిత వైద్యం అందిస్తామని తెలిపారు. మహిళలు ఆరోగ్యంగా ఉండేలా ముందస్తు వైద్య సేవలను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్. చోంగ్తు, జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మేయర్ గుమ్మాల మమత , మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత, జాయింట్ కలెక్టర్లు హరిప్రియ, మధుసూదన్ నాయక్ , డిప్యూటీ మేయర్ మారే పల్లి సురేందర్ రెడ్డి, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రంగ అజ్మీర,కార్పొరేటర్ సల్మాన్, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు రాఘవేందర్, డాక్టర్ సామ్యెల్, సాదతుల్లా వివిధ డివిజన్ల కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
………………….