రూ. కోటి పరిహారం ఇస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా
సిగాచీ మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వడంతో కాంగ్రెస్ వైఫల్యం
పథకాలు అమలుపై ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డి బూతులతో సమాధానం చెబుతున్నడు
బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలను బేరీజు వేసుకోండి
ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి హరీశ్ రావు
ముద్ర, సంగారెడ్డి :
గతేడాది జూన్ 30న సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో ఉన్న సిగాచి ఇండస్ట్రీస్ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి రూ. కోటి పరిహారం ఇస్తే.. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని మాజీ మంత్రి హరీశ్‌రావు సంచలన సవాల్ విసిరారు. ప్రమాదం జరిగిన సమయంలో మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ప్రకటిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కేవలం సిగాచీ కంపెనీ మాత్రమే మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇచ్చిందని తెలిపారు. శుక్రవారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పటాన్ చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ మహిళలతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. సిగాచి కంపెనీలో ఏకంగా 54 మంది ప్రాణాలు కోల్పోతే కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని మండిపడ్డారు. ప్రభుత్వం ఇస్తామన్న పథకాలు అమలు చేయాలని ప్రశ్నిస్తే వారికి సీఎం రేవంత్ రెడ్డి బూతులతో సమాధానం చెబుతున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పాలనలో అన్నీ బంద్ అయ్యాయని ఎద్దేవా చేశారు. హామీల పేరుతో ప్రజలకు ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రంలో పదేండ్ల కేసీఆర్ పాలనతో పాటు ఈ రెండేళ్ల కాంగ్రెస్ పాలన చూస్తున్నారని చెప్పారు. ఈ మధ్య కొంతమంది పంచాయతీ సెక్రటరీలు, ఉద్యోగులు తన వద్దకు వచ్చి వాళ్ల బాధలు చెప్పుకున్నారన్నారు. మీకు ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్, పర్మినెంట్ చేసింది కేసీఆర్, జీతాలు పెంచింది కేసీఆర్. కానీ ఆయన్ను ఓడగొట్టి కాంగ్రెస్ ను గెలిపించింది మీరే కదా అని తన వద్దకు వచ్చిన వారితో అన్నానని హరీష్ రావు గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి మాటలు నమ్మి మోసపోయామని ఇప్పుడు వాళ్ళు బాధ పడుతున్నారన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేదని అన్ని వర్గాల ప్రజలు గుర్తించారన్నారు. రెండేళ్ల తర్వాత కేసీఆరే మళ్లీ సీఎం అవుతారని జోస్యం చెప్పారు. రేవంత్ రెడ్డివి వట్టి మాటలేనని, చేతల్లో చూపించే తత్వం ఆయనది కాదన్నారు. రూ.200 ఉన్న పెన్షన్ రూ.2 వేలు చేసింది కేసీఆర్ అన్న హరీశ్ రావు… రేవంత్ రెడ్డి రూ.4 వేలు ఇస్తానని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. ఈ 24 నెలల్లో ఒక్కో అవ్వతాతలకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.52 వేలు బాకీ పడిందన్నారు. అత్తా కోడలు ఇద్దరికీ రూ.2500 ఇస్తానని చెప్పి ఇద్దరికీ మొండిచేయి చూపించాడని విమర్శించారు. కేసీఆర్ కిట్ , కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తానని ఆశపెట్టి..రూ. లక్ష చెక్కును కూడా నెలల తరబడి ఆపుతున్నారన్నారు. కేసీఆర్ రాకముందు ఇస్నాపూర్‌లో పవర్ హాలిడేస్ ఉండేవని, కేసీఆర్ వచ్చాక 24 గంటల కరెంట్ ఇవ్వడంతో.. ఇక్కడ పరిశ్రమల్లో ఓటీలు దొరికి సంపాదించుకున్నారని చెప్పారు.ఇప్పుడు మళ్ళీ కరెంట్ కోతలు మొదలయ్యాయని, ఫ్రీ బస్సు అని చెప్పి ఆటో వాళ్ల పొట్ట కొట్టారని, మగోళ్లకు టికెట్ డబుల్ చేసి బాదపెడున్నారని మండిపడ్డారు. ఇస్నాపూర్ లో మీకు అందుబాటులో ఉండే వాళ్లకు, మీ భవిష్యత్తును బాగా చూసుకునే వాళ్లకు ఓటెయ్యాలని హరీష్ రావు పిలుపునిచ్చారు.