ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్;
దేశంలో గ్యాస్ కొరతను నివారించడంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఐ నాయకులు తీవ్రంగా విమర్శించారు. సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు నాగర్ కర్నూల్‌లో సోమవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యాలయం నుంచి ఖాళీ గ్యాస్ సిలిండర్లతో అంబేద్కర్ చౌరస్తా వరకు ప్రదర్శన చేపట్టారు. అనంతరం కట్టెల పొయ్యిపై జొన్న రొట్టెలు వండి వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా “దేశంలో గ్యాస్ కొరత సిగ్గు సిగ్గు” అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దాడుల ప్రభావంతో దేశంలో గ్యాస్ కొరత మరింత పెరిగిందని అన్నారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ కొరతపై ముందస్తు చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని, ఆన్లైన్‌లో బుక్ చేసుకున్న ప్రతి పౌరుడికి వెంటనే గ్యాస్ సిలిండర్ అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లబ్ధిదారులకు గ్యాస్ సరఫరా చేయకపోతే పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే గ్యాస్ గోదాములను ముట్టడించేందుకు కూడా వెనుకాడమని సిపిఐ నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర, జిల్లా నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.