Take a fresh look at your lifestyle.

ఈ నెల 9 నుంచి అక్రిడిటేషన్ కార్డులకు దరఖాస్తులు

 

జీవో నెం.252 రిలీజ్

అక్రిడిటేషన్ కోటాలో కూడా మహిళా జర్నలిస్టులకు ప్రాధాన్యత

కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ

ముద్ర, తెలంగాణ బ్యూరో :

రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టుల కోసం ‘తెలంగాణ మీడియా అక్రిడిటేషన్ రూల్స్-2025’ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. ఈ మేరకు సమాచార పౌర సంబంధాల శాఖ శుక్రవారం జీవో నెం.252ను జారీ చేసింది, కొత్త నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియను ప్రారంభించింది. ఇందులో భాగంగా అర్హులైన ప్రింట్, ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్ మీడియా ప్రతినిధులు ఈనెల 9 నుంచి సమాచార పౌర సంబంధాల శాఖ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం… జిల్లా స్థాయిలో అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితి రెండు సంవత్సరాలు ఉండనుంది. అక్రిడిటేషన్లకు అర్హత కోసం దినపత్రికలు కనీసం 2 వేల ప్రతుల సర్క్యులేషన్ కలిగి ఉండాలనే నిబంధన పెట్టారు. వార, పక్ష పత్రికలు కనీసం 18 నెలల పాటు నిరంతరంగా ప్రచురితమై ఉండాలనే నిబంధన పెట్టారు. డెస్క్ జర్నలిస్టుల విషయంలో మీడియా సంస్థలు కనీసం 33 శాతం మహిళలకు కేటాయించడం తప్పనిసరి చేశారు. అక్రిడిటేషన్ కోటాలో కూడా మహిళా జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కనీసం ఏడాది కాలంగా నడుస్తున్న వెబ్‌సైట్లు, గత ఆరు నెలల్లో సగటున నెలకు 5 లక్షల యూనిక్ విజిటర్లను కలిగి ఉన్న పక్షంలో అక్రిడిటేషన్‌కు అర్హలు. కార్డు జారీ తర్వాత అక్రిడిటేషన్ కార్డు పోతే డూప్లికేట్ లేదా రీప్లేస్‌మెంట్ కార్డుల కోసం రూ.250 రూపాయల రుసుము చెల్లించాల్సి ఉంటుందని నిబంధనలు చెబుతున్నాయి. ఇక రాష్ట్ర స్థాయి అక్రిడిటేషన్ కమిటీకి మీడియా అకాడమీ చైర్మన్ అధ్యక్షత వహించనుండగా, ఐ అండ్ పీఆర్ కమిషనర్ కో-చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ కమిటీకి చైర్మన్‌గా ఉంటారు. ఈ కమిటీలలో జర్నలిస్టు సంఘాల ప్రతినిధులకు కూడా స్థానం కల్పించారు. కొత్త నిబంధనల ప్రకారం.. అక్రిడిటేషన్ పొందిన ప్రతినిధులు కార్డులను కేవలం వృత్తిపరమైన అవసరాలకు మాత్రమే ఉపయోగించాలి. తమ విజిటింగ్ కార్డులు లేదా లెటర్ హెడ్‌లపై ‘ప్రభుత్వ గుర్తింపు పొందిన’అని ముద్రించుకోకూడదని కొత్త అక్రిడిటేషన్ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.

Leave A Reply

Your email address will not be published.